Thursday, January 23, 2025

తొలగించబడిన ఆర్‌ఐ అరెస్టు

- Advertisement -
- Advertisement -

భూవివాదం పరిష్కరిస్తానని రూ.39లక్షలు వసూలు‚
అడిగితే బెదిరింపులు
అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
వివరాలు వెల్లడించిన ఎసిపి సుదర్శన్

Suspended RI arrested in Hyderabad

మనతెలంగాణ, పంజాగుట్ట:  భూవివాదం పరిష్కరిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో సర్వీస్ నుంచి తొలగించబడిన ఆర్‌ఐని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు ఎయిర్ రైఫిల్స్, ఎయిర్‌గన్, గన్‌లాగా ఉన్న సిగరేట్ లైటర్, ప్రామిసరీ నోట్లు, రద్దు చేసి కరెన్సీ నోట్లు, మద్యం బాటిళ్లు, ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ ఏసిపి సుదర్శన్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. యూసుఫ్‌గూడలోని పోలీస్ క్వార్టర్స్‌లో ఉంటున్న ఆర్‌ఐ కిషన్ రావు( సర్వీస్ నుంచి తొలగించారు) కరీంనగర్‌కు చెందిన అబ్బాస్ నుంచి రూ.39లక్షలు తీసుకున్నాడు. అబ్బాస్‌కు కృష్ణానగర్‌లోని భూమి వివాదం పరిష్కరిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. భూమి వివాదం పరిష్కరించకపోవడంతో బాధితుడు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఈ నెల 8వ తేదీన కిషన్ రావును నిలదీశాడు.

దీంతో ఆగ్రహం చెందిన కిషన్ రావు మళ్లీ డబ్బులు అడిగితే హత్య, అత్యాచారం కేసులో ఇరికిస్తానని బెదిరించాడు. దీంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిషన్ రావును అరెస్టు చేశారు. కిషన్ రావు 1985లో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఆర్‌ఎస్సైగా చేరాడు. తర్వాత పదోన్నతి పొంది వివిధ జిల్లాల్లో ఆర్‌ఐగా పనిచేశాడు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని చంద్రపూర్‌లోజిల్లాలో 1996లో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు జరపడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పై అధికారులు కాల్పులు జరిపిన కేసులో సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ సమయంలోనే రోడ్డు ప్రమాదం జరగడంతో మంచానికే పరిమితమయ్యాడు. కిషన్ రావు సోదరుడు యాదగిరి రావు ఆర్‌ఎస్సైగా గ్రేహౌండ్స్‌లో పనిచేస్తుండగా 2010లో బలిమెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు.

అతడికి యూసుఫ్‌గూడ పోలీస్ క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. తాను డిఐజిగా పనిచేస్తున్నానని చెప్పి పలువురు బాధితుల నుంచి భూమి వివాదాలు పరిష్కరిస్తామని డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని ఎవరి భూవివాదం పరిష్కరించలేదు, వారికి తిరిగి డబ్బులు ఇవ్వలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షలాది రూపాయలు, ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకున్నాడు. ఎరికీ ఉద్యోగాలు ఇప్పించలేదు, ఒరిజినల్ సర్టిఫికేట్లు తన వద్ద పెట్టుకుని బెదిరించేవాడు. నిరుద్యోగులు ఫిర్యాదు చేయడంతో 2009లో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేయడంతో కరీంనగర్ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో కిషన్‌రావు భార్య, కుమారుడిపై కేసు నమోదు చేశారు. ఇవే కాకుండా పలు జిల్లాలో కిషన్ రావుపై కేసులు ఉన్నట్లు ఎసిపి సుదర్శన్ తెలిపారు. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News