( నేడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి )
సురవరం ప్రతాపరెడ్డిని చూస్తే అబ్బురమనిపిస్తది. ఒక్కడు ఎన్ని పనులు చేసిండో? ఎన్ని రచనలు చేసిండో? చిత్రమనిపిస్తది.“ఆంధ్రమహాసభ”ల విషయంలో కార్యకర్తృత్వం, రచనా వ్యాసం గం, సంపాదక కర్తవ్యం ముప్పేటలా సమ్మేళనం చెందినవి. తెలంగాణలో ఆంధ్రమహాసభ స్థాపన ఒక విప్లవాత్మక మార్పు. దానికి ప్రారంభ బిందువు “నిజామాంధ్ర జన సంఘ”స్థాపన (1211 1921). ఈ రెండు సంస్థల స్థాపనకు అంతర్జాతీయంగా ఆధునిక భావన, ప్రజాస్వామ్య భావన; జాతీయంగా జాతీయోద్యమం, బెంగాల్ విభజన కారణంగా తలెత్తిన స్థానీయ భాషా, సాంస్కృతిక అస్తిత్వ ఆత్మగౌరవ భావన; రాష్ట్రీయంగా ఉర్దూ, మరాఠీ భాషా వ్యవహర్తల ఆధిపత్య భావనలు కారణాలు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల అంతరంగానికి వ్యక్తీకరణలు ఈ సంస్థలు. ముఖ్యంగా ఆంధ్రమహాసభ.
భాషా సాంస్కృతికోద్యమంగా మొదలై, క్రమంగా రాజకీయ వైఖరులను సంతరించుకొని, తెలంగాణలో రాచరికం స్థానంలో ప్రజస్వామిక పరిపాలనను డిమాండ్ చేసే స్థాయికి ఎదిగన సంస్థ అది. అంతటితో ఆగకుండా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటానికి దారి తీసిన సంస్థ అది. అటువంటి ప్రథమాంధ్ర మహాసభ (జోగిపేట, 3, 4 మార్చి 1930)కు అధ్యక్షుడు సురవరం. ఆ అధ్యక్షోపన్యాసం నుంచి కొన్ని భావాలు. “నేటి వరకును పశుతుల్యులుగా భావించబడుచుండిన ప్రజలు తామును మనుష్యులేమని గుర్తింపగలిగిరి”, “భావములనెంత నిరోధించినంత తీక్షణంగా, తీవ్రంగా, నెల్లెడ వ్యాపించుకొని పోవును”. ‘సభల విషయమై గావింపబడిన నిషేధములు ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగించుచున్నవనియు, నీ శాసనమును (గస్తీనిషాన్ 53) త్వరగా రద్దు చేయుటకై ప్రజలు ప్రభుత్వాన్ని ప్రార్థించుట మంచిది’. “రాష్ర్టమున ముఖ్య పట్టణమైన హైద్రాబాద్ తెలంగాణలో చేరినదే” “వారి
నస్పృశ్యులుగా భావించి పశువులకన్నను, వృక్షాలకన్నను, జడ పదార్థములకన్నను హీనముగా భావించుచున్నాము…. ఋషి సంతతివారమని మురిసిపోవుచున్నాము… యీ ప్రాచీన సంప్రదాయములను మనము వదలుకొనవలయును”. “మనలో అనేక సాంఘిక దురాచారాలున్నవి. వీని సంస్కారము చేయబూనిన మన పండితులు పదేపదే ధర్మశాస్త్రములను దెచ్చి యడ్డుబెట్టెదరు. ఈ ధర్మశాస్త్రముల వ్యామోహమును వదులుకొను సమయము వచ్చినది. ధర్మశాస్త్రములు సర్వకాలములకై ఏర్పడినవి కావు… ఈ శాస్త్రములను మనము చారిత్రక దృష్టితో చూడవలెను… దేశకాల వ్యవస్థలు మారినప్పుడవి మనకెంతవరకు ఉపకరించునో విమర్శించి తీరవలెను”. బ్రిటిష్ భారత్‌లో వలెనే “మన నిజాము రాష్ర్టమందును నట్టి (బాల్య వివాహ నిషేధక శాసనము)శాసనముండుట సమంజసం”, “ఈ సంఘముల (వర్తక సంఘం, రైతు సంఘం) ద్వారా ప్రజలపై దౌర్జన్యములు జేయు వ్యక్తుల దౌష్ట్యముల… నిరోధించవలయును”
