మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడిపి చీఫ్ చంద్రబాబును కస్టడీ కోరుతూ ఎపి సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును శుక్రవారానికి ఎసిబి కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 22న ఉదయం 10.30 గంటలకు తీర్పును వెల్లడించనున్నట్టుగా ఎసిబి కోర్టు న్యాయమూర్తి గురువారం సాయంత్రం ప్రకటించారు. చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడటంతో అందరిలోను ఉత్కంఠ కనిపిస్తోంది. ఇది రిజర్వ్ తీర్పు కాబట్టి రేపు రావొచ్చు లేదా సోమవారం నాటికి రావొచ్చునని న్యాయనిపుణులు చెబుతున్నారు.
ఈ కేసులో ఇరువర్గాల న్యాయవాదుల వాదనలను ఎసిబి కోర్టు కోర్టు విన్నది. తీర్పును గురువారం వెల్లడించనున్నట్టుగా ఎసిబి కోర్టు ప్రకటించింది. గురువారం ఉదయం 10.30 గంటలకు ఈ తీర్పును వెల్లడించనున్నట్టుగా భావించారు. అయితే గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సిఐడి కస్టడీ పిటిషన్‌పై తీర్పును వెల్లడించే అవకాశం ఉందని సమాచారం వచ్చింది. దీంతో గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఎసిబి కోర్టుకు చంద్రబాబు తరపు న్యాయవాదులు, సీఐడీ తరపు న్యాయవాదులు వచ్చారు. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో బెంచ్ పైకి వచ్చిన న్యాయమూర్తి ఏపీ హైకోర్టులో చంద్రబాబు రిమాండ్ రివ్యూ పిటిషన్ తీర్పు గురించి ఆరా తీశారు. ఈ విషయమై ఇరువర్గాల న్యాయవాదులు చంద్రబాబు రిమాండ్ రివ్యూ పిటిషన్ పై వివరాలను ఎసిబి కోర్టు న్యాయమూర్తికి వివరించారు. ఈ తరుణంలో ఈ కేసుతో సంబంధం లేని వారంతా కోర్టు హాల్ నుండి బయటకు వెళ్లాలని జడ్జి సూచించారు.
ఈ నెల 22న చంద్రబాబు కస్టడీపై సిఐడి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వెల్లడించనున్నట్టుగా ఎసిబి కోర్టు ప్రకటించింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో తీర్పు వెలువడే అవకాశం ఉందని న్యాయవాదులు భావిస్తున్నారు. ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఈ నెల 9వ తేదీన టిడిపి చీఫ్ చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి కోరుతూ సిఐడి ఎసిబి కోర్టును కోరింది. ఈ విషయమై సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలను ఎసిబి కోర్టు విన్నది. శుక్రవారం తీర్పును వెల్లడించనున్నట్టుగా ఎసిబి కోర్టు ప్రకటించింది.
ఎపి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేసిన చంద్రబాబుని కస్టడీ కోరుతూ ఈ నెల 11న సిఐడి మెమో దాఖలు చేసింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్‌లో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ తో పాటు రిమాండ్‌ను కూడ రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు ఈ నెల 18వ తేదీ వరకు చంద్రబాబును కస్టడీకి తీసుకోవద్దని ఆదేశించింది. దీంతో ఈ పిటిషన్‌పై ఎసిబి కోర్టు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ నెల 19వ తేదీన చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఎసిబి కోర్టు విచారణ నిర్వహించింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును నిబంధనలకు విరుద్దంగా అరెస్ట్ చేశారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు.
ఈ కేసు వివరాలను మీడియాకు వివరించడంపై కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు.చంద్రబాబును కస్టడీ తీసుకోవడం కూడ అవసరం లేదని ఆయన తరపు న్యాయవాదులు వాదనలు విన్పించారు.నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని చంద్రబాబు న్యాయవాదులు ఎసిబి కోర్టు దృష్టికి తీసుకు వచ్చిన విషయం విదితమే. ఇదిలా ఉంటే చంద్రబాబును విచారించి మరిన్ని విషయాలు రాబట్టవచ్చని సిఐడి తరపు న్యాయవాదులు వాదించారు. ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమాలకు పాల్పడినట్టుగా సిఐడి ఆధారాలు సేకరించిందని న్యాయవాదులు కోర్టులో వాదించారు. అయితే ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకుగాను చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సిఐడి తరపు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. స్కిల్ స్కాంలో ఇద్దరు సాక్షులను విచారిస్తే చంద్రబాబు పాత్ర బయటపడిందని సిఐడి తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు నిన్న ముగిశాయి. గురువారం తీర్పును ఎసిబి కోర్టు వెల్లడిస్తానని ప్రకటించింది. కానీ , తీర్పును శుక్రవారం వెల్లడించ నున్నట్టుగా ఎసిడి కోర్టు గురువారం సాయంత్రం వెల్లడించింది.