నర్సంపేట: పట్టణంలోని బిజెపి కార్యాలయంపై దాడిచేసిన సంఘటనలో పార్టీకి చెందిన ఐదుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ప్రకటించారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, జిల్లా ఇన్‌ఛార్జి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. బిజెపి పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అన్నారు. నియంతృత్వ పోకడలకు అవకాశం ఉండదన్నారు. గురువారం బిజెపి కార్యాలయంలో చోటు చేసుకున్న సంఘటన సరైంది కాదన్నారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడటం సిగ్గు చేటన్నారు.
మద్యం మత్తులో ఈ దురాఘతానికి పాల్పడినట్లు ఆరోపించారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారి పట్ల రాష్ట్ర నాయకత్వం సీరియస్‌గా ఉన్నట్లు స్పష్టం చేశారు. పార్టీ నియమ నిబంధనలు పాటించకుండా ప్రవర్తిస్తున్న వారికి ఇది వరకే రెండు.. మూడు సార్లు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు రాలేదన్నారు.
డాక్టర్ గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, గడ్డం ఆంజనేయులు, తడుక అశోక్, చెరుపురి నాగరాజు, పాలడుగుల జీవన్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రేసు శ్రీనివాస్, నియోజకవర్గ కన్వీనర్ వడ్డెపల్లి నర్సింహరాములు, పట్టణ అధ్యక్షుడు బాల్నె జగన్, మాజీ సర్పంచ్ చిలువేరు రజనీ భారతి, సీనియర్ నాయకులు వనపర్తి మల్లయ్య, కూనమల్ల పృథ్వీరాజ్, శేఖర్, సతీష్, వీరప్రకాష్, మనీష్ తదితరులు పాల్గొన్నారు.