మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసన మండలిలోని చైర్మన్ ఛాంబర్‌లో నూతనంగా ఎంఎల్‌సిగా ఎన్నికైన సురభి వాణిదేవి శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి ఆదివారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు కె.కేశవ రావు, ఎంఎల్‌ఎలు కెపి వివేకానంద, బేతి సుభాష్ రెడ్డి, మెతుకు ఆనంద్, జైపాల్ యాదవ్, ఆలా వెంకటేశ్వర రెడ్డి, కాలే యాదయ్య, అంజయ్య యాదవ్, ఎంఎల్‌సిలు పురాణం సతీష్, యోగానంద్, ఎంఎస్ ప్రభాకర్ రావు, రాష్ట్ర లెజిస్లీచర్ సెక్రెటరీ నరసింహ చార్యులతో పాటు వాణి దేవి కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు.
సిఎం కెసిఆర్ నమ్మకాన్ని నిలబెడతా
పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తనకు ఎంఎల్‌సిగా పోటీ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సురభి వాణిదేవి తెలిపారు. ఏ నమ్మకంతో సిఎం తనకు ఈ అవకాశం కల్పించారో… ఆ విశ్వాసాన్ని తాను వందకు వంద శాతం నిలబెట్టుకుంటానని అన్నారు. తన విజయానికి కృషి చేసిన పార్టీ పెద్దలకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే తనపై ఎంతో నమ్మకముంచి ఓటు వేసి గెలిపించిన పట్టభద్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సురభి వాణిదేవి అన్నారు. తన జీవితంలో మరచిపోలేని అపురూపమైన ఘట్టం ఇదని వ్యాఖ్యానించారు. వాస్తవానికి రాజకీయాలకు చాలా కాలంగా కాస్త దూరంగానే ఉన్నానన్నారు. కానీ, రాజకీయాల్లోనే పుట్టిన వాళ్లం కనుక ప్రజాసేవ అనేది తమ నరనరాల్లో జీర్ణించుకు పోయిందన్నారు. ప్రజాసేవ చేయడానికి అధికారం అవసరం లేదు అనుకునేదాన్ని అని కానీ పదవిలో ఉంటే ఇంకా ఎక్కువ మందికి ప్రజాసేవ చేయొచ్చని గ్రహించి నిర్ణయం మార్చుకున్నానని ఆమె తెలిపారు. ప్రస్తుతం ప్రజలకు మరింత సేవచేసే అవకాశం లభించిన నేపథ్యంలో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటానని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చుతానని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు.
Surabhi Vani Devi Takes Oath As MLC