Friday, January 10, 2025

వృక్ష ఆధారిత వనరులతో రైతులకి సుస్థిర ఆదాయం

- Advertisement -
- Advertisement -

డీఆర్డీవో మాజీ ఛైర్మన్ సతీశ్ రెడ్డి పిలుపు
మహిమలూరులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా
గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటిన ప్రముఖులు
వృక్ష ఆధారిత వనరుల విస్తరణపై రైతులకి అవగాహన

మన తెలంగాణ/హైదరాబాద్ : రైతులు కలప వృక్షాలను నాటి పెంచడం ద్వారా అదనపు ఆదాయ వనరులు సృష్టించుకోవడంతో పాటు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడి జీవావరణ పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషించవచ్చని డీఆర్డీవో మాజీ ఛైర్మన్ డాక్టర్ గుండ్రా సతీశ్ రెడ్డి సూచించారు. ప్రతి రైతు సొంత ఆదాయంతో పాటు సామాజిక బాధ్యతగా పొలం గట్లు, ఖాళీ స్థలాల్లో కలప మొక్కలు నాటాలని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నూతన ఉత్సవ మూర్తుల చరిపత్రిష్ఠాపన మహోత్సవంలో సతీశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో గ్రామస్తులతో కలిసి శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం, శ్రీ పోలేరమ్మ దేవాలయ ప్రాంగణం సహా పాఠశాల, గ్రామంలోని వీధుల్లో మారేడు, రావి, ఉసిరి, వేప, జమ్మి, జామ మొక్కలను నాటారు. ’గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ అధినేత, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణ కోసం ’గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ద్వారా గొప్ప కార్యక్రమాలను చేస్తున్నారని సతీష్ రెడ్డి ప్రశంసించారు. ’గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ సహ వ్యవస్థాపకులు మర్ది కరుణాకర్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని కలప మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా సతీశ్ రెడ్డి మాట్లాడుతూ రైతులకి అదనపు ఆదాయం తెచ్చి పెట్టే మార్గాలను వివరించారు. వృక్ష ఆధారిత వనరులు ఆర్థికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో కీలక భాగస్వామిగా మారాయని ఇందులో ఉన్న అవకాశాలను రైతులు అందిపుచ్చుకోవాలని సూచించారు. పేపర్, గృహోపకరణాల తయారీతో పాటు అడవుల అభివృద్ధి, పర్యావరణ పర్యాటకం వంటి ఆదాయ మార్గాలు ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతున్నాయని చెప్పారు. వీటిపై రైతులు కూడా దృష్టి సారించి వనరులను వృద్ధి చేసుకోవాలని అన్నారు. సంప్రదాయ పంటలతో పాటు దీర్ఘకాలంలో అధిక ఆదాయం అందించే కలపను కూడా అందించే స్థాయికి రైతులు ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా ’ఇగ్నైటింగ్ మైండ్స్ – గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ’ రైతులకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు.

పర్యావరణ రక్షణ, ఆదాయ వనరుల సృష్టి, నైపుణ్యాభివృద్ధి కోసం పనిచేస్తోన్న ఇగ్నైటింగ్ మైండ్స్ తో కలిసి తాను 8 ఏళ్లుగా పనిచేస్తున్నానని.. ఈ సంస్థతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవడం గర్వంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ‘మానవాళికి లభించిన అమూల్యమైన వనరులు చెట్లని, ప్రజలతో పాటు ఈ ధరణికి వృక్షజాతులు ఎంతో మేలు చేస్తాయని సతీష్ రెడ్డి తెలిపారు. చెట్ల నుంచి లభించే కలప మానవ నివాసాల నిర్మాణం, గృహోపకరణాల తయారీకి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పచ్చని చెట్లు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడి, జీవం ఉనికి కొనసాగేందుకూ తోడ్పడతాయని ఆయననతెలిపారు. రైతుల ఆధ్వర్యంలో వృక్ష ఆధారిత వనరులు విస్తరించడం వల్ల వనరుల నిర్వహణలో సుస్థిరత సాధించడానికి వీలవుతుందని. ముఖ్యంగా కలప వృక్షాల పెంపకం వల్ల పచ్చదనం పెరుగుతుందన్నారు. చెట్లు కోతకు వచ్చే వరకూ పర్యావరణంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని. కలప తీసుకున్న తర్వాత కూడా కొన్ని చెట్లు తిరిగి జీవం పోసుకుని ఆకాశాన్ని తాకేలా పెరుగుతాయన్నారు. ఎక్కువ సంఖ్యలో రైతులు వ్యవసాయంతో పాటు భారీ వృక్షాలు పెంచడం ద్వారా పెరుగుతున్న అవసరాల మేరకు కలపను ఉత్పత్తి చేయడంతో పాటు మానవ వినియోగం వల్ల అడవుల శాతాన్ని తగ్గిపోకుండా కాపాడుకోవచ్చన్నారు. ఇదే సమయంలో వృక్ష ఆధారిత వనరుల వృద్ధిలో భాగస్వాములయ్యే రైతులు దీర్ఘకాలంలో భారీ మొత్తంలో ఆదాయాలు అందుకునే అకాశాలు పుష్కలంగా ఉన్నాయని సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. కలపకు డిమాండ్ పెరుగుతన్న దృష్ట్యా భవిష్యత్తులో అవి రైతులకి మంచి లాభాలు ఆర్జించిపెడతాయని, తద్వారా గ్రామాల్లో ఆర్థికాభివృద్ధికి బాటలు పడతాయన్నారు. కలప లభ్యత, వినియోగం పెరిగి ఇందుకు సంబంధించిన రంగంలో ఉపాధి అకవాశాలు ఎంతగానో మెరుగవుతాయని సతీశ్ రెడ్డి రైతులకి వివరించారు. వృక్ష ఆధారిత వనరుల అభివృద్ధి దిశగా రైతులు వేసే ప్రతి అడుగు.. పర్యావరణానికి మేలు చేస్తుందని సతీశ్ రెడ్డి అన్నారు.

పొలం గట్లు, వ్యవసాయ క్షేత్రాల్లో భారీ వృక్షాలు పెంచడం ద్వారా పరిసర ప్రాంతాల్లో పచ్చదనం పెరిగి వాతావరణంలో సానుకూల మార్పులు వస్తాయని.. ముఖ్యంగా దట్టంగా పెరిగే భారీ చెట్లు వాతావరణంలోని విష వాయువులను గ్రహించి సమృద్ధిగా ప్రాణవాయువుని విడుదల చేస్తాయని ఆయన వివరించారు. భూతాపానికి కారణమవుతోన్న హరిత గృహ వాయువులను అరికడతాయన్నారు. పంట పొలాలతో కలిసి భారీ వృక్షాలు భూమికి పరిచే ఆకు పచ్చని అందాలు వృక్ష – జంతుజాలానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తాయని, కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్న జీవరాశులు పునరుత్పత్తి ద్వారా తమ సంఖ్యను గణనీయంగా పెంచుకునేందుకు ఈ పరిస్థితులు వీలు కల్పిస్తాయని చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా, పర్యావరణ పరంగా అమూల్యమైన మేలు చేసే వృక్ష ఆధారిత వనరుల వృద్ధిపై రైతులకి విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ సమృద్ధి సాధించి తద్వారా మానవాళి సుస్థిర భవిష్యత్తుకు పునాదులు వేసేందుకు రైతులతో పాటు ప్రతి ఒక్కరూ చెట్లను పెంచే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సతీష్ రెడ్డి పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News