న్యూయార్క్ : అమెరికాలో మరో భారతీయ విద్యార్థి , 19 సంవత్సరాల శ్రేయాస్ రెడ్డి బెనిగర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ వి ధంగా భారతీయ సంతతి విద్యార్థి అక్కడ ఈ ఏడాది చనిపోవడం ఇది నాలుగోసారి. కాగా ఈ వారంలోనే ఇది మూడో దుర్ఘటన. దీనితో అమెరికాకు చదువులకు వెళ్లిన విద్యార్థులలో, వారి తల్లిదండ్రులలో ఆందోళన వ్యక్తం అయింది. ఒహియో సిసినాటిలోని లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుతున్నాడు. తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటున్నారు.
ఈ విద్యార్థికి అమెరికా పాస్‌పోర్టు ఉంది. ఈ విద్యార్థి మరణం వెనుక ఎటువంటి నేరపూరిత చర్య లేదా ఘర్షణ ప్రత్యేకించి జాత్యాహంకార దాడి ఘటన కానీ లేదని ప్రాధమికంగా తేలిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై స్థానిక పోలీసు అధికార యంత్రాంగం దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలో ఎక్కువగా వివరాలు పొందుపర్చలేమని న్యూయార్క్‌లోని భారతీయ దౌత్యకార్యాలయం తెలిపింది. ఈ విద్యార్థి ఆకస్మిక మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులకు ఈ సమాచారం అందించామని, విద్యార్థి తండ్రి అమెరికాకు బయలుదేరినట్లు తెలిసిందని అధికారులు వివరించారు. కొద్దిరోజుల క్రితమే భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య వర్శిటీ ఎయిర్‌పోర్టు వద్ద అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండగా కనుగొన్నారు. అంతకు ముందు పాతికేళ్ల భారతీయ విద్యార్థి వివేక్ సైనీని జార్జియాలోని లితోనియా సిటీలో డ్రగ్ అడిక్ట్ అయిన నిరాశ్రయుడు తీవ్రంగా కొట్టిచంపాడు. గత నెలలో 18 సంవత్సరాల విద్యార్థి అకుల్ బి ధావన్ కూడా మృతి చెందాడు. ఇప్పుడు శ్రేయాస్ రెడ్డి విషాదాంతం చెందాడు.