ప్రతి తెలంగాణ బిడ్డ గుండెలో భారతీయత నిండేలా స్వాతం త్య్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం జరుపుకుంటున్నం- నేటి నుంచి ఈ నెల 22 వరకు- ‘దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా’ అన్న గురజాడ అడుగులో ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికతలో! ఈ ఆగస్ట్ 15న సమున్నతమైన మన జెండాకు మనందరమూ హృదయ పూర్వకంగా వందనం చేసుకుంటం. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి రగిలేలా కోటి జెండాలు రెపరెపలాడుతయి తెలంగాణ ఇంటింటా. నిలువెత్తు సాధికారతకు, సార్వభౌమతకు, స్వయంపాలనకు, ఆత్మగౌరవానికి రూపమైన జెండా నీడలో భద్రంగా ఉన్నమనిమురిసిపోతం. అది మన హక్కు. ఆ భరోసాను ముందు తరాలకు అందించే బాధ్యత కూడా!!
స్వేచ్ఛా వాయువుల కోసం పోరాటం చేసిన దేశాలు, జాతులు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఉన్నయి. కానీ భౌగోళిక వైశాల్యంలోనూ, సుదీర్ఘ నిబద్ధ పోరాటంలోనూ, భిన్న జాతులను ఉద్యమంలోకి ఉరికించడం అనే ప్రమాణాలతోనూ కొలిస్తే ప్రపంచంలోనే అతి పెద్ద, అతి గొప్ప సంకల్ప సిద్ధితో స్వాతంత్య్రం సాధించుకున్నజాతి మనం. తెలంగాణకూ ఈ పోలిక వర్తిస్తుంది. దేశంలోనే ఎక్కడా లేని సుదీర్ఘ పోరాటంతో, సకల జనులను ఉద్యమంలోకి ఉరికించి స్వపరిపాలన సాధించుకున్నది తెలంగాణ. కాబట్టే స్వాతం త్య్రం ఇచ్చిన స్వేచ్ఛ, రాజ్యాంగం దఖలుపరచిన హక్కులు తెలంగాణకు అంత మనసుకు పట్టినవి. వాటి కొనసాగింపు మనకు గర్వకారణం అవుతున్నది కూడా అందుకే!
వలసవాద ఈస్టిండియా కంపెనీరాక మునుపుమనది ధనిక దేశం! ప్రఖ్యాత బ్రిటిష్ ఆర్ధిక నిపుణుడు ఆంగస్ మాడిసన్ ప్రకారం క్రీ.శ 1000వ సంవత్సరంలో చైనా, భారత్‌ల జిడిపి ప్రపంచ జిడిపిలో 50.5 శాతం. ఈస్టిండియా కంపెనీ మనను కబళించక ముందు క్రీ.శ. 1600 సంవత్సరపు ప్రథమార్థంలో చైనా, భారత్‌ల జిడిపి 51.4 శాతం. అందులో మన వాటా 22.4 శాతం ఉండగా, చైనాది 29 శాతం! అంటే వలసవాదుల పాలనకు ముందు సిరిసంపదలతో తులతూగిన మన భారతదేశం ఆ తర్వాత రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక దోపిడీకి గురయినం అన్నది గమనంలో ఉంచుకోవాలి.
మద్రాసు నుంచి విడివడి కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ యేర్పడడానికి ముందు హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉన్న మన తెలంగాణ సుసంపన్నమైనది. విద్య, వైద్యం, వాణిజ్యం, వర్తకం, వ్యవసాయం, సహజీవన సంస్కృతి ఇట్లాయే సూచీలలో చూసినా హైదరాబాద్ స్టేట్ వెలుగు అబ్బురం! అంటే, వలసవాదుల పాలనకు ముందు సిరిసంపదలతో తులతూగిన మన తెలంగాణ ఆ తర్వాత రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక దోపిడీకి గురయినం అన్నది గమనంలో ఉంచుకోవాలి.
మరొక పోలిక కూడా ఉన్నది ఏడున్నర దశాబ్దాల కింద సొంతగా నడకనేర్చిన మన దేశం ఆ తర్వాతి కాలంలో ఎన్నో రంగాల్లో ప్రపంచానికి ఆశాదీపం. మన పురాణేతిహాసాలు, మన ఆధ్యాత్మిక చింతన, మన తత్వసారం, మన భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతి, మన సహజ వనరులు, మన మానవ వనరులు, మన మార్కెట్ -అన్నీ అభివృద్ధి చెందిన దేశాలకు నిరంతర ఆకర్షణ! మనది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైనిక పాటవం, జిడిపి లెక్కల్లో మనది ప్రపంచంలో అయిదో పెద్ద ఎకానమీ. కొనుగోలు శక్తి లెక్కల్లో ప్రపంచంలోనే మనకు మూడో స్థానం.
