నిషేధిత సిసిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట సోమవారం లొంగిపోయారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్‌పి రోహిత్‌రాజు మాట్లాడుతూ… లొంగిపోయిన వారంతా చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాకు చెందిన మావోయిస్టులని అన్నారు. పోలీసులు, 81 బెటాలియన్, 141 బెటాలియన్ సిఆర్‌పిఎఫ్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకొని తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని వారంతా లొంగిపోయినట్లు చెప్పారు.
మడివి బీమా, సోడి ఉంగా, మడివి అడుమ, కుంజాం కోసా, కోవాసి నంద, మడివి బీమా, మడివి మాసా, కుంజాం లకా్ష్మ, వెట్టి లక్కే, మడివి చుక్కయ్య, వెట్టి కోసా, బీమా, సోడి రాధికా, కుహ్రామి కాజల్ లొంగిపోయినవారిలో ఉన్నారని అన్నారు. గడిచిన రెండు నెలల కాలంలో 44 మంది మావోయిస్టులు లొంగిపోయారని అన్నారు. గత కొంతకాలంగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ ఆదివాసీ ప్రజలలో ఆదరణ, నమ్మకం కోల్పోయి కాలం చెల్లిన సిద్ధాంతాలతో పాటు, బలవంతపు వసూళ్లే లక్షంగా పనిచేస్తూ , ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందితే తమకు మనుగడ ఉండదని భావించి అమాయకపు ఆదివాసీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే విషయాలను గ్రహించి తాజాగా 14 మంది మావోయిస్టు సభ్యులు ఆ పార్టీని వీడి లొంగిపోయారని తెలిపారు.