ముంబై ః సీనియర్ రాజకీయ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ షిండే క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని షిండే స్వయంగా ఇక్కడ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో దిగ్గజనేతగా షిండేకు మంచి పేరుంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సీనియర్ నేత తమ రాజకీయ వైరాగ్యం గురించి తెలిపారు. తాను ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటానని షిండే పేర్కొన్నారు. రాజకీయాల్లో ఇకపై చురుగ్గా పాల్గోనేది లేదని తెలిపిన షిండే పార్టీ కోరితే అవసరం అయినప్పుడు ఎటువంటి సేవలకు అయినా అందుబాటులో ఉంటానని వెల్లడించారు.
రాజకీయాల నుంచి వైదొలగాలనే ఈ నిర్ణయం రెండేళ్ల క్రితం తీసుకున్నదని, ఇప్పుడు దీనిని అమలులోకి తీసుకువస్తున్నట్లు షిండే చెప్పారు. మహారాష్ట్రలోని షోలాపూర్ షిండే ప్రాబల్యానికి పెట్టని కోటగా ఉంది. తాను రాజకీయాలకు దూరం అయినా తన కూతురు ప్రీతి షిండే (42) తన బదులుగా షోలాపూర్ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తుందని సీనియర్ నేత తెలిపారు. ప్రీతి ఇప్పటికే స్థానికంగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాను షోలాపూర్ ఎంపిగా పోటీ చేస్తూ వచ్చానని, ఇప్పుడు ఈ వారసత్వం తన కూతురు తీసుకుంటుందని షిండే తెలిపారు.