Monday, December 23, 2024

తిరిగి సొంత గూటికి సువేందు అధికారి?

- Advertisement -
- Advertisement -

 Suvendu Adhikari will joins TMC?

టిఎంసి నేత కునాల్ ఘోష్ కీలక వ్యాఖ్యలు

కోల్‌కతా: గత ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వార్తల్లో నిలిచిన వ్యక్తి సువేందు అధికారి. అప్పటికే అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌లో అగ్రనేతగా, రాష్ట్రమంత్రిగా కొనసాగిన సువేందు అధికారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి తీర్థం పుచ్చుకోవడమే కాదు.. ఏకంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైనే పోటీకి దిగడం తెలిసిందే. సువేందు రాకతో కాషాయ పార్టీకి బలం పెరిగి టిఎంసికి గట్టిపోటీ ఇచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో మమత పార్టీయే మరో సారి అధికారంలోకి రావడంతో సువేందు అధికారి ప్రతిపక్ష నేతగా మాత్రమే మిగిలిపోయారు. కాగా.. ఇప్పుడాయన తిరిగి సొంతగూటికి చేరాలని ప్రయత్నిస్తున్నారని టిఎంసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికునాల్ ఘోష్ వెల్లడించారు. ‘ బిజెపిలో సువేందు అధికారి ఇమడలేకపోతున్నారని మాకు తెలిసింది. కాంటేయ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాపై ఆయన అసంతృప్తిగా ఉన్నారట. ఆ జాబితాలో సువేందు అధికారి తన సోదరుడు సౌమేందు అధికారి పేరును సూచించినా బిజెపి పట్టించుకోలేదు. ఇదివరకు సౌమేందు అధికారి కాంటేయ్ మున్సిపల్ చైర్మన్‌గా పని చేశారు.

దీంతో అతడి పేరును ప్రకటించాలని డిమాండ్ చేసినా బిజెపి పెడచెవిన పెట్టింది. ఆ పార్టీ తీరుతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. గతంలో కాంటేయ్, కాంతి ప్రాంతాలు సువేందు కుటుంబానికి కంచుకోటలా ఉండేవి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అందుకే ఆయన మళ్లీ మా పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం వచ్చింది’ అని ఘోష్ అన్నారు. సంప్రదింపులపై పూర్తి వివరాలు చెప్పలేనని, ఈ విషయంలో పార్టీ అధినేత్రే నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అయితే సువేందు గతంలో తమ పార్టీ అధినేత్రిపై నిందాపూర్వక వ్యాఖ్యలు చేశారని, అందువల్ల ఆయనను పార్టీలోకి తీసుకునే అవకాశాలు లేవని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై సువేందు అధికారి స్పందిస్తూ, అవినీతి కేసుల్లో నిందితులుగా ఉండే వ్యక్తుల వ్యాఖ్యలకు తాను సమాధానం చెప్పనని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News