ఏడున్నర వత్సరాల కింద సొంతగా నడక నేర్చిన మన రాష్ట్రం ఎన్నో రంగాల్లో భారతదేశానికి ఆశాదీపం. మన గంగా జమునా తహజీబ్, ప్రపంచ స్థాయి సాంకేతికత, అపార జలసిరులు, హరిత, నీలి విప్లవాలు, ఉన్నత స్థాయి విద్య, వైద్య ప్రమాణాలు, పటిష్ట శాంతి-భద్రతలు, ప్రతి దినమూ అందే కేంద్ర సంస్థల, అంతర్జాతీయ సంస్థల కితాబులూ, అభివృద్ధి- సంక్షేమాల పరుగులు, నిలువెత్తు ఆత్మగౌరవ బావుటా- అన్నీ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆకర్షణ! ఎన్నో అభివృద్ధి సూచీలలో తెలంగాణ దేశంలో మొదటి ఒకటి రెండు స్థానాల్లోనే విరాజిల్లుతున్నది. తలసరి ఆదాయంలో మనం ఘనసరి! దేశ నిర్మాణంలో మన పాత్ర ప్రముఖం.
ఇదంతా ఎందుకంటే, నా దేశ యువజనులారా! ఈ వజ్రోత్సవ పండుగ వేళ, ఆనందాలతేలే వేళ, అభినందనలు తెలుపుకుంటూనే, ఆత్మావలోకనమూ చేసుకోవాలి మనం. స్వాతంత్య్రానంతరం సాధించిన ప్రగతి, ప్రాణ సమానంగా నిలుపుకున్న విలువలు, మనం చిన్ననాడు స్కూళ్ళల్లో ప్రతిజ్ఞ రూపంలో ‘సుసంపన్నమైన, బహు విధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం’ అని గుండె నిండు గా చెప్పుకున్న సంకల్పం మనను విశిష్ట భారతీయులుగా నిలిపే ఘనమైన అంశాలు.
అయితే… ఒక దశాబ్ది కిందటి వరకు వివిధ ప్రభుత్వాల, పార్టీల భాగస్వామ్యంతో ఘనంగానే ఉన్నం. సాధించాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నా, ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నా ప్రపంచం దృష్టిలో మన కీర్తి గొప్పగానే ఉండింది. 2014లో బిజెపి రూపంలో దేశ ప్రతిష్ఠ మసకబారడం, జనజీవనం అస్తవ్యస్తం కావడం మొదలయింది. స్వాతంత్య్ర పోరాటంలో పాత్ర లేనివారు, ఆ త్యాగాలకు విలువ తెలియనివారు నేడు మతం పేరుతో విచ్ఛిన్నకాండకు తెరలేపిన్రు.
మన స్వాతంత్య్ర ప్రదాత, కర్మయోగి మహాత్మా గాంధీ బొమ్మ కరెన్సీ నోటుపై తప్ప, ఆయన స్ఫూర్తి ఎక్కడా కానరాకుండా యుద్ధప్రాతిపదికన పని చేస్తున్నది కేంద్ర సర్కారు. గాంధీని భౌతికంగా నిర్మూలించిన గాడ్సే వారసులకు ఈ దేశం నుంచే మహాత్ముడిని చెరిపి వేయాలని మహా ఆకలిగా ఉన్నది. తన అహింసా, సత్యాగ్రహాలతో తుపాకులకే దడపుట్టించిన సబర్మతీ సంత్ పుట్టినగడ్డ నుంచే హింసాకాండ ప్రారంభమైంది. అది బుల్‌డోజర్‌గా ఉగ్రరూపం ధరించి ప్రజాస్వామిక విలువలను, సమభావననూ చదును చేసుకుంటూ పోతున్నది. విదేశీ పాలకులు ఉప్పుపై పన్ను వేస్తే తిరగబడిన ‘దండి’ చైతన్యం లేశమాత్రమూ లేని గుజరాతీ మందబలం వికృత జిఎస్‌టి రూపంలో విరుచుకుపడి భారతీయులను పన్నుల పేరుతో ‘దండి’స్తున్నది.
