న్యూఢిల్లీ: ఈ నెల 14న మకర సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ‘సూర్య నమస్కార్’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో 75 లక్షలమంది పాల్గొంటారని తెలిపింది. భూమిపై కిరణాలు వెదజల్లుతూ జీవులకు రక్షణ కల్పిస్తున్నందుకు సూర్యునికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంగా ఆయుష్‌శాఖ అభివర్ణించింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసిన వేళ సూర్య నమస్కారాల ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలిసిందని గుర్తు చేసింది. శరీరానికి అవసరమైన డివిటమిన్‌ను అందిస్తూ రోగనిరోధకశక్తిని పెంచడంలో సూర్య నమస్కారాల ఆవశ్యకతను ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నది. వాతావరణంలో మార్పుల వల్ల భూతాపం పెరిగిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నదని తెలిపింది. సౌరశక్తి(హరిత ఇంధనం) వినియోగాన్ని పెంచడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చునన్న సందేశం కూడా ప్రపంచానికి వెళ్తుందని పేర్కొన్నది. మకరసంక్రాంతి మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని ఆయుష్ మంత్రిత్వశాఖ తెలిపింది.