అయోధ్యలో బాల రాముడికి అలంకరించేందుకు సూరత్ కు చెందిన ఓ వ్యాపారి బంగారు కిరీటాన్ని బహూకరించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తర్వాత ఆయన రామ మందిరం ప్రధాన పూజారి, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీల సమక్షంలో ఈ కిరీటాన్ని అందజేశారు.
సూరత్ కు చెందిన ముఖేశ్ పటేల్ రామభక్తుడు. సూరత్ లో గ్రీన్ లాబ్ డైమండ్ కంపెనీ పేరిట ఓ వజ్రాల తయారీ సంస్థను నడుపుతున్నారు. ఆయన అయోధ్య రాముడి కోసం ఆరు కేజీల బరువుండే ఓ బంగారు కిరీటాన్ని తయారు చేయించారు. కిరీటంలో విలువైన వజ్రాలు, రత్నాలను పొదిగారు. దీని విలువ 11 కోట్ల రూపాయలు ఉంటుంది. తమ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులను ముందుగానే అయోధ్య రామాలయానికి పంపించి, తగిన కొలతలు తీసుకున్న తర్వాతనే ఆయన కిరీటాన్ని తయారు చేయించారట. ముఖేశ్ పటేల్ ఇంతకుముందు అయోధ్య బాలరాముడికోసం కొన్ని ఆభరణాలు కూడా బహూకరించినట్లు విశ్వహిందూ పరిషత్ జాతీయ కోశాధికారి దినేశ్ భాయ్ నవియా తెలిపారు.