తమ అనుంగు కార్పొరేట్లకు లక్షల కోట్లలో దొబ్బ బెడుతూ, సంపదను సముద్రాలు దాటిస్తూ; ప్రజల సంక్షేమం విషయంలో మాత్రం ‘ఉచితాలు’ వద్దు అంటూ బోడి సలహాలుఇస్తున్నది మోడీ ప్రభుత్వం. ఆర్‌బిఐ ద్వారా, కోర్టుల ద్వారా అనుచిత సలహాలూ ఇప్పిస్తున్నది. ప్రజల డబ్బు అంబానీ, ఆదానీలు మింగుతున్నరు కానీ, అంబానీ, ఆదానీల స్వార్జితమేమైనా ప్రజలకు ఉచితంగా పంచిపెడుతున్నరా? కాకులను కొట్టి గద్దలకు వేసే ఈ రివర్స్ రాబిన్ హుడ్ హీరోయిజం మనం సహించాల్నా?! పైన చెప్పుకున్నట్టు 1600 సంవత్సరానికి ముందు ప్రపంచంలో ధనిక దేశం అయిన మనల్ని 1947వ సంవత్సరంలో కేవలం 3 శాతం జిడిపి స్థాయికి పడదోసింది బ్రిటష్ ప్రభుత్వం! అచ్చు ఇపుడు నరేంద్ర మోడీ ఇన్నేళ్ళ అభివృద్ధిని గంగలో కలిపి అన్ని సూచీల్లో దేశాన్ని కిందనుంచి మొదటిలో ఉంచినట్టన్న మాట! నేడు అదానీ ప్రపంచ కుబేరుడు కావడం, దేశం కునారిల్లిపోవడం ఎట్లాంటిదంటే -భారత దేశం దివాలా తీయగా బ్రిటన్ మన సొమ్ములతో జల్సా చేసినట్టు. దేశాన్ని మొత్తం ముంచేసిన మోడీ పాలనలో రాయరంగపూర్ నుంచి రైసినా హిల్స్‌కు ఒకఆదివాసీ మహిళ ప్రస్థానం చూసి సంబరపడేదియెట్లా సాధ్యం?! ఈ టోకెనిస్ట్ రాజకీయాలు ఎవరికి మేలు?!
సతతమూ ‘మేక్ ఇన్ ఇండియా’ జపించే బిజెపి ప్రభుత్వం జాతీయ జెండాలను కూడా చైనాలో తయారు చేయిస్తున్నది. సమున్నత భారత సార్వభౌమాధికారానికి ప్రతీక అయిన జెండా బిజెపి దిమ్మలపై, కాషాయ జెండా కంటే దిగువన వేలాడుతూ కనిపిస్తున్నది. ఇది పొరపాటో, గ్రహపాటో కాదు. వారు ప్రతీకాత్మకంగా చెపుతున్నరు- దేశమైనా సరే, తమ పార్టీ ముందు తలవంచి నిలబడవలసిందే అని! ధైర్యమూ, బలమూ ఇచ్చే సారనాథ్ అశోక చక్రంలోని సింహాలు నేడు రౌద్రంగా, భయానకంగా పార్లమెంట్ పైన ప్రతిష్టితమయినయి. భయం కలిగించడం ఒక్కటే బిజెపి మేనిఫెస్టో. ఇందుకు పార్టీలు, నాయకులు, హిందూ ప్రజలు… ఎవరూ అతీతులు కాదు! ఎవరూ మినహాయింపు కాదు! తమని కాదన్నవారి తలలు నరికివేస్తామని ఆ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు బాహాటంగా ప్రకటిస్తూ ఉండడం నిత్యకృత్యమైంది. అభివృద్ధిలో శరవేగంతో దూసుకుపోతున్న చైనా గురించి కెసిఆర్ మాట్లాడితే దేశద్రోహి అవుతరా? జెండాలు కూడా చైనాలో తయారు చేయించే బిజెపివారు దేశభక్తులు అవుతరా? జాతీయ జెండాతో చెమట తుడుచుకునే మోడీ ఈ దేశం గర్వించే బిడ్డ కాగలడా?
తెలంగాణ ఉద్యమాన్ని నెత్తుటిచుక్క రాలకుండా నడిపిన కెసిఆర్ కూ; సిఎం పదవి నిలుపుకోవడానికి, అనంతరం ప్రధాని కావడానికి నెత్తురునే నమ్ముకున్న మోడీకి పోలిక లేదు. కెసిఆర్‌కూ, గాంధీకీ పోలిక ఉన్నది. సత్యాగ్రహ మార్గంలో స్వయంపాలన కోసం నిలబడడం కెసిఆర్‌కు గాంధీ అందించిన ఒరవడి. కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ ఉండడం వల్లే రూపాయి పతనం అవుతున్నది అని వెకిలి వ్యాఖ్యలు చేసే బిజెపికి ప్రతినిధి మోడీ. గాడ్సే జయంతి రోజున ఎవరు ఏమనుకుంటరోనన్న కనీస భయం లేకుండా పూలమాల వేసే దుర్మార్గం మోడీది.
