Thursday, January 23, 2025

‘వివేక’ హత్యకేసులో సాక్షి అనుమానస్పద మృతి..

- Advertisement -
- Advertisement -

Suspicious death of witness in 'Viveka' murder case
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న కల్లూరి గంగాధర్ రెడ్డి(49) బుధవారం రాత్రి అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రిని ద్రపోయిన సమయంలో గంగాధర్‌రెడ్డి మృతి చెందినట్లు గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే యాడికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు 174 సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనాస్థలంలో క్లూస్‌టీమ్‌తో విచారణ చేపట్టారు. ఈక్రమంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సిబిఐ అధికారులపై ఫిర్యాదు:
వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉంటూ గంగాధర్‌రెడ్డిపై పలు నేరాలకు సంబంధించి కేసులున్నాయి. ఈక్రమంలో 2021 అక్టోబర్ 2న వివేకా హత్య కేసును తనపై వేసుకుంటే శివశంకర్‌రెడ్డ్డి రూ.10కోట్లు ఇస్తానని చెప్పినట్లు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో గంగాధర్‌రెడ్డి పేర్కొన్నారు. మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించిన ఆయన ఆ తర్వాత సిబిఐ అధికారులపైనే అనంతపురం ఎస్‌పికి ఫిర్యాదు చేశారు.
మృతిపై అనుమానాలు ః
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న కల్లూరి గంగాధర్ రెడ్డి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిబిఐ అధికారులపై గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేసినప్పటి నుంచి అతని కదలికలపై నిరంతరం నిఘా పెట్టారు. యాడికిలోని ఇంటి సమీపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా పోస్టుమార్టం అనంతరం గంగాధర్ రెడ్డి మృతికి గల కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు వివరిస్తున్నారు.
నిందితుడి పిటిషన్ కొట్టివేత
వైఎస్ వివేకా హత్యకేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వేసిన పిటిషన్‌ను కడప కోర్టు కొట్టివేసింది. కడప సెంట్రల్ జైల్లో తనకు ప్రత్యేక వసతులు కల్పించడానికి అనుమతివ్వాలని శివశంకర్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సిబిఐ అభ్యంతరం తెలపడంతో న్యాయమూర్తి పిటిషన్‌ను డిస్మిస్ చేశారు.

Suspicious death of witness in ‘Viveka’ murder case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News