Thursday, November 14, 2024

లగచర్ల దాడి ఘటనలో పరారీలో అనుమానితుడు!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా పరిశ్రమ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయసేకరణకు వెళ్లిన కలెక్టర్‌పై దాడి చేసిన ఘటనను పోలీసు యంత్రాగం అత్యంత సీరియస్ గా తీసుకుంది. అర్థరాత్రి పోలీసులు గ్రామంపై విరుచుకుపడి యాభై మందికిపైగా వ్యక్తుల్ని అరెస్టు చేశారు. వీరంతా కలెక్టర్ పై దాడి చేసిన ఘటనలో పాల్గొన్నారు. సాయంత్రానికి నలభై మందికి నోటీసులు ఇచ్చి వదిలి పెట్టారు. పదహారు మందిని మాత్రం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో పోలీసులు కీలక విషయాలు కనిపెట్టారు. కలెక్టర్ షెడ్యూల్‌లో లగచర్ల గ్రామంలో రైతుల అభిప్రాయాలు తెలుసుకునే షెడ్యూల్ లేదు. కానీ సమీప గ్రామానికి వచ్చిన సురేష్ అనే బిఆర్‌ఎస్ నాయకుడు తమ గ్రామంలో రైతుల అభిప్రాయాలు కూడా వినాలని చెప్పి కలెక్టర్‌ను తీసుకెళ్లారు.

కలెక్టర్ అక్కడకు వెళ్లగానే అక్కడ గుమికూడి ఉన్న వారు దాడులు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కలెక్టర్‌కు అభిప్రాయాలు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పోలీసుల విచారణలో సురేష్ అనే వ్యక్తి మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడిగా గుర్తించారు. ఆయనతో రెండు రోజుల్లో 42 సార్లు సురేష్ ఫోన్ లో మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ సురేష ప్రస్తుతం కనిపించడం లేదు. ఆయన పారిపోవడంతో పట్టుకునేందుకు గాలిస్తున్నారు. సురేష్‌పై గతంలో అత్యాచారంతో పాటు పలు కేసులు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. కలెక్టర్ పై దాడి ఘటన యాధృచ్చికంగా జరిగింది కాని ప్లాన్డ్ గా దాడి కోసం ఆయనను పిలిపించి రైతుల్ని రెచ్చ కొట్టి దాడులకు పాల్పడేలా చేశారంటున్నారు.

ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇది రాజకీయ కుట్రేనని అధికారం కోల్పోయిన వారు అసహనం తో చేస్తున్న పనులుగా ఆరోపిస్తున్నారు. ఇలాంటి దాడులను ఏ మాత్రం తేలికగా తీసుకోబోమని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. ఆయన ఈ ఘటనపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే బిఆర్‌ఎస్ నేతలు మాత్రం ఇది కలెక్టర్‌పై జరిగిన దాడి కాదని ప్రభుత్వంపై జరిగిన దాడేనని అంటోంది. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందని అందుకే దాడులకు దిగుతున్నారని అంటున్నారు. లగచర్ల ఘటన విషయంలో పోలీసులు పదహారు మంది వ్యక్తులను రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయవర్గాల్లో పెను సంచలనం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News