“మన రెండవ కర్తవ్యము విద్యా వ్యాపకము” గ్రామాధికారులే మన ప్రజల యభ్యుదయమును నిరోధించు వారైయున్నారు. “ప్రపంచము తీవ్రముగా మారుచున్నది”. మనమును ప్రపంచము యొక్క నాగరికతా ప్రభావముననుసరించిపోవ ప్రయత్నింపవలయును”, “మనము విదేశీ వస్తువులను సదా యాదరించి మనదేశ పరిశ్రమలకు నష్టము కలిగించిన వారమగుచున్నాము”. “కొన్నిటిలో సోదరీమణులు ఉపన్యసించి నూతన యుగారంభమును ప్రకటించిరి”. (నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు 1 కె.జితేంద్రబాబు పుటలు 123 128). ఈ భావాలు ఆయనలోని సంఘసంస్కర్తను వెల్లడి చేస్తున్నవి. స్త్రీలు, అస్పృశ్యులు, ముస్లింల యెడల ఆయనకు గల పురోగామి దృక్పథాన్ని తెలుపుతున్నవి. ప్రపంచంతో పాటు నడవాలనే ఆధునిక, ప్రజాస్వామిక దృక్పథాన్ని తెలుపుతున్నవి. అంతేకాక ఈ భావాలు ఆంధ్రమహాసభకు దిశానిర్దేశం చేసినవి. సంస్థ నియమావళి ప్రకారం అధ్యక్షుడిగా ఆ సంవత్సరమంతా (మార్చి 1930 నుండి ఫిబ్రవరి 1931 వరకు) ఆంధ్రమహాసభ బలోపేతం కావటానికి కృషి చేసినాడు.
మార్చి 1931లో దేవరకొండలో జరిగిన ద్వితీయ సభల్లో పాల్గొని గస్తీనిషాన్ 53 రద్దు పరిచే తీర్మానం మీద మాట్లాడినాడు. ఈ సందర్భంగా “వాక్ స్వాతంత్య్రము మనుజుని జన్మహక్కులలో నొకటి యని ధైర్యంగా ప్రకటించినాడు. వితంతు వివాహ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ “వేదములయందు వితంతూద్వాహము నిషేధింపబడినట్లేమియు లేదు” అని, ఇది శాస్త్ర సమ్మతమేనని అన్నాడు. దీనిని పండితులు అంగీకరించరేమో అని సందేహం వ్యక్తం చేసినాడు. ఆయన అనుమానించినట్లే, ధర్మవీర వామన నాయక్‌గారు ఈ తీర్మానాన్ని వ్యరేకించినారు. అట్లా సంఘ సంస్కరణ విషయంలో ఆయన పండితులను ప్రతిఘటించి నిలబడినట్టు దీనిని బట్టి తెలుస్తున్నది. (చర్చ వివరాలకు చూ.పై.ఉ. పుట 249 250) అట్లా పండితులతో ఎందుకు తలపడిందీ అనేది ఆయనకేర్పడిన ఈ కింది ఆధునిక భావాలను చూస్తే అర్థమవుతుంది. “కాలము మారుచున్నది. నవీన భావములు ప్రబలుచున్నవి.దానికనుగుణ్యముగా మనమును మన భావములను సవరించుకొనవలెను మన సాంఘికాచారములలోననేకములీ నవీన కాలమునకు పనికిరావు” (గోలకొండ పత్రిక సంపాదకీయాలు -1. పుట -105)
