Monday, January 20, 2025

వదిన మరదళ్ల పోరుపై ఉత్కంఠ

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ స్థానంపై ఇప్పుడు రాజకీయ పరిశీలకులు, పార్టీల దృష్టి కేంద్రీకృతం అయింది. మరాఠా రాజకీయాలలో అత్యంత బలీయమైన పవార్ కుటుంబ సభ్యులు ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి పుణే జిల్లాకు చెందిన బారామతిలో నువ్వానేనా రీతిలో తలపడటం ఆసక్తికర పరిణామం అయింది. శరద్ పవార్ కూతురు, ఈ స్థానపు సిట్టింగ్ ఎంపి సుప్రియా సూలే, పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఇక్కడ పోటీలో ఉన్నారు. ఇరువురూ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాల నుంచి అభ్యర్థులుగా దిగారు. దీనితో బారామతి స్థానం ఇప్పుడు చిక్కని రక్తసంబంధం, తీవ్రస్థాయి రాజకీయ వైరం నడుమ పోరుకు వేదిక అయింది. ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్ని అధికారికంగా ఎన్‌సిపిగా గుర్తించింది. ఈ వర్గానికే పార్టీ ఎన్నికల చిహ్నం గడియారాన్ని కట్టబెట్టింది. కాగా సీనియర్ నేత శరద్ పవార్ వర్గంతో కూడిన పార్టీని ఎన్‌సిపి శరద్‌చంద్ర పవార్ గా పేర్కొంది.

ఇప్పుడు ఈ కొత్త పేరుతోనే ఎంపి సూలే ఈ నెల 7న జరిగే బారామతి ఎన్నికలలో బరిలోకి దిగాల్సి వచ్చింది. ఈ విధంగా ఇప్పుడీ స్థానం వదిన మరదళ్ల నడుమ హోరాహోరీ పోరుగా మారింది. పైగా పవార్ల వంశంలో ఆధిపత్య తీరు క్రమాన్ని చాటింది. ఇక్కడి నుంచి తండ్రి పవార్ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే రీతిలో బరిలోకి దిగిన సుప్రియ ఉత్తమ పార్లమెంటేరియన్‌గా నిలిచింది. సంసద్ రత్న పురస్కారం కూడా దక్కించుకున్నారు. పార్లమెంట్‌లో నాలుగోసారి ఎంపిగా ప్రవేశించేందుకు సిద్ధం అయ్యారు. కాగా అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌కు లోక్‌సభ ఎన్నికలలో పోటీ ఇదే తొలిసారి. అయితే ఆమెకు వివిధ సామాజిక సంస్థలతో , విద్యా సంస్థలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. పారిశ్రామిక సంఘాలు, సంస్థలలో కూడా చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. ఆడపడుచుతో పోటీకి ఇతరులను కాకుండా భార్యనే దింపాలని అజిత్ పవార్ సంకల్పించారు. ఈ బారామతి నియోజకవర్గం ప్రధానంగా గ్రామీణ ప్రాంతంగా ఉంది. ఓటర్లు ఎక్కువగా వ్యవసాయ వృత్తిని ఎంచుకుని జీవిస్తున్నవారే.

అయితే ఈ లోక్‌సభ స్థానంలోని కొన్ని ప్రాంతాలు ప్రత్యేకించి కడక్‌వాస్లా , హింజావడిలలో ఐటి సంస్థలు నెలకొన్నాయి. కొన్ని పట్టణ ప్రాంతాలు కూడా విస్తరించుకుని ఉన్నాయి. అయితే ఇక్కడ గ్రామీణ వ్యవసాయిక కుటుంబాలకు చెందిన ఓటర్లే విజేతను ఖరారు చేస్తారనేది గతం చెప్పే సత్యం. ఇంతకు ముందటి వరకూ బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఎన్‌సిపి తరఫున సీనియర్ పవార్ లేదా కూతురు సూలే పోటికి దిగడం ఆనవాయితీ. ఈ విధంగా ఈ ఇరువురిలో ఎవరో ఇంతకాలంగా ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. ఇక బారామతి అసెంబ్లీ స్థానం నుంచి అజిత్ పవార్ బరిలో నిలవడం ఆనవాయితీ అయింది. అయితే ఇప్పుడు పద్ధతి మారింది. రాజకీయవైరాలు తీవ్రస్థాయికి చేరుకుని తొలిసారిగా ఈ ఎంపి స్థానం పవార్ వంశంలోనే పరస్పర పోరుకు వేదికైంది. బిజెపి రాజకీయ కుట్రతోనే ఎన్‌సిపి చీలిపోయిందని,

ఈ విషయాన్ని ప్రజలలోకి మరింతగా తీసుకువెళ్లి తమ విజయానికి మార్గం సుగమం చేసుకోవాలని శరద్ పవార్ వర్గం భావిస్తోంది. కాగా కేంద్రంలో తిరిగి మోడీ సర్కారు ఏర్పడుతుందని, ఈ ప్రాంతానికి సరైన రీతిలో మోడీ గ్యారంటీలు దక్కాలంటే ఈసారి తమకు ఓటు అత్యవసరం అని పవార్ భార్య తమ ప్రచారంలో చెపుతూ వస్తున్నారు. ఈ స్థానంలో ఇప్పటి పోటీ ప్రత్యేకించి అత్యంత సీనియర్ నేత శరద్ పవార్ రాజకీయ , వ్యక్తిగత ప్రతిష్టకు పెను సవాలుగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News