న్యూఢిల్లీ : విద్యాసంస్థల్లో హిజాబ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరిస్తూ కర్ణాటక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై స్పందన తెలియచేయాలని కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్ హేమంత్ గుప్తా , జస్టిస్ సుధాంశుతో కూడిన ధర్మాసనం ఈమేరకు నిర్ణయం తీసుకొంది. ఈ విచారణను సెప్టెంబర్ 5 వ తేదీకి వాయిదా వేసింది. ఇదే సమయంలో వాయిదా కోరిన కొందరు పిటిషనర్లను ఉద్దేశించి న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
తాము ఇలాంటి ‘ఫోరం షాపింగ్ ’ను అనుమతించమని పేర్కొంది. హిజాబ్ ధరించడం రాజ్యాంగం లోని ఆర్టికల్ 25 కింద వచ్చే తప్పనిసరైన మతాచారం కాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలు పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. కళాశాల తరగతి గదుల్లో హిజాబ్ ధరించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉడిపి లోని ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.