Tuesday, December 24, 2024

నాలుగు రోజులుగా నాన్చుడే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ/బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి ఎవరనేది తేలని సంకట సంద్గితత బుధవారం కూడా కొనసాగింది. పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చేందుకు అనువైన మెజార్టీని సాధించుకున్నప్పటికీ సిఎం విషయంలో మాజీ సిఎం సిద్ధరామయ్య, పిసిసి అధ్యక్షులు డికె శివకుమార్ (డికె) మధ్య నెలకొన్న తీవ్రపోటీ పలు మలుపులు తిరుగుతూ చివరికి సిఎం పదవి ఎవరికనే విషయంపై అస్పష్టతనే మిగిల్చింది. వచ్చే 48 నుంచి 72 గంటల వ్యవధిలో కర్నాటకలో కాంగ్రెస్ మంత్రివర్గం ఏర్పాటు అవుతుందని బుధవారం కర్నాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి రణదీప్ సూర్జేవాలా దేశ రాజధానిలో బుధవారం విలేకరులకు తెలిపారు. నిజానికి గురువారం సాయంత్రం కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుందని రెండురోజుల క్రితమే పార్టీ వర్గాలు ప్రకటించాయి.

అయితే ఇది జరగలేదు. రాష్ట్రానికి వెళ్లి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని ఢిల్లీకి పరిశీలకులు చేరారు. పార్టీ నాయకత్వం పిలుపు మేరకు డికె, సిద్ధరామయ్యలు ఢిల్లీకి చేరుకుని మకాం వేశారు. ఈ దశలో బుధవారం ఉదయం డికె సిద్ధ మధ్య రాజీ ఫార్మూలాను ప్రతిపాదించారని, రెండేళ్లు సిఎంగా సిద్ధరామయ్య, మూడేళ్లు డికె ఉండటం, డికెకు ఉపముఖ్యమంత్రి పదవి, తోడుగా కీలక శాఖలు కట్టబెడుతారని, రాహుల్ సమక్షంలో ఈ ఫార్మూలాకు డికె సమ్మతించారని వార్తలు వెలువడ్డాయి. దీనితో ఇక బుధవారం సాయంత్రానికే కొత్త ముఖ్యమంత్రి పేరు, ప్రమాణస్వీకారం తేది బెంగళూరులో పార్టీపరంగా పద్ధతి ప్రకారం ప్రకటిస్తారనే వార్తలు వెలువడ్డాయి.

అయితే ఢిల్లీ ఫార్మూలాకు డికె అంగీకరించకపోవడంతో, సిఎం పదవి ఎవరికి అనేది తేలని పీఠముడి అయింది. బెంగళూరులో ఇప్పుడు కాంగ్రెస్ ప్రముఖ నేతలు ఎవరూ లేరు. తదుపరి పరిణామాల వార్తను తెలుసుకునేందుకు వీరు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే వచ్చే 72 గంటల్లో అంతా కొలిక్కి వస్తుందని రణదీప్ సూర్జేవాలా తెలిపారు. కర్నాటకలో కాంగ్రెస్‌కు బలమైన మెజార్టీ వచ్చింది. ఐదేళ్లు సుస్థిర ప్రభుత్వాన్ని ఇస్తుంది. ఈ దశలో తీసుకుంటున్న పలు జాగ్రత్తల నడుమ ఇప్పుడు జరుగుతున్నది ఆలస్యం కాదని కేవలం ఆలోచన అని చెప్పిన సూర్జేవాలా ప్రజలు ఎటువంటి వదంతులను నమ్మవద్దని పిలుపు నిచ్చారు. బూటకపు వార్తల సృష్టికర్త ఓటమి పాలయిన బిజెపినే అని తెలిపారు.

