Wednesday, January 22, 2025

కమలానికి షాక్.. టిఆర్ఎస్ బిగ్ క్యాచ్

- Advertisement -
- Advertisement -

బిజెపి నుంచి టిఆర్‌ఎస్‌లోకి స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్

కమలనాథులను కలవరపెడుతున్న సిఎం కెసిఆర్ వ్యూహాలు ఢిల్లీ నుంచి తిరిగిరాగానే
మునుగోడుపై దృష్టి కేంద్రీకరించిన గులాబీ అధినేత ఆయన చొరవతో టిఆర్‌ఎస్‌లోకి
క్యూ కడుతున్న బిజెపి నేతలు ఈ జాబితాలో ఇద్దరు సిట్టింగ్ ఎంఎల్‌ఎలు, మరో ఇద్దరు మాజీ ఎంపిలు గతంలో పనిచేసి విడిపోయిన ఉద్యమ నేతలను అక్కున చేర్చుకోవాలని నిర్ణయం
కొందరు కాంగ్రెస్ నేతలను కారు ఎక్కించేందుకు ముమ్మరంగా సాగుతున్న ప్రయత్నాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : మునుగోడు ఉప పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్ది భారతీయ జనతా పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన అగ్రనేతలంతా కమలం పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ‘కారు’ గూటికి చేరుకుంటున్నారు. ఆ జాబితా అంతకంతకు పెరుగుతోంది. ఈ పరిణామాలు కాషాయ పార్టీ ని తీవ్రస్థాయిలో కలవరానికి గురి చేస్తుండగా, అధికార టిఆర్‌ఎస్ పార్టీలో మరింత జోష్‌ను నింపుతోంది. ఢిల్లీ పర్యటన తరువాత టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా మునుగోడుపై ఫోకస్ పెట్టారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో శరవేగంగా అనూహ్య పరిణామాలు జ రుగుతున్నాయి. మునుగోడు ఉపఎన్నికకు ముందు బిజెపికి షాకిచ్చేలా సిఎం కెసిఆర్ పావులు కదుపుతున్నారు. దీంతో అధికార టిఆర్‌ఎస్‌లోకి చేరికలు మరింత జోరందుకున్నాయి.

గురువారం ఆలేరు మాజీ శాసనసభ్యుడు బూడిద బిక్షమయ్య గౌడ్ బిజెపికి గుడ్‌బై చెప్పి కారెక్కగా.. తాజాగా శుక్రవారం శాసనమండలి మాజీ చైర్మన్, బిజెపి అగ్రనాయకుడిగా కొనసాగుతున్న స్వామిగౌడ్‌తో పాటు యువనేత దాసోజు శ్రవణ్ గులాబీ గూటికి చేరుకున్నారు. వీరితో పాటు బిజెపికి చెంది న ఇద్దరు సిట్టింగ్ శాసనసభ్యులు, మరో ఇద్దరు మాజీ ఎంపిలను సైతం టిఆర్‌ఎస్‌లోకి తీసుకొ చ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. వీరితోనూ కెసిఆర్ ఇప్పటికే ప్రాథమికంగా చర్చలు జరిపినట్లుగా టిఆర్‌ఎస్ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తోంది. దీపావ ళి పండుగ అనంతరం వారి చేరికలు ఉండే అవకాశముందని తెలుస్తోంది. ముళ్లును ముళ్లుతోనే తీయలన్న సూత్రాన్ని కెసిఆర్ బాగా పాటిస్తున్నారు. టిఆర్‌ఎస్ నుంచి మా జీ ఎంపి బూర నర్సయ్యగౌడ్‌ను బిజెపిలో చేర్చుకోవడంతో అదే సామాజిక వర్గం చెందిన నేతలతో పాటు ఇతర నేతలను కూడా భారీ స్థాయి గులాబీ గూటికి విధం గా కెసిఆర్ రచించిన వ్యూహాలు పక్కాగా అమలు జరిగాయి.

దీంతో గులాబీ పార్టీ నుంచి ఒక్కనేత కాషాయ పార్టీ గుం జుకుంటే.. పార్టీ ఏకంగా ఐదారు అగ్రనేతలనే కారెక్కిచ్చింది. పనిలో పనిగా మునుగోడు ఉపఎన్నికలో బిజెపికి కీలక నేతలుగా వ్యవహరిస్తున్న వారందరికి గులాబీ పార్టీ వల విసిరిందన్న ప్రచారం కూడా సాగుతోంది. వారిలో కూడా చాలా మంది నేతలు టిఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు బిజెపిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బిజెపి నేతలనే కాకుండా గతంలో ఉద్యమంలో పని చేసి టిఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరించిన పార్టీని వీడి వెళ్లిన నేతలను తిరిగి సొంత గూటికి రప్పించే ప్రయత్నాల్లో సిఎం కెసిఆర్ ఉన్నారని తెలుస్తోంది. ఇందుకో సం ఆపరేషన్ ఆకర్ష్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసే అంశంపై దృష్టి సారించారు. వలస నేతలతో బలం పుంజుకున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్న కమలనాధులకు.. వలసలతోనే చెక్ పెట్టాలనే యోచనలో కెసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే గతంలో తనతో పని చేసిన ఉద్యమ నేతలకు కెసిఆరే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి.. తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని వీడిన ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యుడు ఏనుగు రవీందర్ రెడ్డితోనూ కెసిఆర్ మాట్లాడారని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. అయితే వారు కెసిఆర్ ఫోన్‌లో అందుబాటులోకి రాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో వారి కోసం ప్రత్యేకంగా దూతలను పంపిస్తున్నారని తెలుస్తోంది. వారు తిరిగి పార్టీలోకి వస్తే…. సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా కెసిఆర్ స్వయంగా తమకు ఫోన్ చేసి మాట్లాడటంతో చాలా మంది నేతలు తిరిగి కారెక్కేందుకు సిద్దమవుతున్నారన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మరికొందరు నేతలను కూడా కారెక్కించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వారి కూడా త్వరలోనే హస్తం పార్టీకి హ్యాండిచ్చేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది. మొత్తం మీద మునుగోడులో రాజకీయ క్షణం…క్షణం అనేక మలుపు తిరుగుతుడండంతో రాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. ఉపఎన్నిక ముగిసే నాటికి రాజకీయాల్లో మరిన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడం ఖాయమన్న ప్రచారం కూడా సాగుతోంది. ప్రస్తుతం టిఆర్‌ఎస్ జోరు చూస్తుంటే…. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా మునుగోడు ఉపఎన్నిక ద్వారా బిజెపి, కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ను ఇవ్వబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

బిజెపి తీరు జుగుప్సాకరం

తెలంగాణ బిజెపి రాష్ట్ర శాఖలో దిశా లేని రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తామని చెప్పిన బిజెపి చీఫ్ బండి సంజయ్ మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అనుసరిస్తున్న రాజకీయ తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. సామాజిక బాధ్యత లేకుండా ఎన్నికలు అనగానే డబ్బు సంచులు గుప్పించాలన్నట్లుగా బడా కాంట్రాక్టర్లే రాజ్యాలు ఏలాలనే తీరుతో సంజయ్ వ్యవహరిస్తున్నారు.

                                                                                             – దాసోజు శ్రవణ్ కుమార్

అన్నీ అవమానాలే

బిజెపిలో అడుగడుగునా అవమానాలే ఎదుర్కొన్నా. ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో బండి సంజయ్ అనుసరిస్తున్న తీరు నా మనస్సును గాయపరిచింది. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశా. పార్టీలో బలహీనవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు లేదు. బడుగు, బలహీన వర్గాల ప్రతినిధిగా ఎదిగిన బండి సంజయ్ ఆ వర్గాలను నిర్లక్షం చేస్తూ ఇతరులు చెప్పినట్లు నడుచుకుంటున్నారు.

                                                                                   – స్వామిగౌడ్, మండలి మాజీ చైర్మన్

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News