రాజ్యసభలో పియూష్ గోయల్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ప్రతిపక్షానికి చెందిన 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌పై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో గత సమావేశాల్లో చేసిన రభసకు ఈ 12 మంది సభ్యులు క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా లేనందువల్ల వారి సస్పెన్షన్‌పై ప్రభుత్వం ఎలా పునరాలోచించగలదని రాజ్యసభలో సభానాయకుడు పియూష్ గోయల్ ప్రశ్నించారు. శుక్రవారం ఈ అంశాన్ని ఆర్‌జెడి సభ్యుడు మనోజ్ కుమార్ లేవనెత్తుతూ సస్పెన్షన్‌కు గురైన 12 మంది సభ్యులు పార్లమెంట్ సముదాయంలో ఆందోళన చేస్తున్న ప్రదేశంలోకి కొందరు బిజెపి సభ్యులు చొచ్చుకువెళ్లారని చెప్పారు. వారలా చొచ్చుకువెళ్లడం ప్రజాస్వామిక విలువలను హరించడమేనని ఆయన అన్నారు.
ఇదే అంశాన్ని మరి కొందరు ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తడానికి ప్రయత్నించగా రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు కల్పించుకుంటూ సభ్యుల సస్పెన్షన్‌పై మాట్లాడేందుకు ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇవ్వలేదంటూ కొందరు అపోహలు సృష్టిస్తున్నారని, నవంబర్ 30న జీరో అవర్‌లో ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేందుకు 5 నిమిషాలు అవకాశం ఇచ్చానని ఆయన గుర్తు చేశారు. సభ్యుల సస్పెన్షన్‌పై ఏర్పడిన ప్రతిష్టంభనను పరిష్కరించడానికి అధికార, ప్రతిపక్ష నాయకులు ప్రయత్నించాలని ఆయన సూచించారు. దీనిపై పియూష్ గోయల్ స్పందిస్తూ క్షమాపణ చెప్పేందుకు సస్పెండ్ అయిన సభ్యులు ముందుకు రాకపోతే ప్రభుత్వం ఎలా పునరాలోచిస్తుందని ప్రశ్నించారు.