సందడిగా ఖర్గే రాజాజీ మార్గ్ నివాసం
కేబినెట్ కూర్పు గురించి, ముందుగా సిఎం ఎవరనేది తేల్చుకోవడానికి స్థానికంగా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే నివాసం 10 రాజాజీ మార్గ్ వద్ద సందడి రెండు రోజులుగా సాగుతోంది. పార్టీ అధ్యక్షుడికి సిఎం ఎవరనే విషయం తేల్చే బాధ్యతను ఎమ్మెల్యేలు అప్పగించారని ఈ క్రమంలో అంతా సజావుగా సాగుతోందని సూర్జేవాలా తెలిపారు. సంప్రదింపులు తమ పార్టీ లక్షణం అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు త్వరలోనే కీలక నిర్ణయం ప్రకటిస్తారు. ఇందుకు 48 గంటలు లేదా 72 గంటలు పెట్టవచ్చు. విషయాన్ని తాను స్వయంగా మీడియాకు తెలియచేస్తానని, లేని పోని ప్రచారాలకు న్యూస్ ఛానల్స్ దిగకుండా ఉంటే బాగుంటుందని తెలిపారు సిఎం ఎవరేది గురువారం తెలిసితీరుతుంది. ముందుగా మీడియాకు తెలియచేయడం జరుగుతుంది.

గురువారం ఖచ్చితంగానే కాంగ్రెస్ సిఎం ఎవరనేది తెలిసిపోతుంది. సిఎల్‌పి నేత ఎంపికి తరువాతి ప్రక్రియ ఉంటుంది. ప్రమాణ స్వీకారం తరువాత జరిగే తొలి కేబినెట్‌లో ప్రజలకు ఇచ్చిన అయిదు గ్యారంటీల అమలుపై సంతకాలు పెట్టడం జరుగుతుందని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే ఆమోదసమ్మతితో కూడిన ఐక్యత కోరుకునే వ్యక్తి. ఈ మేరకే ఇప్పుడు అంతా జరుగుతోందన్నారు. అంతకు ముందు ఖర్గే నివాసంలో శివకుమార్, సిద్ధరామయ్యలు వేర్వేరుగా కలిసి చర్చించారు. బుధవారం ఉదయం వీరిరువురు రాహుల్‌ను వేర్వేరుగా కలిసి విస్తృతస్థాయిలో మాట్లాడారు. కర్నాటక అసెంబ్లీలోని మొత్తం 224 స్థానాలలో 134 స్థానాలను దక్కించుకుని, ఓ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మద్దతు కూడా పొందిన కాంగ్రెస్ ఫలితాలు వెలువడ్డ 13వ తేదీ నుంచి ఇప్పుడు నాలుగు రోజులైనా అధికార స్థాపనపై మంతనాలే సాగుతున్నాయనే ప్రచారానికి దారితీసింది.

సోనియా మాటతో డికె సమ్మతి?
సిమ్లా విడిది నుంచి బుధవారం ఢిల్లీకి చేరుకున్న కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని డికె బుధవారం వెళ్లి కలిశారు. కొద్ది సేపు అక్కడనే ఉన్నారు. కర్నాటకలో విజయం, ఇప్పటి పరిస్థితిని ఆమెకు ఆయన తెలియచేయడం, ముందు ఇచ్చిన బాధ్యతలు తీసుకుంటే ఆ తరువాత అంతా మంచిదని ఆమె హామీ ఇవ్వడం జరిగిందని, దీనితో పరిస్థితిలో మార్పు వచ్చిందని వెల్లడైంది.

సిద్ధ బెంగళూరు నివాసం, ఊర్లో సంబరాలు
కర్నాటక సిఎం ఎవరనేది పూర్తిగా తేలకముందే కర్నాటకలో సిద్ధరామయ్య వర్గీయులలో ఆనందం వెల్లివిరిసింది. బెంగళూరులోని ఆయన నివాసం, మైసూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం సిద్ధరామనహుండిలో బుధవారం పండుగ వాతావరణం నెలకొంది. ఆయన చిత్రపటానికి పాలాభిషేకాలు , జైకొడుతూ నినాదాలకు దిగారు. బాణాసంచాలు , డాన్స్‌లు, స్వీట్ల పంపిణీలు జరిగాయి. మరో వై పు బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ఇంకా ఖరారు కాని తదుపరి సిఎం, కేబినెట్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జోరందుకున్నాయి.

శివకుమార్ నివాసం వద్ద భారీ భద్రత
సిఎం పదవీ ఖరారు కాని దశలో కర్నాటకలో పిసిసి అధ్యక్షులు డికె శివకుమార్ జిల్లా రామనగరలోని ఆయన నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఆయనకు కేవలం ఉపముఖ్యమంత్రి పదవి దక్కిందని తెలియడంతో ఆయన అభిమానులు నిరసనలకు దిగడం, ఇది కొన్ని చోట్ల ఉద్రిక్తతకు దారితీసిందని తెలియడంతో బందోబస్తు పెంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News