ఒక్కరోజు క్రితం దక్కిన మంత్రిపదవికి మలయాళ సినీహీరో , బిజెపి ఎంపి సురేష్ గోపీ రాజీనామా చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కేరళలో బిజెపికి రాజకీయ ఉనికిని చాటినందుకు సురేష్ గోపీకి మంత్రి పదవి కట్టబెట్టారు. అయితే ఆయన తిరువనంతపురంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలతో ఆయన మంత్రిపదవికి రాజీనామా చేస్తున్నారని స్పష్టం అయింది. అక్కడి కాంగ్రెస్ కూడా సామాజిక మాధ్యమాలలో ఈ విషయాన్ని ప్రచారం చేసింది. ఇప్పటికీ పలు సినిమాలు ఉన్నాయి కదా? మరి సహాయ కేంద్ర మంత్రి పదవితో సరిపెట్టుకుంటారా? అని ప్రశ్నించగా సురేష్ గోపీ తాను ఏ పదవి అడగలేదని, తనకు మిగిలిన సినిమాలు ముఖ్యమని, ఎటువంటి జాప్యం లేకుండా కొత్త బాధ్యత నుంచి వైదొలుగుతానని ఆయన చెప్పినట్లు , ఇక రాజీనామాకు సిద్ధమయ్యారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
తనకు సినిమాలు పూర్తి చేయడం అందులోనే గుర్తింపు మరింతగా తెచ్చుకోవడం ఇష్టం అని, మంత్రి పదవిని కాదంటే త్రిస్సూర్ ప్రజలకు అన్యాయం చేసినట్లు ఏమీ కాదని , పదవిలో ఉన్నదాని కంటే లేకుండా ఎంపిగానే వారికి ఎంతో చేయగలనని కూడా సురేష్ గోపీ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాను మోడీ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నాననే వార్తలను సురేష్ గోపీ వెనువెంటనే ఖండించారు. మోడీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండటం తనకు గర్వకారణం అని, దీనిని తాను కోరుకున్నానని, కొనసాగిస్తానని, మంత్రిమండలిలో కేరళ తరఫున ప్రాతినిధ్యం వహించడం తనకు సిన్మా విజయం కన్నా ఎక్కువ సంతోషకరమన్నారు. కొన్ని వార్తా సంస్థలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఫేస్‌బుక్ పేజీలో ఆయన మోడీతో కలిసి ఉన్న తన ఫోటోను పొందుపర్చి తన విధేయతనుచాటుకున్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో తాను తామంతా కూడా కేరళ సంక్షేమ సౌభాగ్యాలకు కట్టుబడి ఉంటామని గోపి వ్యాఖ్యానించారు.
సురేష్ గోపీ కేబినెట్ మంత్రి పదవి దక్కకపోవడం పట్ల అలక వహించారని , పదవికి రాజీనామా చేశారనేది వట్టి బూటకపు వార్త అని కేరళ బిజెపి అధ్యక్షులు సురేంద్రన్ స్పష్టం చేశారు. కాగా కేరళ కాంగ్రెస్ స్పందిస్తూ ముందు మోడీ , సురేష్ గోపీలు ప్రజా సేవనా? కపట నాటకాలా తేల్చుకోవాలని చురకలు పెట్టారు. తనకు సినిమాలతో తీరికలేదని ఇక మంత్రిపదవి ఎందుకు అని సురేష్ గోపీ చెపుతున్నారని, మరి ఆయనకు పదవి ఇవ్వడం ఎందుకు? ప్రజల తీర్పుతో పరిహాసాలకా? అని ప్రశ్నించారు.