Monday, January 20, 2025

తీరుమారని సూర్యకుమార్.. వన్డేల్లో వెంటాడుతున్న వరుస వైఫల్యాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/క్రీడా విభాగం: టి20 ఫార్మాట్‌లో ఎదురులేని బ్యాటర్‌గా పేరుతెచ్చుకున్న భారత స్టార్ సూర్యకుమార్ వన్డేలకు వచ్చేసరికి తేలిపోతున్నాడు. కొంతకాలంగా సూర్యకుమార్‌కు వన్డేల్లో కూడా వరుసగా అవకాశాలు లభిస్తున్నాయి. అయితే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం అతను విఫలమవుతున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో కూడా సూర్యకుమార్ చెత్త బ్యాటింగ్‌తో అభిమానులను నిరాశకు గురిచేశాడు. తొలి రెండు వన్డేల్లో తుది జట్టులో చోటు సంపాదించిన సూర్యకుమార్ ఘోరంగా విఫలమయ్యాడు. రెండు మ్యాచుల్లోనూ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ముంబైతో పాటు విశాఖపట్నంలోనూ సూర్య తాను ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్‌ను పారేసుకున్నాడు. రానున్న వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో సూర్యకుమార్ వైఫల్యం భారత్‌ను కలవరానికి గురిచేస్తోంది. టి20లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న సూర్య వన్డేలకు వచ్చే సరికి ఆ జోరును ప్రదర్శించలేక పోతున్నాడు.

జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన సూర్యకుమార్ వైఫల్యం నిజంగా కలవరపరిచే అంశమే. సొంత గడ్డపై ఈ ఏడాది చివరిలో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో ఎలాగైనా ట్రోఫీని సాధించాలని భారత్ తహతహలాడుతోంది. ఇలాంటి స్థితిలో జట్టులోని కీలక ఆటగాళ్లలో ఒకడైన సూర్య ఇలా వరుస వైఫల్యాలు చవిచూడడం జట్టుకు ప్రతికూలంగా మారింది. రానున్న ఐపిఎల్‌లో మెరుగ్గా రాణించడం ద్వారా సూర్య తన ఫామ్‌ను తిరిగి అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా జరిగే మూడో చివరి వన్డేలో సూర్యకుమార్‌కు తుది జట్టులో స్థానం లభిస్తుందా లేదా అనేది సందేహంగా మారింది. జట్టు యాజమాన్యం మాత్రం మరో అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. సూర్యకుమార్ కూడా ఈసారి ఛాన్స్ దొరికితే బ్యాట్‌తో చెలరేగి పోవాలని తహతహలాడుతున్నాడు. సూర్య గాడిలో పడితే వన్డేల్లో టీమిండియా బ్యాటింగ్ ఇబ్బందులు చాలా వరకు తీరిపోతాయి. ఇదిలావుంటే వరుసగా రెండు మ్యాచుల్లో సున్నాకే పెవిలియన్ చేరడంతో సూర్యకుమార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అతన్ని వన్డేలకు దూరంగా ఉంచాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News