Monday, January 20, 2025

ఎన్నికలకు ముందే బిజెపి బోణీ

- Advertisement -
- Advertisement -

భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన ముఖేష్ దలాల్ గడచిన 12 ఏళ్లలో పోటీ లేకుండా లోక్‌సభ ఎన్నికలో గెలిచిన తొలి అభ్యర్థి అయ్యారు. ఆయనే బహుశా పోటీ లేకుండా పార్లమెంటరీ సీటు గెలిచిన బిజెపి తొలి అభ్యర్థి కూడా. ఈమధ్య అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 మంది బిజెపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో సూరత్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆయన విజయం చోటు చేసుకుంది. గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ నియోజకవర్గంలో ఇతర అభ్యర్థులు అందరూ బరిలో నుంచి తప్పుకోవడంతో దలాల్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఒకరు తెలియజేశారు. అంతకు ఒక రోజు ముందు కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్‌ను జిల్లా రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ప్రతిపాదకుల సంతకాలు సరిగ్గా లేవని ప్రాథమికంగా రిటర్నింగ్ అధికారి కనుగొన్నారు.

కాగా, ప్రస్తుతం ఏడు దశలుగా జరుగుతున్న లోఖ్‌సభ ఎన్నికల్లో బిజెపికి ఇది తొలి విజయం. 18వ లోక్‌సభలోకి దలాల్ ఏకగ్రీవ ప్రవేశానికి ముందు 1951 నుంచి పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ లేకుండా కనీసం మరి 34 మంది ఎన్నికయ్యారు. సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అభ్యర్థి డింపుల్ యాదవ్ 2012లో కన్నౌజ్ లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ లేకుండా గెలిచారు. ఆమె భర్త అఖిలేశ్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తరువాత కన్నౌజ్ సీటుకు రాజీనామా చేశారు. పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ లేకుండా ఎన్నికైన ఇతర ప్రముఖ నేతల్లో వైబి చవాన్, ఫరూఖ్ అబ్దుల్లా, కెఎల్ రావు, హరే కృష్ణ మెహతాబ్, టిటి కృష్ణమాచారి, పిఎం సయీద్, ఎస్‌సి జమీర్ కూడా ఉన్నారు. పోటీ లేకుండా లోక్‌సభ సభ్యులుగా ఎన్నికైన అభ్యర్థుల్లో గరిష్ఠంగా కాంగ్రెస్ నుంచి ఉన్నారు. సిక్కిం, శ్రీనగర్ నియోజకవర్గాలు అటువంటి ఏకగ్రీవ ఎన్నికలను రెండు సార్లు చూశాయి.

ఎక్కువ మంది అభ్యర్థులు సార్వత్రిక లేదా రెగ్యులర్ ఎన్నికల్లో పోటీ లేకుండా గెలవగా, డింపుల్ యాదవ్‌తో సహా కనీసం తొమ్మిది మంది ఉప ఎన్నికల్లో పోటీ లేకుండా విజయం సాధించారు. 1957లో గరిష్ఠంగా ఏడుగురు అభ్యర్థులు పోటీ లేకుండా సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందారు. 1951, 1967 ఎన్నికల్లో ఐదుగురేసి, 1962లో ముగ్గురు, 1977లో ఇద్దరు, 1971, 1980,1989లో అదే రీతిలోఒక్కొక్కరు ఎన్నికల్లో గెలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News