Sunday, December 22, 2024

ఇడి కేసులపై నిఘా?

- Advertisement -
- Advertisement -

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోని నేతలపై అక్రమ కేసులు బనాయింప చేస్తూ రాజకీయ కక్ష సాధింపుకి పాల్పడుతున్నదనే విమర్శ నేపథ్యంలో ఆ కేసుల్లో ఏవి నిజమైనవో, ఏవి కావో నిగ్గు తేల్చేందుకు జాతీయ స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు చేసిన సూచన ఆచరణలో సులభ సాధ్యమైనది కాదు. తమిళనాడుకు చెందిన మంత్రులు, అధికారులు తదితరులపై నమోదైన అవినీతి కేసుల్లో అవసరమైన సమాచారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ (ఇడి) తరపున దాఖలైన పిటిషన్‌పై విచారణలో న్యాయమూర్తులు సూర్యకాంత్, కెవి విశ్వనాథన్‌ల ధర్మాసనం ఈ సూచన చేసింది. తమ అధికారి అంకిత్ తివారిపై దాఖలైన లంచం కేసును తమిళనాడు విజిలెన్స్, అవినీతి నిరోధక డైరెక్టొరేట్ నుంచి సిబిఐకి బదలాయించాలని కూడా ఇడి సుప్రీం కోర్టును కోరింది. తమిళనాడులో పని చేస్తూ ఉండిన సీనియర్ ఇడి అధికారి అంకిత్ తివారిని(ఒక పాత కేసును తిరిగి ప్రయోగించకుండా చూడడానికి ఒక డాక్టర్ నుంచి

రూ. 20 లక్షల లంచం తీసుకొన్నందుకు) గత డిసెంబర్ 1న ఆ రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇడి కేసులో దాని తరపున సుప్రీం కోర్టులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కొన్ని బిజెపియేతర రాష్ట్రాల పైనే ఇడిని ప్రయోగిస్తున్నదని తమిళనాడు తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తదితరులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇడి కేసులలో ఏవి నిజమైనవో, ఏవి రాజకీయ కక్ష సాధింపు కోసం బనాయించినవో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో దోషులు, అవినీతిపరులు చట్టం నుంచి తప్పించుకోకుండా జాగ్రత్తపడాలని ధర్మాసనం హెచ్చరించింది. ధర్మాసనం సూచించినట్టు ఇడి, సిబిఐ కేసులలో కక్ష సాధింపు విషం పూసుకొన్నవి ఏవో, కానివి ఏవో నీటిని పాలను విడదీసినట్టు వేరు చేసి చూపించే యంత్రాంగాన్ని నెలకొల్పితే అది ఎవరి అదుపులో పని చేస్తుంది? అది కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సివిసి), ఇడి, సిబిఐల మాదిరిగా కేంద్రం ఇచ్చే జీత, భత్యాలు, వ్యవస్థాగత సదుపాయాల మీద ఆధారపడే పని చేయాలి కదా.

 

దాని అధినేతను నియమించే కమిటీలో ఎవరు ఉంటారు అనేది మరో ముఖ్యమైన అంశం. రాజ్యాంగ వ్యవస్థ, దేశ ప్రజాస్వామ్యానికి ప్రాతిపదిక, పట్టుగొమ్మ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్ (సిఇసి) నియామకాలకు చిరకాలంగా నిష్పాక్షిక వ్యవస్థ లేకపోడాన్ని వ్యతిరేకిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ), ప్రతిపక్ష నేత, ప్రధానితో కూడిన కమిటీని సుప్రీం కోర్టు నియమించగా, అందులో సిజెఐ ప్రమేయం లేకుండా చేస్తూ ఆ స్థానంలో ఒక కేంద్ర మంత్రిని చేరుస్తూ కేంద్రం చట్టం చేసిన ఉదంతం ఇటీవలిదే. అలాగే ఉన్నత న్యాయమూర్తుల నియామకంలో కొలీజియం వ్యవస్థను మళ్ళీ రద్దు చేయించి కేంద్రం అదుపులో పని చేసే కొత్త ఏర్పాటును నియమింప జేసుకోవాలని బిజెపి ఆరాటపడుతున్న విషయం రహస్యమైనది కాదు. అందుచేత సర్వస్వతంత్ర వ్యవస్థను సుప్రీం కోర్టు ఏర్పాటు చేసినా బిజెపి పాలకులు దానిని బతకనివ్వరు. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 121 మంది రాజకీయ ప్రముఖులపై ఇడి కేసులు నమోదై దర్యాప్తు సాగుతున్నదని, వీరిలో 115 మంది ప్రతిపక్షాలకు చెందినవారేనని తెలుస్తున్నది.

అంటే 95% కేసులు ప్రతిపక్ష నేతల మీదనే ఉండడం గమనార్హం. అయితే ఇడి కేసుల్లో చరమాంకానికి చేరుకొని కోర్టు తీర్పులు వెలువడినవి చాలా తక్కువ. దీనిని బట్టి ప్రతిపక్ష నాయకులపై బురద చల్లడానికే ఈ కేసులు పరిమితమవుతున్నట్లు స్పష్టపడుతున్నది. కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ హయాంలో 2004 2014 మధ్య కేవలం 26 మంది రాజకీయ నాయకుల మీదనే కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టగా, అందులో 14 అంటే 54 శాతం ప్రతిపక్ష నేతలపై నమోదు చేశారు. సిబిఐని 10 రాష్ట్రాలు బహిష్కరించినందున ప్రస్తుత బిజెపి పాలకులు ఇడిని తరచుగా ప్రయోగిస్తున్నారు. అసమ్మతిని అణచివేయడానికి కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదంటూ 14 ప్రతిపక్షాలు దాఖలు చేసుకొన్న పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి సుప్రీం కోర్టు గతంలో నిరాకరించింది. కేసుల నుంచి రాజకీయ నాయకులకు ప్రత్యేక రక్షణ కల్పించలేమని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలను ప్రజల ముందు పలచనచేసి రాజకీయంగా లబ్ధి పొందడానికే దర్యాప్తు సంస్థల వెన్నువిరిచే నిరంకుశత్వానికి కేంద్ర పాలకులు పాల్పడుతున్నారనే అభిప్రాయం ఎన్న డూ లేనంతగా బలపడింది. ఇది దేశ ఫెడరల్ సౌభాగ్యాన్ని బలి తీసుకొంటున్నది. దర్యాప్తు సంస్థలకు అంటిన ఈ కళంకం తొలగవలసి ఉంది. రాజ్యాంగ బాధ్యతలను నిర్విఘ్నంగా నిర్వర్తించే పాలకుల పాలనలోనే ఇది సాధ్యం కాగలదనిపిస్తున్నది. అయితే రాజకీయ కక్ష సాధింపు కేసులను కనిపెట్టి కట్టడిచేసే యంత్రాంగం సుప్రీం కోర్టు చొరవతో ఏర్పాటైతే హర్షించవలసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News