టాప్‌లోనే ట్రావిస్ హెడ్, ఆరో స్థానంలో యశస్వి
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం తాజాగా ప్రకటించిన ఐసిసి టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్‌తో కలిసి సూర్యకుమార్ సంయుక్తంగా రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. సూర్య, సాల్ట్ 797 పాయింట్లతో ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. హెడ్ 844 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. కొంతకాలంగా హెడ్ టి20 ఫార్మాట్‌లో అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తున్న సంగతి తెలిసిందే.
దీంతో అతను భారత బ్యాటర్ సూర్యకుమార్‌ను వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఇటీవల జింబాబ్వేతో జరిగిన టి20 సిరీస్‌లో అసాధారణ ఆటతో అలరించిన భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఆరో ర్యాంక్‌కు ఎగబాకాడు. జింబాబ్వేతో ఆడిన చివరి మూడు టి20లలో యశస్వి 165.88 స్ట్రైక్‌రేట్‌తో యశస్వి 141 పరుగులు సాధించాడు. దీంతో అతను తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు మెరుగు పరుచుకుని ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు. జింబాబ్వే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన శుభ్‌మన్ గిల్ 36 స్థానాలు ఎగబాకి 36వ స్థానంలో నిలిచాడు. సిరీస్‌లో గిల్ ఐదు మ్యాచుల్లో కలిపి 170 పరుగులు సాధించాడు.
బౌలింగ్ విభాగంలో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. హెన్రిచ్ నోర్జే (సౌతాఫ్రికా) రెండో, వనిందు హసరంగ (శ్రీలంక) మూడో ర్యాంక్‌లో నిలిచారు. భారత్ నుంచి టాప్10లో ఎవరికీ చోటు దక్కలేదు. అక్షర్ పటేల్ తాజా ర్యాంకింగ్స్‌లో 4 స్థానాలు కోల్పోయి 13వ స్థానంలో నిలిచాడు. కుల్దీప్ యాదవ్ 4 ర్యాంక్‌లు కోల్పోయి 16వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. కాగా, టీమ్ విభాగంలో మాత్రం భారత్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. విశ్వవిజేతగా ఉన్న టీమిండియా 266 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా రెండో, ఇంగ్లండ్ మూడో, వెస్టిండీస్ నాలుగో, సౌతాఫ్రికా ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాయి.