Thursday, January 23, 2025

స్వాంటె పాబోకు నోబెల్ పురస్కారం

- Advertisement -
- Advertisement -

Svante Paabo

స్టాక్‌హోం:  వైద్యశాస్త్రం లో విశేష కృషి చేసినందుకు గాను ఈ ఏడాది స్వాంటె పాబోకు నోబెల్ పురస్కారం లభించింది. మానవ పరిణామ క్రమం, అంతరించి పోయిన హొమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను ఆయనకీపురస్కారం లభించింది. వైద్య శాస్త్రంతో ప్రారంభమైన ఈ అవార్డుల ప్రకటన వారం రోజులపాటు కొనసాగుతుంది.

అంతరించిపోయిన నియాండెర్తల్ జన్యువును పాబో సీక్వెన్స్‌ చేయడంతోపాటు గతంలో ఎవరికీ తెలియని హోమినిన్ డెనిసోవాకు సంబంధించి సంచలనాత్మక ఆవిష్కరణ చేశారు. దాదాపు 70 వేల సంవత్సరాలకు పూర్వం ఆఫ్రికా నుంచి వలస వచ్చిన తర్వాత ప్రస్తుతం అంతరించిపోయిన ఈ హోమినిన్‌ల నుంచి హోమో సేపియన్లకు జన్యు బదిలీ జరిగిందని పాబో కనుగొన్నారు. ఫలితంగా నేటి మానవుల్లోనూ ఈ పురాతన జన్యువుల ప్రవాహం కొనసాగుతోంది. ఇది మన రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అంటువ్యాధులకు ప్రతిస్పందిస్తుంది. పాబో సెమినల్ పరిశోధన  పూర్తిగా నూతన శాస్త్రీయ డిసిప్లిన్‌ పాలియోజెనోమిక్స్‌కు దారితీసినట్టు నోబెల్ కమిటీ ప్రకటించింది. స్వాంటె పాబో ప్రస్తుతం జర్మనీలోని ‘మ్యాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంత్రోపాలజీ’ డైరెక్టర్‌గా ఉన్నారు.

1901-2021 మధ్య వైద్యశాస్త్రంలో 112 నోబెల్ బహుమతులు అందించారు. వీరిలో 12 మంది మహిళలు ఉన్నారు. నోబెల్ బహుమతి గ్రహీతలకు గోల్డ్ మెడల్, 10 మిలియన్ల స్వీడిష్ క్రోనోర్ (దాదాపు 1.14 మిలియన్ డాలర్లు) అందజేస్తారు. 1896లో మరణించిన స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్ ఆల్ఫ్రెడ్ నోబెల్(Alfred Nobel) పేరు మీదుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలు అందిస్తున్న వారికి నోబెట్ బహుమతిని ప్రదానం చేస్తున్నారు. కాగా, రేపు (మంగళవారం) భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి, శనివారం ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News