ఈ ద్వితీయ సభల విశేషాలు లోకానికి తెలియడం కోసం ఒక వ్యాసం రాసిండు. ఆ వ్యాసంలోని కొన్ని భాగాలను చూస్తే సురవరంగారికి ఆంధ్రమహాసభ పట్ల గల అనురక్తి తెలుస్తుంది. “వట్టి అభిమానము చేతను, గట్టిగా ధ్వనులు చేయుట చేతను, లేక గట్టిగా చప్పట్లు కొట్టుట చేతను ఆంధ్రోద్యమం వృద్ధికి రానేరదు” (పై.ఉ.పుట.288). కాబట్టి ధన సహాయం ముఖ్యమన్నాడు. సంస్థ అభివృద్ధికి “తీర్మానములు చాలా తగ్గించవలెను. కృషియెచ్చుగా చేయవలెను” (పు.293) అన్నాడు. “లోపముల గురించి చర్చించుట యొక విధముగ నేరమేయైనను ముందు కాలమున నైనను ఈ లోపములను చక్కబెట్టుకొనుటకవకాశము కలుగునని సూచించుచున్నాము” (పు -288) అని అనడంలో సంస్థ అభివృద్ధి పట్ల ఆయన ఆకాంక్ష తెలుస్తున్నది. చాలా మంది ప్రముఖులు ఈ సభకు రానందుకు విచారిస్తూ “ప్రతి విద్యావంతుడగు నాంధ్రుడు తప్పక తన విధిగా భావించి సభకు రావలెనని మనవి చేయుచున్నాను” అని అన్నాడు (పు -290)
రైతులు, వర్తకులు, కూలీలు -వారి కష్టాలను ప్రస్తావించి “ఇవన్నిటిని జూడ సభల యావశ్యకత యెంత కావలసినదో యూహించుడు” (పు. 291) అని ఆంధ్రమహాసభ కర్తవ్యాన్ని గుర్తుచేసిండు. ప్రజలను విస్తృతంగా చైతన్యపరచడానికి “కొన్ని లఘు పుస్తకములు వ్రాయించవలెను” అన్నాడు. బహుశా ఈ సూచనతోనే పుస్తకాలు, కరపత్రాలు గోల్కొండ పత్రిక ప్రెస్‌లోనే ముద్రించినారు.
“కేంద్ర సంఘము వర్తకులకుపరించినట్లు రైతులకింకను సహకరించ లేదు. ఈ సంవత్సరమైనను రైతుల సంఘములెట్లుండవలెను, యెట్లు నడపవలెను, అను విషయముల నాలోచింతురుగాక” (పు- 293). బహుశా ఈ సూచనతో తర్వాత్తర్వాత సభల్లో రైతుల సమస్యకు ప్రాధాన్యత లభించింది. అంతేకాక ఈ ద్వితీయ సభల గురించి గోల్కొండ పత్రికలో సంపాదకీయం రాసినాడు. (27-5 -1931). సభలో చేసిన తీర్మానములపట్ల ప్రభుత్వ ఉదాసీనతను ఈ సంపాదకీయంలో నిర్భీతిగా వెల్లడించినాడు.
తృతీయ సభల (ఖమ్మం డిసెంబరు 1934) ఉపసంఘం సభ్యుడిగా ఉన్నాడు. ఈ సభల్లో గ్రంథాలయోద్యమం మీద తీర్మానాన్ని ప్రవేశపెట్టినాడు. ఈ తీర్మానంలో మన రాష్ట్రంలాంటిదే అయిన బరోడా రాజ్యంతో పోల్చి, ఆ విషయంలో మనం వెనుకబడి ఉన్నమని గణాంకాలతో నిరూపించి, గ్రంథాలయాలు, విద్య పెరుగాలని అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు విజ్ఞప్తి చేసినాడు (నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు 1- పుటలు -550 -551) తద్వారా ఆంధ్రోద్యమ వ్యాప్తికి ఈ రెండు అంశాలకున్న అంతస్సంబంధాన్ని సూచించినాడు. ఈ సభల మీద మూడు సంపాదకీయాలు రాసిండు. మొదట ఈ సభలు జటప్రోలు సంస్థాన రాజధానియైన కొల్లాపురంలో నిర్వహించ తలపెట్టగా ప్రభుత్వం అనుమతినివ్వలేదు. ఈ విషయమై 21-6- 1934న రాసిన సంపాదకీయంలో ప్రభుత్వాన్ని సుతిమెత్తగా మందలించినాడు. రాజకీయాలు మాట్లాడవద్దనే షరతు మీదనైనా అనుమతించినందుకు వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని ప్రశంసించినారు (గోలకొండ పత్రిక సంపాదకీయాలు -1. పు.175, 176). సభల అనంతరం 20-12-1934న రాసిన రెండవ సంపాదకీయంలో సభ అంతర్గత భావ సంఘర్షణ గురించి రాసినాడు. ‘నిమ్నజాత్యుద్ధరణము’, ‘వివాహ సంస్కరణము’ (వితంతు వివాహం) అనే తీర్మానాలు సభలో చర్చకు రాని విషయాన్ని ప్రస్తావించి సనాతనులను పరోక్షంగా విమర్శించినాడు (గోలకొండ పత్రిక సంపాదకీయాలు- 1, పు. 