అక్రమ లే ఔట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై సుప్రీం స్టే ఫలితం
రాష్ట్రవ్యాప్తంగా పడిపోయిన ఆదాయం ప్రతి కార్యాలయంలో
రోజుకు నాలుగైదుకు మించి సాగని
ఈ ఏడాది ఆదాయ లక్షం అందుకోవడం కష్టమేనా?
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేతో ఓపెన్‌ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఆర్థిక సంవత్సరం ఆశించిన దానికన్నా రాబడి తగ్గిపోయే అవకాశం ఉందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. కొత్తగా సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. అక్రమ లే ఔట్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయవద్దని 26.08.2020న స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఓ సర్యులర్‌ను జారీ చేసింది. అయితే దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో అక్రమ లే ఔట్లలో ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయవచ్చంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ డిసెంబర్ 29, 2020న మరో సర్యులర్‌ను జారీ చేసింది. అయితే ఒకసారి రిజిస్ట్రేషన్ కానీ ప్లాట్లు రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో ఉండడంతో కొందరు రియల్టర్‌లు హైకోర్టు నుంచి మిగతా ప్లాట్లకు సైతం అనుమతి తీసుకొచ్చి 2021 సంవత్సరం నుంచి రిజిస్ట్రేషన్‌లు చేసుకుంటున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఓపెన్ ప్లాట్లకు కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చిన ఆయా వెంచర్‌ల యజమానులు రిజిస్ట్రేషన్‌లు చేయించుకుంటున్నారు.
ఈ నెల 19న స్టే విధించిన సుప్రీం
ఇలా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొందరు రియల్టర్‌లు కూడా హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చి తన వెంచర్‌లోని ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై అభ్యంతరం తెలుపుతూ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. దీంతో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ మే, 19వ తేదీన, ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను పంపించడంతో ప్రస్తుతం హైకోర్టు నుంచి తీసుకొచ్చే ఉత్తర్వులను అమలు చేయకుండా సబ్ రిజిస్ట్రార్‌లు రిజిస్ట్రేషన్‌లను ఆపివేశారు. ఈ నేపథ్యంలోనే రోజుకు 20 నుంచి 30 రిజిస్ట్రేషన్‌లు జరిగే చోట 4 మించి జరగడం లేదు. ముఖ్యంగా హెచ్‌ఎండిఏ పరిధిలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇలాంటి కేసులు అధికంగా ఉన్నాయని, సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేతో తామంతా ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొందని సబ్ రిజిస్ట్రార్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ అధికారులు కావాలనే….
మున్సిపల్ అధికారులు కావాలనే తమ రిజిస్ట్రేషన్‌లను అడ్డుకోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించారని సబ్ రిజిస్ట్రార్‌లు ఆరోపిస్తున్నారు. గతంలో ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు 1,000రూ.లు కట్టి చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం అందులో చాలామంది ఆయా ప్లాట్లలో ఇళ్లు కట్టుకోవడానికి మున్సిపల్ శాఖ వద్దకు అనుమతి కోసం వెళితే ఆ శాఖ అధికారులు ఎల్‌ఆర్‌ఎస్ కింద రూ.1,000లు కట్టిన వారికి 14 శాతం జరిమానా కట్టుకొని వారికి అక్రమ లే ఔట్లలో ఇళ్లను కట్టుకోవడానికి అనుమతి ఇస్తున్నారు. రూ.1,000లు కట్టని వారి నుంచి 36 శాతం జరిమానా కట్టించుకొని అనుమతి ఇస్తున్నారు. అలాంటప్పుడు తాము రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, కావాలనే మున్సిపల్ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లి రిజిస్ట్రేషన్‌లు జరగకుండా ఆదాయం రాకుండా అడ్డుకుంటున్నారని సబ్ రిజిస్ట్రార్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.రూ.15,600 కోట్లు లక్షంగా ముందుకు….
2022-23 ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ రూ.15,600 కోట్లు లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ప్రతి నెలకు సగటున రూ.1,300 కోట్లకు తక్కువ లేకుండా రాబడి రావాలని నిర్ధేశించుకోవడంతో పాటు లక్ష్యం చేరుకునేలా ప్రణాళికలు రూపొందించింది. అయినా ప్రస్తుతం అనుకోకుండా వచ్చిన నేపథ్యంలో నెలకు రూ.700ల నుంచి రూ.800 కోట్ల రాబడి కూడా రావడం లేదని ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు రూ.12,364 కోట్ల రాబడి వచ్చింది. ఈ రాబడి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఆల్ టైం రికార్డు కాగా, గతంలో ఎన్నడూ లేనంత అధికంగా వచ్చింది. 2018-19 ఆర్థిక ఏడాదిలో 15.2 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి తద్వారా రూ.6,612.74 కోట్లు ఆదాయం రాగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 16.59 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరగడంతో రూ.7,061 కోట్లు రాబడి వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.5,260.20 కోట్లు ఆదాయం మాత్రమే వచ్చింది.