సూరత్: పరువునష్టం కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సూరత్ సెషన్స్ కోర్టు గురువారం కొట్టివేసింది. ‘ మోడీ’ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో సూరత్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే ట్రయల్ కోర్టు ఈ విషయంలో పారదర్శకంగా విచారణ చేపట్టకుండా కఠినంగా వ్యవహరించిందని, ఇది రెండేళ్లు శిక్ష విధించాల్సిన కేసు కాదంటూ రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. శిక్షను నిలిపివేయకపోతే తన ప్రతిష్ఠకు పూడ్చలేని నష్టం కలుగుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
రాహుల్ పిటిషన్‌పై గత వారం వాదనలు విన్న న్యాయమూర్తి ఆర్‌పి మోగేరా గురువారం తీర్పును ప్రకటించారు. ఫిర్యాదుదారు లాంటి వ్యక్తినుంచి మరింత ఉన్నతస్థాయి నైతికతను ఆశిస్తారని కోర్టు వ్యాఖ్యానిస్తూ ట్రయల్ కోర్టు చట్టంలో అనుమతించిన శిక్షనే విధించిందని పేర్కొన్నారు. ‘ దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరే ఎందుకుంటుందో?’ అంటూ 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కర్నాటకలోని కోలార్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారంటూ గుజరాత్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఎ పూర్ణేశ్ మోడీ సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధించింది. అలాగే దీన్ని పైకోర్టులో సవాలు చేసేందుకు వీలుగా 30 రోజులు గడువు ఇచ్చింది. అప్పటివరకు బెయిలు మంజూరు చేసింది.
ఆ తర్వాత రాహుల్‌పై ఎంపిగా అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. కాగా సూరత్ సెషన్స్ కోర్టు తీర్పును గుజరాత్ హైకోర్టులో సవాలు చేస్తామని రాహుల్ తరఫు న్యాయవాది కిరిట్ పాన్‌వాలా చెప్పారు. చట్టప్రకారం తమకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకుంటామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌కూడా ట్వీట్ చేశారు.