182 -183). మూడవ సంపాదకీయంలో కూడా ఇవే అంశాలను లేవనెత్తి సనాతనులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినాడు (పె. ఉ.ై పు -600- 602). ఈ సభలు రెండు విషయాలను స్పష్టం చేసినవి. ఒకటి సభకు గల బాహిర ఘర్షణ, అంటే ప్రభుత్వంతో ఘర్షణ. రెండు సభలోనే సనాతనులకు ఉదారవాదులకు (లిబరల్స్) మధ్య గల అంతర్గత ఘర్షణ. సురవరం ఉదారవాదులకు ప్రాతినిధ్యం వహించినట్టు అర్థమవుతుంది. ఈ సభల్లో దీన్ని ప్రతిఫలించే చర్చ ఒకటి జరిగింది. దాన్ని ఇక్కడ యథాతథంగా ఇస్తున్న చూడండి
దాశరథి వెంకటాచార్యులు సభల సమయంలో ‘అస్పృశ్యతా విషయములు’ అను పేరున ఒక కరపత్రమును ముద్రించి సనాతనుల తరపున ప్రచురించినారు. “అస్పృశ్యత దోషమనియు, నిది ప్రాచీనుల వాడుక కాదనియు నియ్యది కృత్రిమమనియు, దీనిని మాన్పవలయుననియు ఆధునికులల్లాడుచున్నారు…. ‘చండాలశ్వపచనాంతు / బహిర్‌గ్రామాత్ప్రతిశ్రయ:’ అని చండాలపుల్కనులకూరి బైట నిండ్లుండవలయునని మనువు వ్రాసెను. వారికన్నమే మన చేత బెట్టరాదనెను. “శూద్రేణ సహ భూక్త్వాన్నం/చాంద్రాయణ మథా చరేత్” (శూద్రునితో ప్రమాదముగా దినిన చాంద్రాయణము చరించవలయునని) అని విఙ్ఞానేశ్వర వ్యాఖ్యానమున శంఖుడు వ్రాసెను. చండాలాన్నము దినెనేని చాంద్రాయణము చరింపవలయునని పరాశర స్మృతి.
“కులధర్మాంశ్చ సర్వత: / వర్జయంతిచ యే ధర్మం తేషాం ధర్మేనవిద్యతే” (కులధర్మముల నెవ్వరు విడతురో వారికి ధర్మమే లేద) ని: భారత శాన్తి పర్వం… ఇట్లెన్నియో ప్రమాణలు గలవు గాన మనమెట్లు నడువవలయు?… వారి (హరిజనులకు) కుపకరింపదలచిన ధనధాన్యముల నొసగుడు… వీరలస్పృశ్యులైనను, జ్ఞానము కలుగునేని వీరలును నధికులే యగుదురు ఎట్లన్న,.. ఎవడు క్రోధమోహముల విడచునో వానిని దేవతలు బ్రాహ్మణునిగా నెరుంగుచున్నారు…” దాశరథి వెంకటాచార్యుల కరపత్రానికి, సమాధానంగా గోలకొండ పత్రికలో సురవరం ప్రతాపరెడ్డి గారు ప్రచురించిన సమాధానం. “దాశరథి వేంకటాచార్యులు… నొకకరపత్రమును అచ్చుకొట్టించి ఖమ్మం సనాతనులలో పంచిపెట్టినాడు… ఇప్పుడు శ్వపచులే లేరు… ఆంధ్రుడు మాంసమమ్మవలెననుట కదా? ఆచార్లవారాంద్రులేనో ద్రావిడులో తెలియదు…. చండాలాదులు జ్ఞానులైనవారీ కాలములోనున్నారు. వారు వేదమంత్రాలకర్థము చెప్పుచున్నారు. వారిలోకవులు పండితులు కలరు. నిత్యము స్నానము చేయుదురు పరిశుభ్రముగానున్నారు…. కావున ఆచార్ల వారి వాదనరీత్యా వారాదరణీయులే…. కొన్ని ప్రశ్నలు వేయుదును
ఛండాలురును వైష్ణవ దీక్ష పొందిన పూజితులా కారా?
