స్వామినాథన్ కృషి వల్లే ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి: ముఖ్యమంత్రి కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని సిఎం కెసిఆర్ అన్నారు. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ వినూత్న పద్ధతులు చేర్చారని, స్వామినాథన్ కృషి వల్లే ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందన్నారు. రైతుల గుండెల్లో స్వామినాథన్ చిరస్థాయిగా నిలిచిపోతారని కెసిఆర్ పేర్కొన్నారు. భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వ్యవసాయాధారిత భారత దేశంలో మెజారిటీ ప్రజల జీవనాధారం, దేశ ప్రజల సాంస్కృతిక జీవన విధానం వ్యవసాయ రంగంతో ముడివడి ఉందన్న దార్శనికతతో, సంప్రదాయ పద్ధతిలో సాగుతున్న దేశీయ వ్యవసాయాన్ని స్వామినాథన్ వినూత్న పద్ధతుల్లో గుణాత్మక దశకు చేర్చారని సిఎం పేర్కొన్నారు.
ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధనకు స్వామినాథన్ కృషి
ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందంటే అది ఎం.ఎస్ స్వామినాథన్ కృషితోనే సాధ్యమైందని సిఎం అన్నారు. దేశ ప్రజల ప్రధాన ఆహార వనరులైన వరి, గోధుమ తదితర పంటలపై స్వామినాథన్ చేసిన అద్భుతమైన ప్రయోగాలతో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించిందని సిఎం తెలిపారు. వ్యవసాయ రంగంలో వారు చేసిన పరిశోధనలు, సిఫారసులు దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయన్నారు. దేశ జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార భద్రత దిశగా దార్శనికతతో జీవిత కాలం కృషి చేసిన మొట్టమొదటి వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ అని సిఎం పేర్కొన్నారు.
ప్రతి భారత రైతు హృదయాల్లో స్వామినాథన్
భిన్నమైన భౌగోళిక, భూసార పరిస్థితులు కలిగి, దేశంలోని రాష్ట్రాల వారీగా ప్రజలు పండిస్తున్న పంటలపై వాటిని అభివృద్ధిపై విస్తృత పరిశోధనలు చేసిన స్వామినాథన్ ప్రతి భారత రైతు హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతారని సిఎం అన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను ఎం.ఎస్ స్వామినాథన్ పలుమార్లు కొనియాడిన విషయాలను, తనతో వారికున్న అనుబంధాన్ని సిఎం ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎం.ఎస్ స్వామినాథన్ రాష్ట్రానికి రావడం, వారితో తాను రాష్ట్ర సచివాలయంలో సమావేశం కావడం మరిచిపోలేనని సిఎం అన్నారు. ఆ సందర్భంగా వారితో జరిగిన విస్తృత స్థాయిలో జరిగిన చర్చలో వారు చేసిన పలు సూచనలు అమూల్యమైనవని సిఎం తెలిపారు. ఉచిత విద్యుత్, ఎత్తిపోతలతో సాగునీటి రంగాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణను ఆయన ఎంతగానో ప్రశంసించారని సిఎం గుర్తు చేసుకున్నారు.
స్వామినాథన్ ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిజం చేసింది
రైతు సంక్షేమం కోసం, సమ్మిళిత వ్యవసాయ రంగ సుస్థిరాభివృద్ధి కోసం ఎం.ఎస్ స్వామినాథన్ చేసిన సిఫారసులు, వారి దార్శనికత, ఒక రైతు బిడ్డగా తనను ఎంతగానో ప్రభావితం చేశాయని కెసిఆర్ తెలిపారు. ఒక నాడు ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో, కరువు తాండవమాడిన తెలంగాణ నేలలో నేడు పసిడి పంటలు పండుతుండడం వెనుక, వ్యవసాయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణలో, పంటల ఉత్పత్తిలో తెలంగాణ నేడు దేశానికి ఆదర్శంగా నిలవడం వెనక ఎంఎస్ స్ఫూర్తి ఇమిడి ఉందని సిఎం తెలిపారు.తెలంగాణ నేలలు అత్యంత సారమంత వైనవని, పాలకులు సరైన దృష్టి సారిస్తే తెలంగాణ దేశానికే విత్తన భాంఢాగారంగా విరాజిల్లుతుందని చెప్పిన స్వామినాథన్ ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిజం చేసి చూపించిందన్నారు.
స్వామినాథన్ మృతి బాధను కలిగిస్తోంది
తెలంగాణలో జరుగుతున్న రైతు సంక్షేమాన్ని వ్యవసాయరంగాభివృద్ధి గురించి తెలుసుకున్న స్వామినాథన్ తెలంగాణను సందర్శించడానికి ఆసక్తి కనబరిచేవారని సిఎం అన్నారు. ఇదే విషయాన్ని తెలుపుతూ ఇటీవలే వారితో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల సమావేశంలో తెలంగాణ వ్యవసాయాభివృద్ధిని తెలుసుకొని ఎంతో ఆనందం వ్యక్తం చేశారని, తాను వీలు చూసుకుని తెలంగాణ పర్యటనకు వస్తానని మాట ఇచ్చిన స్వామినాథన్ వారి ఆకాంక్ష తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధను కలిగిస్తుందని సిఎం విచారం వ్యక్తం చేశారు. వారి మన్ననలు పొందడం రైతుబిడ్డగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనకెంతో గర్వకారణమని సిఎం అన్నారు.