హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్ది భారతీయ జనతా పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. నిన్న బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ కూడా బీజేపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కు రాజీనామా లేఖలను పంపించారు. దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. నిన్న బూడిద భిక్షమయ్య గౌడ్ కేటీఆర్ సమక్షంలో కారెక్కిన విషయం విదితమే.
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న తీరు అత్యంత జుగుస్సాకరంగా ఉందని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. నోట్లు పంచి మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న బీజేపీ తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానట్లు శ్రవణ్ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో బీజేపీ విఫలమైందని స్వామిగౌడ్ స్పష్టం చేశారు. బీజేపీలో ధనవంతులు, కాంట్రాక్టర్లకే ప్రాతినిధ్యం అధికంగా ఉందని పేర్కొన్నారు. బలహీన వర్గాల ఉన్నతికి బీజేపీ సహకరించడం లేదన్నారు.