Thursday, January 23, 2025

నేలను కాపాడుకుంటేనే మనుగడ

- Advertisement -
- Advertisement -

హర్టీకల్చర్ వర్శిటీ విసి డా.నీరజ

మనతెలంగాణ/హైదరాబాద్ : నేల నిస్సారం కాకుండా కాపాడుకుంటేనే జీవకోటి మనుగడ మనగలదని,  ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ శ్రీమతి బి. నీరజా ప్రభాకర్ అన్నారు. అంతర్జాతీయ మృత్తిక దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం లిబర్టీ ఫౌండేషన్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉధ్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఏర్పాటు చేసిన అగ్రిఫుడ్ టెక్ 360 సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం మాట్లాడుతూ…మానవ మనుగడ నేల సుస్థిర యాజమాన్యతో ముడిపడి ఉందన్నారు.భవిష్యత్ తరాలకు మనం ఇవ్వగలిగే కానుక సారవంతమైన నేల మాత్రమే అన్నారు. ప్రపంచంలో ఆహార ఉత్పత్తి మానవాళికి కావాల్సిన ఆహార అవసరాలను తీర్చగలిగేది కేవలం ఆరోగ్యమైన భూమాతేనని ఆమె చెప్పారు.

పిడికిలిలో సరిపోయే మట్టిలో భూమిపై ఉన్న మానవాళి కంటే ఎక్కువగా సూక్ష్మజీవులు ఉంటాయని వెల్లడించారు. పారిశ్రామికీకరణ, యాంత్రీకరణ, మోతాదుకు మించి సహజ వనరుల వాడకం, పర్యావరణ క్షీణతకు కారణం అని తెలిపారు. ఇప్పటికే 33 శాతం భూములు కోత గురయ్యాయని వెల్లడించారు. 2050 నాటికి 80 నుంచి 90శాతం కోతకు గురి అయ్యే అవకాశం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. సాలీనా ఎకరానికి ఒకటి నుంచి 2 టన్నుల మృతిక నిర్వీర్యం కాబడుతుందన్నారు. పంట మార్పిడి, కవర్ పంటల సాగు, జీవన ఎరువులు, బయో స్టిములెంట్, సమగ్ర పంటల సాగు వ్యవస్థ వ్యర్ధాల వినియోగం వాడకంతో భూములు పునర్జీవమవుతావని పేన్కొన్నారు.

హరిత వాయు ఉద్గారాలు, గాలిలో కార్బనాన్ని తగ్గించడానికి కార్బన్ సీక్వెస్ట్రేషన్ ముఖ్యమని తెలిపారు. ఒక సెంటీమీటర్ బయోచారుతో 45 చదరపు మీటర్ల మేర భూములో కర్బనం పెరుగుతుందని డాక్టర్ నీరజా ప్రభాకర్ అన్నారు. మానవ భవిషత్తు బాగుండాలంటే భూముల ఆరోగ్యం బాగుండాలని నాగార్జున గ్రూప్ చైర్మన్ కెఎస్. రాజు అన్నారు. అందుకే భూముల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవులదే అని తెలిపారు. అందుకు వెంటనే ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్వచ్ఛమైన పునర్వినియోగ సహజ వనరుల వినియోగానికి పరిశ్రమలు, రైతులు మొగ్గు చూపాల్సిన అవసరం ఉందని అగ్రి ఫుడ్ టెక్, రూరల్ ఇంపాక్ట్, మెంటర్ డాక్టర్ రవిశంకర్ అన్నారు. 95శాతం పైగా ఆహార అవసరాలు భూమి లోని వైవిధ్య జీవుల వల్ల తీరుతున్నాయని అన్నారు. ఒక సెంటీమీటర్ నేల ఏర్పడడానికి 1000 సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు.

సేంద్రియ, రసాయన ఎరువులు కలిపి వాడితేనే భూములు సుస్థిరంగా ఉంటాయని, పంటల దిగుబడులు, నాణ్యతలు పెరుగుతాయని, నేల ఆరోగ్యం బాగుంటుందని కోరమాండల్ ఫర్టిలైజర్ వైస్ ప్రెసిడెంట్ జివి సుబ్బారెడ్డి అన్నారు. నేల ఆరోగ్యానికి సంబంధించి ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాల్స్ రైతులు, పరిశోధకులు, విద్యార్థుల్ని ఆకట్టుకున్నాయి. యూనివర్సిటీ డీన్ డాక్టర్ అడపా కిరణ్ కుమార్, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి. ప్రశాంత్, తదితరులు భూమి ఆరోగ్యం, సహజ వ్యవసాయ పద్దతులను వివరించారు.సేంద్రీయ పంటలు సాగు చేస్తున్న రైతులైన నాగరత్నం నాయుడు, లోకసాని పద్మా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మాధవరెడ్డి, ప్రొఫెసర్లు పరిశోధకులు, విద్యార్థులు, పరిశ్రమల ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News