న్యూఢిల్లీ: యువ రెజ్లర్ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ప్రతిష్ఠ రోజు రోజుకు దిగజారుతోంది. ఇప్పటికే సుశీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. భారత్ అగ్రశ్రేణి రెజ్లర్‌గా పేరు తెచ్చుకున్న ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించాడు. అతన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది యువకులు రెజ్లింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు.
ఇదిలావుంటే యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో సుశీల్ ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. దీంతో ఒక్కసారిగా సుశీల్ కుమార్ ప్రతిష్ఠ పాతాళానికి పడిపోయింది. సుశీల్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు రావడంతో అతన్ని విధుల నుంచి తొలగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. సుశీల్ కుమార్ ఉత్తర రైల్వేస్‌లో ఆఫీసర్ ఆన్ డ్యూటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనిపై వచ్చిన ఆరోపణలు తొలగి పోయేవరకు విధుల నుంచి సస్పెండ్ చేయాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయి.
అతన్ని ఉరి తీయాలి..
మరోవైపు తమ కుమారుడి మరణానికి కారణమైన సుశీల్ కుమార్‌ను ఉరి తీయాలని సాగర్ రాణా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అకారణంగా తమ కుమారుడి ప్రాణాలను తీసిన సుశీల్‌ను కఠినంగా శిక్షించాలని వారు పోలీసులను కోరుతున్నారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి సుశీల్‌కు ఉరి శిక్ష పడేలా చూడాలని వారు పోలీసులను వేడుకుంటున్నారు. పోలీసులపై తమకు పూర్తి నమ్మకం ఉందని వారు పేర్కొన్నారు. అయితే రాజకీయ పలుకుబడి ఉపయోగించి సుశీల్ కేసును తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందని రాణా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.