లక్నో: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అఖిలేష్ యాదవ్ సారథ్యం లోని సమాజ్ వాది పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారం రాజీనామా సమర్పించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన వారం రోజుల తరువాత ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం గమనార్హం. ఎమ్‌ఎల్‌సి సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. రామచరిత్ మానస్, అయోధ్య రామాలయ పవిత్ర దినోత్సవంపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు పార్టీ అధిష్టానం ఎలాంటి రక్షణ కల్పించలేదని ఆరోపిస్తూ ఈనెల 13న ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు.
భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి తన మద్దతుదార్లతో గురువారం ఢిల్లీలో ఆయన సమావేశం కానున్నారు. వెనుకబడిన తరగతుల్లో మంచిపేరున్న మౌర్య 2022లో బీజేపీని విడిచిపెట్టి ఎస్పీలో చేరారు. ఐదుసార్లు ఎమ్‌ఎల్‌ఎగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా, అసెంబ్లీలో విపక్ష నేతగా కూడా పదవులు చేశారు. బీఎస్‌పీ నుంచి బీజేపీలో చేరినప్పుడు ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ మంత్రి వర్గంలో 2017 నుంచి 2022 వరకు కార్మిక మంత్రిగా పనిచేశారు.