ఆస్ట్రేలియన్ ఆర్థిక సలహాదారునికీ జైలు శిక్ష
బ్యాంకాక్: మరో క్రిమినల్ కేసులో మాజీ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకి మూడేళ్ల జైలు శిక్షను సైనిక పాలనలోని మయన్మార్ కోర్టు గురువారం విధించింది. సూకీ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన ఆస్ట్రేలియన్ ఆర్థికవేత్త సీన్ టర్నెల్‌కు కూడా అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘన కింద మూడేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. సూకీ క్యాబినెట్‌కు చెందిన ముగ్గురు సభ్యులను కూడా దోషులుగా నిర్ధారిస్తూ వారికి కూడా మూడేళ్ల చొప్పున కోర్టు జైలు శిక్ష విధించింది. ఇమిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించింనందుకు టర్నెల్‌కు మరో మూడేళ్ల జైలు శిక్షను విధించిన కోర్టు రెండు శిక్షలు సమాంతరంగా అమలు అవుతాయని తెలిపిందది. ఇప్పటికే జైలులో 20 నెలలు నిర్బంధంలో ఉన్నందున టర్నెల్ శిక్షా కాలంలో దాన్ని మినహాయిస్తారు. ఆయన శిక్షాకాలం ఏడాదిన్నర లోపలే ఉంటుందని అక్కడి అధికారి ఒకరు తెలిపారు. 58 సంవత్సరాల టర్నెల్ సిడ్నీలోని మెక్వారీ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. సూకీ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన ఆయనను 2021 ఫిబ్రవరి 1న ప్రభుత్వాన్ని సైన్యం హస్తగతం చేసుకున్న దరిమిలా టర్నెల్ అరెస్టయ్యారు.