ముంబయి : మహారాష్ట్రలో గిలియన్ బారె సిండ్రోమ్ (జిబిఎస్) బాధితుడు ఒకరు చనిపోయారు. మృతికి కారణంపై ఇంకా స్పష్టత రానప్పటికీ వైద్యులు మాత్రం జిబిఎస్ వల్లే మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. రాష్ట్రంలో జిబిఎస్ బాధితుల సంఖ్య 101కి చేరింది. వారిలో 16 మందికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న ఆ జిబిఎస్‌కు సంబంధించి వైద్యులు పలు కీలక విషయాలు వెల్లడించారు. సాధారణంగా శరీరంలోకి ప్రవేశించిన ఇన్ఫెక్షన్ కారక క్రిములకు బదులు నరాలపై దాడి చేస్తుందని,ఇది చాలా అరుదుగా జరుగుదుందని వారు తెలిపారు. జిబిఎస్ బారిన పడినవారిలో తిమ్మిర్లు, కండరాలు బలహీనంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వారు తెలియజేశారు.
కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం వల్ల డయేరియా వస్తుందనేది విదితమే. దీనికి కారణం కలుషిత ఆహారం ద్వారా శరీరంలోకి చేరే కాంపిలో బ్యాక్టర్ జెజునీ బ్యాక్టీరియా అని నిపుణులు చెబుతున్నారు. తాజా జిబిఎస్ కేసులకు కూడా ఇదే బ్యాక్టీరియా కారణమని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ విషయంలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ చేసే పొరపాటే జిబిఎస్‌కు దారి తీస్తుందని, ప్రతి వెయ్యి మందిలో కేవలం ఒకరికి ఈ పరిస్థితి ఎదురవుతుందని వారు తెలిపారు. ఈ సిండ్రోమ్ బాధితుల్లో డయేరియా, పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు మొదలైన లక్షణాలు కనిపిస్తాయని వారు చెప్పారు.
అంటువ్యాధి కాదుజిబిఎస్ అంటువ్యాధి కాదని, ఒకరి నుంచి మరొకరికి సోకదని వైద్యులు స్పష్టం చేశారు.
జిబిఎస్ బాధితులకె సరైన చికిత్స అందిస్తే కోలుకుంటారని వారు ధైర్యం చెప్పారు. సుమారు 80 శాతం మంది బాధితులు చికిత్స అనంతరం ఆరు మాసాల్లో కోలుకుంటారని వారు తెలిపారు. కొందరిలో మాత్రంఏడాది వరకు ప్రభావం కనిపిస్తుందని వారు చెప్పారు. అయితే, చికిత్స చాలా ఖరీదైందని అధికారులు తెలిపారు. చికిత్సలో భాగంగా రోగికి ఇచ్చే ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్ ధర ఒక్కొక్కటి వేలల్లో ఉంటుందని వారు సూచించారు. ఈ నేపథ్యంలో జిబిఎస్ బాధితులకు ఉచిత వైద్యం అందిస్తామని మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అజిత్ పవార్ వెల్లడించారు.