రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి
పాట్నా: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ కుటుంబంలో మరో ఘోర విషాదం చోటు చేసుకుంది. బీహార్‌లో సంభవించిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వారంతా సుశాంత్ సింగ్ బంధువులని తెలుస్తోంది. బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ల ట్రక్కు టాటా సుమోను ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. వీరంతా సుశాంత్ సింగ్, బీహార్ మంత్రి నీరజ్ సింగ్ బబ్లూ బంధువులని తెలుస్తోంది. సుశాంత్ సింగ్ బంధువు, హర్యానా ఎడిజి ఒపి సింగ్ సతీమణి గీతా సింగ్ సోమవారం అనారోగ్యంతో పాట్నాలో మృతి చెందారు.
భర్త లాల్‌జీత్ సింగ్ సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యులు ఆమె దహన సంస్కారాల అనంతరం పాట్నానుంచి సుమోలో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. సుమో డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సుశాంత్ సింగ్ 2020 జూన్ 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమో డ్రైవర్‌తో పాటుగా లాల్‌జీత్ సింగ్, ఆయన ఇద్దరు కుమారులు కూడా చనిపోయినట్లు లఖీ సరాయ్ జిల్లా ఎస్‌పి సుశీల్ కుమార్ చెప్పారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం పాట్నా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.