దుబాయి: చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ ఆటగాడు సురేశ్ రైనా ఐపిఎల్ కెరీర్ దాదాపు ముగిసినట్టేనని మాజీ ఆటగాళ్లు, ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సంజయ్ మంజ్రేకర్, డేల్ స్టెయిన్ అభిప్రాయపడ్డారు. ఈ ఐపిఎల్ సీజన్‌లో రైనా అత్యంత చెత్త ఆటను కనబరుస్తున్న విషయం తెలిసిందే. 12 మ్యాచుల్లో 160 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రైనా ఐపిఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించే సమయం అసన్నమైందని వారు అభిప్రాయపడ్డారు. రానున్న ఐపిఎల్ సీజన్‌లో చెన్నైతో సహా ఏ ఫ్రాంచైజీ కూడా రైనాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుందని తాము భావించడం లేదన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు ఎదురైన చేదు అనుభవమే రైనాకు ఎదురయ్యే పరిస్థితి ఉందన్నారు.
ఒకప్పుడూ ఐపిఎల్‌లోనే అత్యుత్తమ ఆటగాడిగా ఓ వెలుగు వెలిగిన రైనా ఈ సీజన్‌లో అత్యంత చెత్త ఆటతో సతమత మవుతున్నాడన్నారు. ఇలాంటి స్థితిలో వచ్చే సీజన్‌లో రైనాను తమ జట్టులోకి తీసుకునేందుకు ఫ్రాంచైజీల యాజమాన్యాలు సాహసం చేస్తారా అనేది సందేహమేనని వారు పేర్కొన్నారు. అయితే రైనాతో పోల్చితే వచ్చే సీజన్‌లో డేవిడ్ వార్నర్‌ను సొంతం చేసుకునేందుకు ఆయా ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. రైనాతో పోల్చితే వార్నర్ ఎంతో మెరుగైన బ్యాట్స్‌మన్ అని, అంతేగాక కెప్టెన్సీలో కూడా వార్నర్‌కు తిరుగులేదని వారన్నారు. దీంతో వార్నర్‌కు వచ్చే సీజన్‌లో మంచి అవకాశాలే ఉంటాయని మంజ్రేకర్, స్టెయిన్ వివరించారు.
Suresh Raina IPL Career over says Manjrekar