Monday, December 23, 2024

కర్నాటక సిఎం అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్

- Advertisement -
- Advertisement -

కర్నాటక సిఎంఅభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్
ఖర్గేతో డికె శివకుమార్, సిద్ధరామయ్య విడివిడిగా భేటీ
ఎఐసిసి చీఫ్‌ను కలిసిన రాహుల్ గాంధీ
మరోసారి సోనియా, రాహుల్‌తో ఖర్గే సమావేశం
నేడు తుది నిర్ణయం, బెంగళూరులోనే సిఎం పేరు ప్రకటించే అవకాశం!

న్యూఢిల్లీ: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించినప్పటికీ పిఎం పదవిపై సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠం కోసం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కెపిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ మధ్యతీవ్ర పోటీ నెలకొనడంతో ఎవరికి పట్టం కట్టాలనే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. శనివారం ఫలితాలు వెల్లడైనప్పటినుంచి సంప్రదింపులు కొనసాగుతున్నప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. తమ ప్రయత్నాలను ముమ్మరం చేయడంలో భాగంగా ఇద్దరు నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. సిద్ధరామయ్య సోమవారమే ఢిల్లీ చేరుకోగా, మంగళవారం ఉదయం బెంగళూరఉనుంచి నగరానికి చేరుకున్న డికె శివకుమార్ సాయంత్రం ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమ్యారు. అనంతరం సిద్ధరామయ్య కూడా ఖర్గేతో భేటీ కావడం కీలక ప్రాధాన్యతను సంతరించుకుంది.

సాయంత్రం 5 గంటల తర్వాత ఖర్గే నివాసానికి వెళ్లిన శివకుమార్ అరగంటకు పైగా ఆయనతో చర్చలు జరిపారు. సమావేశం అనంతరం శివకుమార్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. డికె వెళ్లిన కొద్ది సేపటికి 6 గంటల సమయంలో సిద్ధరామయ్య కూడా ఖర్గేను కలిశారు. ఇరువురు నేతలు ఖర్గేతో భేటీ అయినప్పటికీ ముఖ్యమంత్రి విషయంలో అధిష్ఠానం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇరువురు నేతలతో సమావేశం తర్వాత ఖర్గే సోనియా, రాహుల్ గాంధీధీలతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. బహుశా బుధవారం ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై నిర్ణయం వెలువడే అవకాశముందని సమాచారం. అయితే సిఎం పేరును బెంగళూరులోనే ప్రకటించే అవకాశం ఉంది.

ఖర్గే నివాసానికి రాహుల్
కాగా సిఎం ఎంపిక విషయమై మంగళవారం మధ్యాహ్నం ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక భేటీ జరిగింది. ఈ భేటీలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో పాటుగా కర్నాటకనుంచి కొందరు నూతన ఎంఎల్‌ఎ నేతలు కూడా పాల్గొన్నారు. సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తే బాగుంటుందని రాహుల్, వేణుగోపాల్‌లు అభిప్రాయపడినట్లు ఎఐసిసి వర్గాలు తెలిపాయి. అయితే డికె శివకుమార్‌ను గౌరవప్రదంగా ఎలా సర్దుబాటు చేయాలనే దానిపైనే ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. మరో వైపు హైకమాండ్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని శివకుమార్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

పార్టీ అమ్మతో సమానం: డికె
ఖర్గేతో భేటీకి బయలుదేరే ముందు శివకుమార్ తన సోదరుడు, ఎంపి డికె సురేష్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు తాను రాజీనామా చేస్తానంటూ మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన మండిపడ్డారు. అలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే చానళ్లపై పరువునష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తనకు తల్లిలాంటిదన్నారు. పార్టీని తాము పునర్నిర్మించామన్నారు. 135 మంది ఎంఎల్‌ఎలు తన వాళ్లేనన్నారు. సిఎం ఎవరు కావాలనే దానిపై హైకమాండ్‌దే తుది నిర్ణయమన్నారు. అలాగే మంగళవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరే ముందు బెంగళూరులో మాట్లాడుతూ తాను ఎవరినీ వెన్నుపోటు పొడవనని, బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేయనని చెప్పిన విషయం తెలిసిందే.

బరిలోకి పరమేశ్వర?
మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం గనుక ప్రభుత్వ బాధ్యతలు తనకు అప్పగించినట్లయితే చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని, పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉపముఖ్యమంత్రి జి పరమేశ్వర అన్నారు. పార్టీకి తాను చేసిన సేవలు హైకమాండ్‌కు తెలుసునని, సిఎం పదవికోసం తాను లాబీయింగ్ చేయాల్సిన అవసరం లేదని మంగళవారం బెంగళూరులో విలేఖరులతో మాట్లాడుతూ పరమేశ్వర అన్నారు. ‘హైకమాండ్ గనుక నిర్ణయం తీసుకొని, ప్రభుత్వానికి నేతృత్వం వహించమని అడిగితే ఆ బాధ్యతను స్వీకరించడానికి నేను సిద్ధం’ అని ఆయన అన్నారు. ‘పార్టీ హైకమాండ్‌పై నాకు విశ్వాసం ఉంది. నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. నేను కూడా 50 మంది ఎంఎల్‌లను తీసుకెళ్లి నినాదాలు చేయవచ్చు.

అయితే నాకు పార్టీ క్రమశిక్షణ ముఖ్యం. మాలాంటి వాళ్లు వాటిని పాటించకపోతే పార్టీలో ఎలాంటి క్రమశిక్షణ ఉండదు. హైకమాండ్ గనుక నాకు బాధ్యత అప్పగిస్తే స్వీకరిస్తానని నేను చెప్పా. స్వీకరించనని నేను చెప్పలేదు నేను పార్టీ కోసం చేసిన సేవలేంటో హైకమాండ్‌కు తెలుసు. ఎనిమిదేళ్లు కెపిసిసి చీఫ్‌గా ఉండి 2013లో పార్టీని అధికారంలోకి తెచ్చా. అంతేకాదు, ఉపముఖ్యమంత్రిగా కూడా పని చేశా. వాళ్లకు అన్నీ తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నేను మౌనంగా ఉన్నానంటే దాని అర్థం నేను అసమర్థుడ్ని అని కాదు. నేను సమర్థుడ్నే’ అని శికుమార్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News