Friday, November 22, 2024

నీట్ ఎస్‌ఎస్ పరీక్షలో మార్పులపై సుప్రీం ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

Supreme outrage over changes in Neet SS exam

యువడాక్టర్లతో ఫుట్‌బాల్ ఆటలా?
నీట్ ఎస్‌ఎస్ పరీక్షలో మార్పులెందుకు?
కేంద్రంపై నిప్పులు చెరిగిన సుప్రీం
తెలివితక్కువ అధికారుల నిర్వాకమా
వివరణతో 4న కోర్టుకు రండి
లేకపోతే తీవ్ర పరిణామాలే

న్యూఢిల్లీ : నీట్ ఎస్‌ఎస్ 2021 పరీక్ష ప్రక్రియలో ఆకస్మిక, చిట్టచివరి మార్పులను వెలువరించడం పట్ల కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నో ఆశలతో ఉండే యువడాక్టర్లతో చెలగాటమాడుకోకండి, వారిని అధికారపు ఆటలో ఫుట్‌బాల్‌గా చేయకండని చురకలు పెట్టింది. నిర్ణీత సిలబస్‌లో అనాలోచిత మార్పులకు దిగడం ఏమిటని ప్రశ్నించింది. జాతీయ స్థాయి అర్హత, ప్రవేశాలకు సంబంధించిన ఈ పిజి సూపర్ స్పెషాల్టీ ఎగ్జామ్ ఈ ఏడాది నవంబర్ 13, 14 తేదీలలో జరగాల్సి ఉంది. సంబంధిత పరీక్షల ప్రకటనను ఈ ఏడాది జూలై 23న ప్రకటించారు. అయితే పరీక్షా విధానంలో మార్పులను రెండు నెలల తరువాత ఆగస్టు 31వ తేదీన వెలువరించారు. నీట్ ఎస్‌ఎస్ పరీక్షలకు రెండు నెలల వ్యవధి ఉన్న దశలోనే ఈ మార్పుల ప్రకటన వెలువడటాన్ని 41 మంది పిజి డాక్టర్లు న్యాయస్థానంలో సవాలు చేశారు. జనరల్ మెడిసిన్ అభ్యర్థులకు అనుకూలంగా ఉండేందుకే ఈ విధంగా చివరి దశలో మార్పులు చేసినట్లుగా ఉందని వీరు తమ పిటిషన్లలో ఆక్షేపించారు.

2018 లో జరిగిన ఈ పరీక్షకు సంబంధించి 40 శాతం ప్రశ్నలు జనరల్ మెడిసిన్ నుంచి , 60 శాతం ప్రశ్నలు సూపర్ స్పెషాల్టీ అంశాల నుంచి ఉన్నాయి. అయితే ఈ సారి అన్ని ప్రశ్నలు జనరల్ మెడిసిన్ నుంచే ఉంటాయని ఇప్పుడు తెలిపారని, దీనితో తమకు అన్యాయం జరిగిందని పిజి డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాము పాత విధానంలో పరీక్షలకు సిద్ధం అవుతూ ఉండగా తమను నీరుగార్చేలా వ్యవహరించారని తెలియచేసుకున్నారు. ఈ పరీక్షకు మూడేళ్లుగా చదువుకుంటూ ఉంటే అనుకోని ఆపరేషన్‌కు గురి చేస్తారా? అని ప్రశ్నించారు. పిజి వైద్య విద్యార్థుల పిటిషన్లలోని అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, బివి నాగరత్నతో కూడిన ధర్మాసనం కేంద్రంపై విరుచుకుపడింది. కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్యర్య భటిని ఉద్ధేశించి కేసుపై తదుపరి విచారణ అక్టోబర్ 4వ తేదీన ఉంటుందని, ఈ లోగా సంబంధిత అధికారులతో సంప్రదించి కేంద్రం వివరణతో రావాలని ధర్మాసనం ఆదేశించింది.

తుది దశలో పరీక్షా విధానంలో మార్పులపై కేంద్రం ఇచ్చే వివరణతో తాము సంతృప్తి చెందకపోతే తాము కఠిన ఆదేశాలే వెలువరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘కొందరు విచక్షణారహిత బ్యూరోక్రాట్ల ఇష్టారాజ్యపు చర్యలకు ఈ డాక్టర్లు గురి కావడాన్ని సహించేది లేదు. ఇటువంటి ఆకస్మిక నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పటికైనా ఇంటిని చక్కదిద్దుకోండని ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖను, జాతీయ వైద్య కమిషన్‌ను , జాతీయ పరీక్షల మండలిని ఆదేశిస్తున్నాం’ అని ధర్మాసనం తెలిపింది. సరైన వివరణతో రండి లేకపోతే తాము తీసుకునే చర్యకు సిద్దంగా ఉండండని ఈ దశలో న్యాయమూర్తి బివి నాగరత్న తెలిపారు. మౌలిక పరీక్షా విధానంలోనే మార్పులకు సంబంధించి ఇది అత్యంత కీలకమైన విషయం అని, అత్యవసరంగా న్యాయస్థానం జోక్యం చేసుకుని రూలింగ్ వెలువరించాలని అభ్యర్థుల తరఫు న్యాయవాది శ్యామ్ దివాన్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. వివరణకు తమకు మరింత గడువు కావాలని ఎన్‌ఎంసి తరఫు న్యాయవాది గౌరవ్ శర్మ తెలియచేసుకున్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ అసలు ఎన్‌ఎంసి ఏం చేస్తోంది? సూపర్ స్పెషాల్టీ కోర్సులు చేయాలనుకునే యువడాక్టర్ల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఎందుకీ నిర్లక్షం ప్రదర్శించారు? సమాధానం చెపుతారా? అని నిలదీశారు.

ఏళ్ల తరబడి చదవాల్సి ఉంటుంది : జస్టిస్ చంద్రచూడ్

పిజి యువ విద్యార్థులు ఈ పరీక్షకు ఏళ్ల తరబడి చదవాల్సి ఉంటుందని తోటి న్యాయమూర్తి సోదరి నాగరత్న పేర్కోన్న అంశంతో తాను ఏకీభవిస్తున్నానని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. న్యాయశాస్త్రానికి సంబంధించి ఉమ్మడి న్యాయ ప్రవేశ పరీక్ష (సిలాట్) ఉందని , దీనికి విద్యార్థులు పరీక్షలకు కనీసం రెండేళ్లు పాటు శ్రమించాల్సి ఉంటుందని తాను విన్నానని, ఇప్పుడు ఈ డాక్టర్లకు కూడా ఇదే విధమైన పరిస్థితి ఉందని చెప్పారు. అత్యంత క్లిష్టమైన వైద్యపరమైన అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నిర్ణీత పరీక్షావిధానానికి అనుగుణంగా సిద్ధం కావల్సి ఉంటుంది. అయితే తక్కువ వ్యవధిలో మార్పులు చేయడం ఎంత మేరకు భావ్యం అని అధికారులను ప్రశ్నించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News