విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన తులసి తంతి గుండెపోటుతో మృతి
న్యూఢిల్లీ : సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తులసి తంతి(64) శనివారం పుణెలో గుండెపోటుతో మరణించారు. సుజ్లాన్ గ్రూప్, సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రధాన ప్రమోటర్లలో తులసి తంతి ఒకరు, ఆయన్ని ‘విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని కూడా పిలుస్తారు. ఆయన భారతదేశ గ్రీన్ ఎనర్జీ వ్యూహానికి మార్గనిర్దేశం చేసేందుకు సిఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) పునరుత్పాదక ఇంధన మండలి చైర్మన్‌గా కూడా ఉన్నారు. రాజ్‌కోట్‌కు చెందిన వ్యాపారవేత్త తంతికి ఇద్దరు సంతానం నిధి తంతి, ప్రణవ్ తంతి ఉన్నారు. తంతి మృతితో సుజ్లాన్ గ్రూప్, సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సుజ్లాన్ భారతదేశంలో పవన విద్యుత్ వ్యాపారంలో అగ్రగామిగా ఉంది.
కంపెనీ 19.4 గిగావాట్ల వ్యవస్థాపించిన పవన శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది భారతదేశంలో 33 శాతంమార్కెట్ వాటాతో 17 దేశాలలో ఉనికిలో ఉంది. సుజ్లాన్ ఎనర్జీని 1995లో తంతి స్థాపించారు. సుజ్లాన్ ఎనర్జీ మార్కెట్ క్యాప్ రూ. 8,535 కోట్లుగా ఉంది. కంపెనీ ప్రస్తుతం 100కు పైగా పవన క్షేత్రాలను కలిగి ఉంది. సుజ్లాన్ ఎనర్జీ రూ.1,200 కోట్ల రైట్స్ ఇష్యూను ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సుజ్లాన్ ఎనర్జీ తన వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి, మిగిలిన నిధులను కార్పొరేట్ అవసరాలకు ఫండ్‌ను ఉపయోగించనుంది. అలాగే సంస్థ రుణం, వడ్డీ భారం తగ్గించుకోవాలని కంపెనీ యోచిస్తోంది.