ఈ డ్రామాబాజీ ప్రధాని ఎప్పుడూ పగటి వేషాలు వేస్తూ ఉంటరు. గాంధీ శత జయంతి రోజున చరఖా తిప్పుతరు. జుగుప్స కలిగించే ఆ దృశ్యం గురించి ప్రముఖ పాత్రికేయులు కల్లూరి భాస్కరం ఇట్లా అన్నరు :
… మోడీ గాంధీ కాదు, అంతే! చరఖా తిప్పుతున్న చిత్రంలోని మోడీని చూస్తే జాలి కలుగుతుంది. నిజ జీవితంలో అనుకరణ ఎప్పుడూ ఎవరి స్థాయినీ పెంచదు సరికదా, తగ్గిస్తుంది. భాగవతంలో పౌండ్రక వాసుదేవుడి కథ ఒక ఉదాహరణ. కృష్ణుడిలా వేషం కట్టి తనూ కృష్ణుడినేనని ప్రచారం చేసుకునే పౌండ్రకుని ఉదంతం హాస్యాన్ని పండిస్తుంది తప్ప అతనిపై గౌరవం కలిగించదు. ఈ నకిలీ వాసుదేవుడు చివరికి కృష్ణుడి చేతిలోనే మరణిస్తాడు. లేని స్వాతంత్య్ర పోరాట వారసత్వాన్ని ఉన్నట్టు నేయబోయే ఈ అభినయం నుంచి, ఈ నకిలీ గాంధీత్వం నుంచి తనకూ, దేశానికీ కూడా పనికిరాని దేవతావస్త్రాలను తప్ప మోడీజీ నేసింది, చేసింది ఏమీ లేదు!
యెంత మారణహోమం సరిపోతుంది
ఫిరంగి గుళ్ళను నిషేధించడానికి
ఎంతకాలం నిరీక్షించాలి
స్వేచ్ఛావాయువులు పీల్చడానికి
ఎన్ని సార్లని తల తిప్పుకోవాలి
చుట్టూ అన్యాయాలను గమనించకుండడానికి
జనఘోష వినడానికి
ఎన్ని చెవులు కలిగుండాలి?
అని వేదన చెందుతరు ‘Blowing In The Wind’ లోనోబెల్ గ్రహీత, సాంస్కృతిక విప్లవకారుడు బాబ్డైలాన్!
మోడీ… వింటున్నరా?
ఉత్తరప్రదేశ్ రైతులు బాయికాడ మీటర్లను పీకిపారేస్తే వినబడిందా?
మీ సొంత సోదరుడు జంతర్ మంతర్‌లో నిరసనకు దిగితే వినబడిందా?
అగ్నివీరులు నిప్పురవ్వలై తిరగబడితే వినబడిందా?
ఆరేండ్ల పిల్ల -మోడీ అంకుల్, పెన్సిల్ ధర పెంచితే యెట్ల అని నిలదీస్తే వినబడిందా?
డిపిమారిస్తే, జిడిపి మారిందా?
కరోనా సమయంలో పళ్ళాలు మోగించినట్టు, దీపాలు వెలిగించినట్టు తూతూ మంత్రాల ద్వారా భారతీయుల జీవితాల్లో సంతోషం సాధ్యమా?
ఇది మారాలి. ఖచ్చితంగా మారి తీరాలి. దేశభక్తుల పేరుతో సాగే గాడ్సేయిజం మనమంతా అడ్డుకుని తీరాల్సిందే. అందుకు మన స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంకావలసినంత మందుగుండు నింపగలదు మనలో!
చివరగా మన సి. నారాయణరెడ్డి మాటలతో ముగిస్తా:
‘ప్రజలకు శాంతీ సౌఖ్యం కలిగించే దేశమె దేశం
బానిస భావం విడనాడి యే జాతి నిలుచునో అది జాతి
బాపూ… నీ చల్లని దీవెన మాకివ్వు
నీ బాటను నడిపే బలమివ్వు’
ఆ బాటన నడిచే జన గణ మంగళ దాయకులకు జయహే పలకాల్సిందే. ‘కష్ట సహిష్ణుత్వం’ అంటరు పతంజలి మహర్షి. లక్ష్య సాధనలో ఎన్ని కష్టాలు ఎదురైనా లెక్క చేయని, మొక్కవోని దీక్షాదక్ష నాయకునికీ, ప్రజలకూ…
జయహే జయహే జయహే
జయ జయ జయ జయహే
జై హింద్!
శ్రీశైల్ రెడ్డి పంజుగుల
9030997371