Monday, December 23, 2024

చత్తీస్‌గడ్డపై గెలిచి నిలిచేదెవరో?

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : గిరిజనుల ప్రాబల్యం అధికంగా ఉన్న చత్తీస్‌గఢ్‌లో ఇరవయ్యేళ్ళ క్రితం బిజెపి పాగా వేసింది. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగికి, ఆ పార్టీ నేతలకు మధ్య చోటు చేసుకున్న అంతర్గత కుమ్ములాటల కారణంగా రాష్ట్రంలో బిజెపి పదిహేనేళ్లపాటు తిరుగులేని అధికారం చెలాయించింది. అయితే బిజెపి జైత్రయాత్రకు ఐదేళ్లక్రితం కాంగ్రెస్ చెక్ పెట్టింది. 2018 ఎన్నికల్లో ఘన విజయం సాధించి, అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆ పార్టీ నేత భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి, ఎదురులేని నాయకుడిగా ఎదిగారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పటిష్ఠంగా వేళ్లూనుకోవడంతో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బిజెపికి నిరాశ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని పోల్ సర్వేలు కాంగ్రెస్ వరుసగా రెండోసారి అధికారంలోకి రాబోతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఆ విషయాన్ని గ్రహించి మధ్యలో ముఖ్యమంత్రిని మార్చాలని ప్రయత్నించిన కాంగ్రెస్ అధిష్ఠానం వెనకడుగు వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుతో రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉండడంతోపాటు భూపేష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో బిజెపి విఫలమవడంతో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు ఖాయంగా కనిపిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.

పీపుల్స్ సర్వే ఏం చెప్పింది…
తాజాగా, హైదరాబాద్ కు చెందిన పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో కాంగ్రెస్ 55-60 సీట్లను, బీజేపీ 28-34 సీట్లను, బీఎస్పీ, ఇండిపెండెంట్లు రెండు స్థానాలను గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేసింది. 90 అసెంబ్లీ స్థానాలున్న చత్తీస్ గఢ్ లో మ్యాజిక్ ఫిగర్ 46. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా మెజార్టీ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. 2018లో 43 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్ ఈసారి 47శాతం ఓట్లను రాబట్టుకుంటుందని అంచనా. గత ఎన్నికల్లో 33 శాతం ఓట్లు సాధించిన బీజేపీ, ఈసారి 42 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. అంటే బీజేపికి తొమ్మిదిశాతం మేరకు ఓట్లు పెరుగుతాయన్నమాట. ఇది ఒక రకంగా రాష్ట్రంలో బిజేపి మళ్ళీ బలం పుంజుకుంటోందనడానికి సూచనగా చెప్పాలి. 2018లో కాంగ్రెస్ 68 స్థానాల్లో గెలిస్తే, బీజేపీ కేవలం 15 చోట్ల మాత్రమే గెలుపొందింది.

ప్రత్యర్థి బలహీనత భూపేష్‌కు కలిసొచ్చేనా..?
ముఖ్యమంత్రి భూపేష్ తన పనితీరుతోపాటు ఛత్తీస్‌గఢ్ సంసృ్కతీ సంప్రదాయాలకు పెద్దపీట వేయడంతో ప్రజలలో ఆయన పలుకుబడి బాగా పెరిగింది. కోవిడ్ సమయాన్ని మినహాయించి మిగిలిన రోజుల్లో ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు పార్టీలో ఆయన ప్రత్యర్థి సింగ్ డియో సొంత ప్రాంతంలోనే బలహీనపడడం కూడా భూపేష్‌కు కలిసివస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా భూపేష్ కు సరితూగే మరో నాయకుడు లేరని పీపుల్స్ పల్స్ సర్వేలో ప్రజలు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి భూపేష్ కు పోటీగా బిజెపిలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా మరొకరు కనిపించడం లేదు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్‌సింగ్‌ను భూపేష్‌కు సరైన ప్రత్యామ్నాయంగా ప్రజలు భావించకపోవడం గమనార్హం.

బిజెపి అస్త్రాలు ఫలించేనా..?
అయితే, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టిన పనులకు సంబంధించి కేంద్రం నిధులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బిజెపి ‘మోర్ ఆవాస్ మోర్ అధికార్’ పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టి 2023 మార్చిలో బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీని ముట్టడించింది. బిజెపి తన పరివర్తన యాత్రలో, ఈ అంశంపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తోంది. మైనింగ్ రంగంలో, పీఎస్‌సీ నియామకాల్లో, మద్యం అమ్మకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ బిజెపి విమర్శలు గుప్పిస్తోంది. క్రిస్టియన్ మిషనరీలు బస్తర్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన గిరిజనులను ప్రలోభాలతో తమవైపు తిప్పుకుని మత మార్పిడికి ప్రోత్సాహిస్తున్నాయని బిజెపి విమర్శిస్తోంది. ఈ పరిణామాలు బిజెపిని సమర్థించే గిరిజనులు, క్రిస్టియన్లుగా మారిన గిరిజనుల మధ్య ఘర్షణలకు దారితీశాయి.

బీమేతెరా, కావార్థా జిల్లాల్లో కూడా హిందూ ముస్లిం మతకలహాలు జరిగాయి. కావార్దాలో బజరంగ్ దళ్ నేత విజయ్ శర్మకు, సాజాలో ఈశ్వర్‌సాహు (మతకలహాలలో మృతి చెందిన సాహు తండ్రి)కి బీజేపీ అసెంబ్లీ టికెట్లు ఇచ్చింది. ఈ ప్రభావం అరడజను స్థానాలపై ఉంటుందని భావిస్తున్నారు. బస్తర్ గా పేరొందిన, ఎస్టీ సామాజిక వర్గానికి బలం ఉన్న ఛత్తీస్‌గఢ్ దక్షిణ ప్రాంతంలోని 12 స్థానాల్లో 11 ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. ఇక్కడ ఒక్క జగదల్‌పూర్ మాత్రమే మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉంది. ఇక్కడ 2018 ఎన్నికల్లో 11 స్థానాలు గెలిచిన కాంగ్రెస్, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మరోస్థానాన్ని కూడా గెలిచుకుని, మొత్తం 12 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి అజిత్‌జోగి స్థాపించిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జోగీ) పార్టీ బీఎస్పీతో కలిసి 2018 ఎన్నికల్లో పోటీ చేసి, ఏడు సీట్లను గెలుచుకుంది. ఈసారి ఈ కూటమి ప్రభావం కనిపించడం లేదు. దానితో వారి ఓట్లు కూడా కాంగ్రెస్ కు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి.

చిన్న పార్టీల ప్రభావం ఎంత..
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక సమీకరణాలు, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం, పార్టీ పనితీరు మొదలైన అంశాలలో కాంగ్రెస్ ఇతర పార్టీల కంటే ముందంజలో ఉండడంతోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ సరైన పాత్ర పోషించడంలో విఫలం చెందిందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కాంగ్రెస్, బీజేపీలే కాకుండా గోండ్‌వాన్ గణతంత్ర పరిషత్, సర్వ్ ఆదివాసీ సమాజ్ మద్దతిస్తున్న హమారా రాజ్ పార్టీ, ఛత్తీస్‌గఢ్ క్రాంతి సేనపార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. అయితే వాటి ప్రభావం అంతగా ఉండకపోవచ్చునని అంచనా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News