న్యూఢిల్లీ : వక్ఫ్ సవరణ బిల్లుపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ(జెపిసి) సమావేశానికి హాజరవుతున్న పది మంది ప్రతిపక్ష సభ్యులను శుక్రవారం సస్పెండ్ చేశారు. కమిటీ చైర్మన్ జగదంబికా పాల్ తన ఇష్టానుసారం కమిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్న ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, ఆరోపణల మధ్య వారిని సస్పెండ్ చేయడమైంది. జగదంబికా పాల్ కమిటీ కార్యకలాపాలను ప్రహసనప్రాయం చేశారని, ఆయన ప్రభుత్వ ఆదేశానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపించగా, సమావేశాన్ని అడ్డుకోవడమే లక్షంగా వారి ప్రవర్తన ఉందని చైర్మన్ విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత కల్యాణ్ బెనర్జీ తనను దుర్భాషలాడారని చైర్మన్ ఆరోపించారు.
కమిటీ సమావేశాన్ని సజావుగా నిర్వహించేందుకు తాను పాటుపడినట్లు, సమావేశాన్ని రెండు సార్లు వాయిదా వేసినా ఫలితం లేకపోయిందని పాల్ చెప్పారు. ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ కోసం బిజెపి సభ్యుడు నిశికాంత్ దుబే తీర్మానాన్ని ప్రవేశపెట్టగా కమిటీ ఆమోదించింది. సస్పెండైన సభ్యులు కల్యాణ్ బెనర్జీ, నదీముల్ హక్ (టిఎంసి), మొహమ్మద్ జావేద్, ఇమ్రాన్ మసూద్, సయ్యద్ నసీర్ హుస్సేన్ (కాంగ్రెస్), ఎ రాజా, మొహమ్మద్ అబ్దుల్లా (డిఎంకె), అసదుద్దీన్ ఒవైసీ (ఎఐఎంఐఎం), మొహిబుల్లా (ఎస్‌పి), అర్వింద్ సావంత్ (శివసేన యుబిటి). ముసాయిదా చట్టంపై తమ ఆందోళనలు వ్యక్తం చేసేందుకు కాశ్మీర్‌కు చెందిన మతాధిపతి మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్ నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్ ప్రతినిధివర్గం కమిటీ ముందు హాజరైన రోజే ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ చోటు చేసుకుంది.
కమిటీ సమావేశమే వాడిగా వేడిగా మొదలైంది. కమిటీ కార్యకలాపాలను చైర్మన్ తన ఇష్టానుసారం సాగిస్తున్నారని, సమావేశం అజెండాను కావాలని మారుస్తున్నారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. స్వల్ప వాయిదా అనంతరం కమిటీ తిరిగి సమావేశమైన తరువాత కూడా నిరసనలు, గందరగోళ దృశ్యాలు కొనసాగడంతో పది మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేశారు. ‘ఈ నెల 21న మా సమావేశంలో తదుపరి సమావేశాన్ని 24, 25 తేదీల్లో నిర్వహించనున్నట్లు చైర్మన్ సభ్యులకు తెలియజేశారు. ప్రతిపక్ష సభ్యులు నిరసించారు. సమావేశాన్ని 30న లేదా 31 తరువాత ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎ రాజా కూడా లేఖ రాశారు. కానీ చైర్మన్ మా మాట వినలేదు’ అని కల్యాణ్ బెనర్జీ చెప్పారు. శుక్రవారం సమావేశం అజెండాను గురువారం రాత్రి పొద్దుపోయిన తరువాత మార్చి, అర్ధరాత్రి అవుతుండగా సభ్యులకు తెలియజేశారని ఆయన చెప్పారు. ‘ప్రతిపక్ష సభ్యులను గృహ సేవకులుగా చైర్మన్ పరిగణిస్తూ, తదనుగుణంగా ఆదేశిస్తున్నారు’ అని కల్యాణ్ బెనర్జీ ఆరోపించారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలపై దృష్టితో కమిటీ కార్యక్రమాలను హడావిడిగా నిర్వహిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు.
సమావేశం జరుగుతుండగా జగదంబికా పాల్ పెక్కు ఫోన్ కాల్స్ అందుకున్నారని, కమిటీ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఆయన ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందుకుంటున్నారని టిఎంసి నేత ఆరోపించారు. అయితే, ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన ‘జుగుప్సాకరంగా’ ఉందని, వారు సమావేశంలో అదే పనిగా రభస సృష్టిస్తున్నారని, జగదంబికా పాల్‌పై అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని బిజెపి సభ్యుడు అపరాజితా సారంగి ఆరోపించారు. కమిటీ ఈ నెల 29న తన తుది నివేదికను ఆమోదించనున్నదని అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిరుడు ఆగస్టు 8న లోక్‌సభలో వక్ఫ్ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టిన తరువాత జెపిసికి నివేదించడమైంది. వక్ఫ్ ఆస్తుల క్రమబద్ధీకరణ, నిర్వహణలో సమస్యలు, సవాళ్లను అధిగమించేందుకు వక్ఫ్ చట్టం 1955ను సవరించడం బిల్లు లక్షం.
బిల్లును తీవ్రంగా వ్యతిరేకించా: మీర్వాయిజ్
కమిటీ ముందు హాజరు కావడానికి ముందు మీర్వాయిజ్ విలేకరులతో మాట్లాడుతూ, తాను బిల్లును తీవ్రంగా వ్యతిరేకించినట్లు, మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని కోరుకున్నట్లు తెలియజేశారు. ‘మా సూచనలు వింటారని, తదనుగుణంగా వ్యవహరిస్తారని, తమ అధికారం లేకుండా చేశారని ముస్లింలు భావించేలా ఎటువంటి చర్యా తీసుకోబోరని ఆశిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. ‘వక్ఫ్ సమస్య ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అత్యంత తీవ్ర వ్యవహారం. అది ముస్లిం ఆధిక్య రాష్ట్రం కావడమే అందుకు కారణం. అనేక మంది దీనిపై ఆందోళనలు వ్యక్తం చేశారు. మేము సమగ్ర వినతిపత్రం రూపొందించాం. వక్ఫ్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని మేము కోరుకుంటున్నాం’ అని మీర్వాయిజ్ తెలిపారు. మసీదులు, ఆలయాల గురించి చర్చ జరుగుతున్న సమయంలో జమ్మూ కాశ్మీర్‌లో ఇప్పటికే ఉద్రిక్త వాతావరణ ఉందని మీర్వాయిజ్ చెప్పారు.