అన్న విక్రేతలు (ఈ కాలము బ్రాహ్మణుల హోటల్లే బహుళమ్ము)… పంచమహాపాతకులు… ఇట్టివారు మనలో నెందరు లేరు.
తిరుప్పాళ్వారు శ్రీవైష్ణవులకు పూజ్యులేనా? వారు ఛండాల జాతివారే కదా?
నందనారు ఛండాలుడే కదా? చోభాకుళును ఛండాలుడే? వీరిని సర్వులేల పూజించిరి?
అరుంధతీదేవి మాదిగవాడలో పెరిగినదేకాని మాదిగిది కాదందురు. అధమ యోనిలో పుట్టినదని మనువుగారు సెలవిచ్చినారు.
(అనేక మంది ఇతర కుల స్త్రీలు) బ్రాహ్మణ్మాధ్యుత్తమజాతి పురుషులను వివాహమాడి బ్రాహ్మణులైపోయినారు. ఆచార్లవారూ, యీ సవాళ్లకు తమదేమి జవాబు”. (నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు -1. పుటలు- 508 -512). నాల్గవ సభ (జనవరి, 1935 సిరిసిల్ల) కు ముందు చిత్రగుప్తుడు అనేపేరుతో సభల నిర్వహణకు సంబంధించి కొన్ని సూచనలు చేసినారు. వ్యాయామ పోటీలు ఏర్పాటు చేయాలనే సూచన యువకులను ఉద్యమంలో ఆకర్షించే విధంగా ఉంది. సాంఘిక నాటకాలు ప్రదర్శంచాలనే సూచన, వివిధ జిల్లాలలోని రచయితలు తమ రచనల్ని ప్రదర్శించాలనే సూచనలు తెలంగాణ సాహిత్య అస్తిత్వ ప్రకటనకు దోహదం చేసేవి. స్థానిక ఉత్పత్తుల ప్రదర్శనా సూచన తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగపడేది. ఈ సభల్లో క్రియాశీలంగా పాల్గొని విద్యా పునర్నిర్మాణము గురించి తీర్మానం ప్రవేశపెట్టినాడు. “జనులు మాతృభాష ద్వారా విద్య నేర్పబడకుండ ఎన్ని సంవత్సరములు కష్టపడినను తుదకు తలక్రిందుల తపస్సు చేసినను విద్య పెంపొందజాలదు” అని మాతృభాష లో విద్య నేర్పాలి అని ఆనాడే ప్రకటించినాడు. దేశాభివృద్ధికి ముఖ్యముగా వ్యవసాయ వాణిజ్య పరిశ్రమలభివృద్ధినొందుటకు వానికి సంబంధించిన విద్యాభివృద్ధి యువసరము (పు-పు. 667) అని వృత్తి విద్య ప్రాధాన్యతను నొక్కిచెప్పినాడు. ఇదే సభలో బాల్య వివాహ నిషేధ తీర్మానాన్ని ప్రతిపాదించినాడు. ఈ విషయంలో కూడా పండితులను ప్రతిఘటించి బాల్య వివాహం శాస్త్ర సమ్మతం గాదని బాల్య వివాహ విషయంలో మతంతో నిమిత్తం లేదని “ఆరోగ్యశాస్త్రజ్ఞులును బాల్య వివాహములను నిషేధించుచున్నారని, చరకాచార్యులను ముందుబెట్టి తార్కికంగా సంఘ సంస్కర్తవలె వాదించి తీర్మానాన్ని నెగ్గించినాడు.” ఈ అంశం ఆనాడు తెలంగాణలో సనాతనులకు ఆధునికులకు మధ్య జరిగిన భావజాల సంఘర్షణను తెలుపుతుంది కాబట్టి ఈ చర్చను పూర్తిగా తెలుసుకోవడం అవసరం.
