పైలెట్ ప్రాజెక్టుపై ప్రధాని మోడీ
భోపాల్ / న్యూఢిల్లీ : దేశంలో అమలవుతోన్న స్వమిత్వ యోజనతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని హార్దాలో జరిగిన సంబంధిత పథకపు సర్వే నుద్ధేశించి ప్రధాని వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో నిర్థిష్ట రీతిలో ఆస్తుల యాజమాన్య హక్కుల కల్పనకు ఈ పథకంతో దారులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయిందన్నారు. దేశంలోని గ్రామాల ప్రగతి దిశలో ఇది నూతన అధ్యాయానికి దారితీస్తుందని వివరించారు. ఇప్పటికైతే ఈ స్వమిత్వను కొన్ని రాష్ట్రాలలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. అమలులో పది నెలలు పూర్తి అయిన దశలో ఈ పథకం తీరుతెన్నులపై హాల్దాలో సర్వే జరిగింది. ఈ పథకం దేశవ్యాప్తంగా అమలు అవుతుందని, గ్రామీణాభివృద్ధి దిశలో మరింతగా ప్రోత్సాహం అందుతుందని ప్రధాని ఈ నేపథ్యంలో తెలిపారు. గ్రామ స్వరాజ్యం చిరకాలపు వాంఛ ఈ కలను నిజం చేసే దిశలో ఈ పథకం ఓ తార్కాణం అయిందన్నారు. ఈ పథకం గురించి ఈ జిల్లాకు చెందిన కొందరు లబ్ధిదారులతో ప్రధాని ముచ్చటించారు.
గ్రామీణ ప్రాంతాల భూములకు సంబంధించి ఇప్పటికీ పలు చిక్కులు ఏర్పడుతున్నాయి. సంబంధిత హక్కులను ఖరారు చేయడం క్లిష్టమవుతోంది. ఈ దిశలో డ్రోన్ల సాంకేతికతను వాడుకుంటున్నారు. దీనితో నిజమైన హక్కుదార్లకు సకాలంలో చట్టబద్ధమైన యాజమాన్య హక్కులను అందించడం జరుగుతోందన్నారు. గ్రామాలలో ప్రజల ఆర్థిక పరిపుష్టి అంతా కూడా భూముల వినియోగంపై ఆధారపడి ఉంటుంది. అయితే సరైన పత్రాలు లేకపోవడంతో పలు చోట్ల వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని, దీనితో గ్రామీణ ఆర్థిక వనరులకు గండిపడుతోందని ప్రధాని తెలిపారు. ఈ లోటును తీర్చేందుకు ఈ పథకం తీసుకువచ్చినట్లు ప్రధాని వివరించారు. గ్రామస్థులు వేరే పక్షాల నుంచి రుణాలు పొంది ఆర్థిక చిక్కులలో పడకుండా చేసేందుకు ఈ పథకం పనికివస్తుందన్నారు. కేవలం సంబంధిత వ్యక్తుల భూ పత్రాలతో ప్రభుత్వం నుంచి రుణాలు పొందడం ద్వారా వ్యాపార కార్యకలాపాలు సాగించుకునేందుకు ఆర్థిక బలోపేతానికి వీలేర్పడుతోందన్నారు. ప్రైవేటు వ్యక్తుల రుణాల బారిన పడకుండా ప్రజలను ఆదుకునేందుకు ఇటువంటి పథకాలు అవసరం అని ప్రధాని తెలిపారు.