Saturday, January 4, 2025

సరోగసీ విషవలయం

- Advertisement -
- Advertisement -

సరోగసీ ఒక వ్యాపారంగా విస్తరిస్తోందన్నది బహిరంగ రహస్యమే. ఆధునిక జీవనశైలిలో అనేక మార్పులు రావడం, ఒత్తిళ్లు పెరగడంతో ఆ ప్రభావం యువతను అనేక విధాలుగా వేధిస్తోంది. సంపాదనలో భార్యాభర్తలు ఇద్దరూ నిమగ్నం కావడంతో అప్పుడే సంతానం అక్కరలేదని సరిపెట్టుకొంటున్నారు. కొన్నేళ్ల తరువాత సంతానం పొందాలనుకొనే ఆకాంక్ష కలిగినా సంతాన సాఫల్యం కలగని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాంతో సంతాన రహితులైన స్వదేశీయులే కాదు విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు కూడా కొన్ని లక్షల రూపాయల పెట్టుబడితో ప్రత్యామ్నాయంగా అద్దె గర్భాలను కుదుర్చుకుని సంతానం పొందడానికి తాపత్రయపడడం పరిపాటి అయింది.

అయితే ఇది ఫక్కా వాణిజ్యంగా రూపాంతరం చెందుతోంది. ఎన్ని నిబంధనలున్నా దీనిని నియంత్రించడం కష్టసాధ్యమవుతోంది. ఈ చాటుమాటు వ్యవహరాలు, విషాద సంఘటనలు దేశంలో అక్కడక్కడ జరుగుతున్నా అంతగా బయటపడడం లేదు. రెండు రోజుల క్రితం తెలంగాణలోని రాయదుర్గంలో సరోగసీ గర్భధారిణి నిర్బంధానికి గురై, లైంగిక వేధింపులు భరించలేక తొమ్మిదో అంతస్థు నుంచి దూకి బలవన్మరణానికి బలైపోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సరోగసీ తెలంగాణలో చాపకింద నీరులా సాగుతోందనడానికి ఈ విషాద సంఘటన సాక్షమవుతోంది. సరోగసీలో నిబంధనల ప్రకారం సమీప బంధువుల నుంచి మాత్రమే అద్దెగర్భం ప్రక్రియలో సంతానాన్ని పొందవలసి ఉంటుంది. కానీ నిబంధనలు ఏవీ పాటించకుండా నిరుపేద మహిళలకు కొంత నగదు ముట్టజెప్పి పిల్లలను ప్రసవింప చేసుకోగలుగుతున్నారు. కొన్ని సాఫల్య కేంద్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులు ఈ అద్దెగర్భాల ప్రక్రియను భారీ వాణిజ్య రాకెట్‌గా సాగిస్తున్నాయి. సరోగసీ ద్వారా సంతానం పొందాలనుకుంటే కొన్ని నిబంధనలు చట్టంలో రూపొందించారు. దంపతులకు పెళ్లయి ఐదేళ్లు నిండాలి. వీరికి గతంలో పిల్లలు కానీ, దత్తత తీసుకున్న సంతానం కానీ ఉండకూడదు. భర్తకు 26 55, భార్యకు 25 50 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. దంపతుల్లో ఒకరికి సంతాన వైఫల్యం సమస్య ఉన్నట్టు జిల్లా మెడికల్ బోర్డు ధ్రువపత్రం అవసరం.

జన్మించిన బిడ్డ సంరక్షణ హక్కులకు మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి. గర్భాన్ని అద్దెకిచ్చే మహిళ వివాహితురాలై ఉండడమే కాదు, ఒక బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి. ఒకసారి మాత్రమే అద్దెగర్భం పొందే అవకాశం ఉంటుంది. అదీ సమీప బంధువులకు మాత్రమే ఇవ్వాలి. ప్రసవానంతరం ఆ మహిళకు 16 నెలల బీమా సౌకర్యం కల్పించాలి. ఇన్ని నిబంధనలు ఉన్నా ఇవేవీ పట్టించుకోకుండా దళారీ వ్యవస్థ ద్వారా అద్దె గర్భాలను కుదుర్చుకుంటున్నారు. ఒకప్పుడు హైదరాబాద్, విజయవాడ కేంద్రాలుగా సాగిన సరోగసీ వ్యవహారం రానురాను తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రాకింది. ఐదేళ్ల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో సరోగసీ దందా వెలుగు చూసింది.