“దేశకాలపాత్రములననుసరించి, హిందూ బాలబాలికల విద్యా శారీరకాభివృద్ధికి ప్రస్తుత బాల్య వివాహములు భంగము కలిగించుచున్నవి… కనీసము బాలికలకు పదిహేను సంవత్సరములు, బాలురకు యిరువది సంవత్సరముల వరకును హెచ్చించుచు ప్రభుత్వము శాసించవలయును” ఇది తీర్మానం. దీని మీద అనుకూల ప్రతికూల చర్చ జరిగినది. దీన్ని ప్రతిపాదించిన సురవరం ప్రతాపరెడ్డి మాట్లాడుతూ “ఈ తీర్మానము చాలా ముఖ్యమైనది. మీరందరు నిష్ఫాక్షిక బుద్ధితోను, దేశాభివృద్ధిని దృష్టియందుంచుకొనియు… ఆమోదించెదరని నమ్ముచున్నాను… బాల్యవివాహములు జరుగుటచే గలుగుచున్న నష్టకష్టములు… 12- 13 సంవత్సరముల వయస్సుననే పిల్లల తల్లులగుచున్నారు. ఇందుచే బాలికల ఆరోగ్యము క్షీణించుటయేగాక పుట్టెడు పిల్లలును మరణించుచున్నారు… వీనికన్నిటికిని కారణము మన దేశమునందు గల మూఢాచారములేయైయున్నవి. వీనిని నిర్మూలించవలసిన యావశ్యకత, కర్తవ్యము మనయందరిపైననుగలదు… (ఇది)సాంఘిక సమస్య. భారతదేశ రాజప్రతినిధులుగా నుండిన ఇర్విన్ ప్రభువు గారు శారదా చట్ట సమయమున పూర్వాచార పరాయణులిట్లే గోల పెట్టగా యీ విషయము మతసంబంధమైనది కాదనియు, సాంఘిక విషయమనియు తాము తలచుటచే దీనికంగీకార మొసగుచున్నామనియు తెలిపిరి…అనేక ధర్మశాస్త్రములందు బాల్య వివాహములు కూడవని చెప్పియున్నారు…”
తీర్మానమును ప్రతిఘటించుచూ బ్ర.శ్రీ. చివుకుల అప్పయ్య శాస్త్రి గారు యిట్లుపన్యసించిరి: “తీర్మానము వలన గలుగునట్టి నష్టములను తెలిపెదను…. వేదములు హిందువులకు పవిత్ర గ్రంథములు. ఇవియన్నియు యీ తీర్మానమునకు వ్యతిరేకములై యున్నవి. బాల్య వివాహములుత్తమమని మన మతగ్రంథము లుద్ఘోషించుచున్నవి… జ్యోతిశ్శాస్త్రముగూడ బాల్య వివాహులనే ప్రోత్సహించుచున్నది”. శ్రీ మాదిరాజు రామ కోటేశ్వరరావుగారు ప్రతిఘటనను బలపరచుచు మత విషయములకు సంబంధించిన యే తీర్మానముగూడ యిట్టి మహాసభలలో ప్రవేశపెట్టగూడదనియు, ప్రభుత్వమువారు మత విషయములలో ప్రభుత్వము జోక్యము కలిగించు కొనగూడదని స్పష్టపరచినారనియు, ఈ తీర్మానమును… నామోదింపగూడదనియు” నుడివిరి. శ్రీ సురవరము ప్రతాపరెడ్డి గారు వ్యతిరేకుల యుపన్యాసములకు ప్రత్యుత్తరమొసగుచు “యువకులు వేదములను, ధర్మశాస్త్రములను ధిక్కరించుచున్నారని అపోహ కల్పించి మీ అభిప్రాయమును మార్పజూచు చున్నారనియు… నేడు భారత దేశమునందు శారదా శాసనమును అందరును అమలులోనికి దెచ్చుచున్నారనియు…” అని నుడివిరి…‘తీర్మానమునకు వ్యతిరేకముగా పదునారు వోట్లు మాత్రము’రావడం కారణంగా అంటే ఎక్కువ వోట్లు అనుకూలంగా వచ్చినందున అది ఆమోదించబడింది. (నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు 1. పుటలు 683-686)
డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి
9885682572