Thursday, January 23, 2025

భూముల వేలం నిలిపివేత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఎ)లో భూములు, ప్లాట్ల వేలంలో అవినీతి జరిగినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం ప్రభు త్వం నుంచి అనుమతి వచ్చే వరకు భూముల వేలం నిర్వహించకూడదని హెచ్‌ఎండిఏ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన భూముల వేలానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని హెచ్‌ఎండిఏ అధికారులు నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేశారు. అయితే గతంలో జరిగిన హెచ్‌ఎండిఏ భూముల, ప్లాట్ల వేలంలోనూ అధికారులు తమ అవినీతి దందాకు తెరలేపినట్టు గా ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం హెచ్‌ఎండిఏలో రెండేళ్లుగా ఈ వేలానికి సంబంధించి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ అధికారి, మరో ఉన్నతాధికారితో కలిసి భారీగా అవినీతికి పాల్పడినట్టు గా తెలిసింది. హెచ్‌ఎండిఏ భూముల వేలానికి ముందే పలు రియల్ సంస్థలతో వారిద్దరూ కుమ్మకై ఈ అవినీతి దందాకు తెరలేపినట్టుగా సమాచారం.

దీంతోపాటు వేలంలో పాల్గొనే సంస్థలకు ముందుగానే అన్నీ విషయాలను లీక్ చేసి కోట్లలో లబ్ధిపొందినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ఆయన పలువురు ఉద్యోగులకు డిప్యూటేషన్‌పై ఈ శాఖలో పనిచేయడానికి చాలా అనుమతులు ఇచ్చారని, వారి నుంచి కూడా లబ్ధిపొందారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందా యి. ఈ అధికారిపై గతంలో తాను పనిచేసిన చోట కూడా అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనపై అప్పట్లో ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టుగా తెలిసింది. ఆయన హెచ్‌ఎండిఏలో చేరిన రెండు సంవత్సరాల కాలంలోనే ఈ శాఖ ఉన్నతాధికారి కలిసి ఆయన కోట్లలో అవినీతి దందాకు తెరతీసినట్టుగా తెలిసింది. భూములు, ప్లాట్లను వేలం వేయడానికి ముందు జరిగే అవగాహన సదస్సు నుంచి ఆయన రియల్ సంస్థలతో సంప్రదింపులు జరిపి ఈ వేలం లో వారికి భూములు, ప్లాట్లను దక్కేలా చూసేవారని, ఇవన్నీ ఆ శాఖ ఉన్నతాధికారికి తెలిసే జరిగేదని ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం ఆ అధికారి హెచ్‌ఎండిఏ నుంచి వేరే చోటుకు బదిలీ చేయించుకొని వెళ్లిపోవాలని ప్రస్తుతం విశ్వప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది.
రైతుల నుంచి పెద్ద ఎత్తున భూముల సేకరణ
ప్రభుత్వ భూములను వేలం వేయడమే ప్రధాన అంశంగా గత ప్రభుత్వం నిర్వహించిన వేలం నిర్వహణలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. మరోవైపు, కొత్తగా లే ఔట్లు వేసేందుకు అధికారులు పలువురు రైతుల నుంచి పెద్ద మొత్తంలో భూములను హెచ్‌ఎండిఏ అధికారులు సేకరించారు. అందులో భాగంగానే ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి పెద్ద మొత్తంలో భూములను సేకరించి, సకల సౌకర్యాలతో లే ఔట్లు వేసింది. ఆ తర్వాత వాటిని వేలం వేసింది. కోకాపేట మొదలుకొని బాటసింగారం, ప్రతాప సింగారం, ఉప్పల్ భగాయత్ వంటి చోట్ల పెద్ద సంఖ్యలో భూములను సేకరించింది. ప్రతాప సింగారంలో గత ఆరు నెలల కింద ఒకే చోట 130 ఎకరాలను సేకరించింది. ఇందులో రైతుల నుంచి సేకరించిన భూములే ఎక్కువగా ఉన్నాయి. 130 ఎకరాల్లో సర్వే చేపట్టేందుకు హెచ్‌ఎండిఏ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ భూములకు సంబంధించి రైతులతో డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ చేసుకుని లే ఔట్లను సిద్ధం చేసింది. దాంతో పాటు బుద్వేల్, ఆదిభట్ల తదితర ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో లేఅవుట్లు వేసి వేలానికి సిద్ధం చేసింది. ఎన్నికలకు ముందే ఈ భూ దందాపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో హెచ్‌ఎండిఏ అధికారులు తమ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తాత్కాలికంగా బ్రేక్ వేయాలని ఆదేశాలు రావడంతో పాటు గతంలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఆక్రమణలు గురైన భూములపై…
హెచ్‌ఎండిఏ భూములు కూడా అనేక ప్రాంతాల్లో ఆక్రమణకు గురయ్యాయి. వీటిని ఏ విధం గా తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న దానిపై హెచ్‌చ్‌ఎండిఏ అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు.ఈ భూములు అక్రమణలు కావడానికి హెచ్‌ఎండిఏలో పనిచేసే కొందరు అధికారులు హస్తం ఉన్నట్టుగా కూడా ప్రభుత్వం గుర్తించింది. దీంతోపాటు ల్యాండ్‌ఫూలింగ్ పేరిట రైతుల నుంచి ఎంత భూమి సేకరించారు? అందులో ఏమైనా వివాదాలు ఉన్నాయా? అన్న విషయాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. పదేళ్లలో హెచ్‌ఎండిఏ నిర్వహించిన భూముల సేకరణ, లే ఔట్ల వివరాలు, వేలం వేసిన భూముల సమాచారంతో నివేదికను రెడీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News