పేద గిరిజన మహిళలకు లక్షల రూపాయలు ఆశ చూపి వారిని పావులుగా వాడుకున్నారు. భువనగిరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సరోగసీ కోసం సుమారు 100 మంది మహిళలను గుట్టుగా ఉంచగా, ఓ మహిళ బయటపడడంతో ఆ వ్యవహారమంతా వెలుగులోకి వచ్చింది. చిన్న వయసులో వివాహాలు జరిగి పిల్లలు పుట్టిన యువతులను సరోగసీకి ఎంపిక చేసుకుంటున్నారు. వారికి తొలుత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత సరోగసీకి బలవంతంగా ఒప్పిస్తున్నారు. అయితే ఇది వికటించి కొందరు మహిళలు అనారోగ్యానికి గురైన సంఘటనలు కూడా ఉన్నాయి. బలవంతంగా వివాహితలను ఈ రొంపిలోకి లాగినట్టు కొన్ని కేసులు కూడా పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. థాయ్‌లాండ్, నేపాల్, మెక్సికో, కంబోడియాలతోపాటు భారత దేశం కూడా సరోగసీని నిషేధించిన తరువాత ఉక్రెయిన్, జార్జియా, లావోస్, మలేసియా, అర్జెంటీనా, కొలంబియా, నైజీరియా, కెన్యా, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు సరోగసీ మార్కెట్ విస్తరించింది. భారత దేశంలో 2010లో సరోగసీ నియంత్రణ ముసాయిదా బిల్లు తయారైంది. 2019 లో సరోగసీ నిషేధ చట్టాన్ని లోక్‌సభ ఆమోదించింది.

2021లో సరోగసీ (నియంత్రణ) చట్టం ఆమోదం పొందింది. అంతవరకు భారతదేశం ప్రముఖ సరోగసీ గమ్యస్థానంగా ఉండేది. అనైతిక విధానాలు సాగేవి. అద్దె తల్లుల ఒప్పందాలు తక్కువ ఖర్చుతో సులువుగా జరిగేవి. విదేశాల్లో ఉండే సంతాన యోగం లేని వారు భారత దేశానికి వచ్చి అద్దె తల్లుల ద్వారా సంతానాన్ని సులువుగా పొందగలిగే వారు. 2009లో గుజరాత్‌లో 45 మంది సరోగసీ తల్లులను అధ్యయనం చేయగా, సంతానం పొందాలనుకున్న తల్లిదండ్రుల్లో 41% మంది విదేశాల నుంచి వచ్చారని తేలింది. అద్దె తల్లులు కావాలనుకునే మహిళలు తాము తీసుకునే రిస్కుకు తగినట్టు పారితోషికం చెల్లించాలన్న డిమాండ్ ఆయా కుటుంబాల నుంచి ఎక్కువగా తెరపైకి వచ్చింది.

ఈ విషయంలో స్వదేశీయులు కన్నా విదేశాల నుంచి వచ్చిన తల్లిదండ్రులే ఎక్కువగా చెల్లిస్తున్నారు.ప్రస్తుతం భారత ప్రభుత్వం పరోపకార సరోగసీని మాత్రమే నిబంధనల ప్రకారం అనుమతిస్తుంది. ఇందులో వాణిజ్యపరంగా ఆర్థిక లావాదేవీలు వంటివి ఉండకూడదు. ఇది చట్టబద్ధంగా వివాహం చేసుకున్న సంతానం లేని దంపతులకు మాత్రమే పరిమితం చేయబడింది. కానీ ఇప్పుడు కేవలం ధనార్జనే ధ్యేయంగా అమాయకులైన యువతులను పావులుగా దళారులు వాడుకుంటున్నారు. అందుకనే ఈ సరోగసీ రాకెట్‌లో ఇరుక్కున్న మహిళలకు స్వేచ్ఛలేక, ఆరోగ్య భద్రత లేక వారి భవిష్యత్ విషాద గాథలుగా మిగిలిపోతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News