మాధుర్యం, ఆర్తి నిండిన స్వాతి పంతుల స్వరం, ఆమె పరిచయం చేసే కథలు, కవిత్వం, సంగీతం వినడానికి తెలుగు సాహితీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటుంది. ఉత్తమ సాహిత్యాన్ని పరిచయం చేసేందుకు ఆమె ఎంచుకున్న యూట్యూబ్ మాధ్యమం కొత్త సాహిత్య శ్రోతలను తయారు చేసింది. వేగవంతంగా మారిపోతున్న నేటి ఆధునిక జీవనయానంలో మంచి సాహిత్యాన్ని అందించేందుకు స్వాతి పంతుల చేస్తున్న నిరంతర సాహిత్యకృషిని మెహఫిల్ పాఠకులకు పరిచయం చేస్తున్నది.
స్వాతి పంతులతో విమల సంభాషణ
ఎప్పుడు మీరు మీ చానల్ ప్రారంభించారు?
నన్ను నేను నలుగురికి పరిచయం చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన మెహఫిల్‌కు ముందుగా ధన్యవాదాలు. తెలుగు సాహిత్యంలో వచ్చిన, వస్తున్న కథలను యూట్యూబ్ ఛానల్ ద్వారా వినిపిస్తూ అందరితో పంచుకోవడం అనే ఈ ప్రయాణం మొదలుపెట్టి నాలుగేళ్లు దాటింది. ఈ నాలుగేళ్ల కాలంలో 240 మందికి పైగా రచయితలవి 450కు పైగా రచనలు వినిపించాను. ఇందులో కథలు, కవిత్వం రెండూ ఉన్నాయి. అలాగే 250కి పైగా తెలుగు లలిత గీతాలను కూడా పంచుకున్నాను.
సాహిత్యం పట్ల మీకు ఆసక్తి ఎలా కలిగింది?
బాల్యం అంతా ఆడుకోవడం, క్లాస్ పుస్తకాలు చదవడంతోనే గడిచింది గాని నిజానికి చందమామను కూడా ఏనాడు శ్రద్ధగా చదవలేదు. కాలేజ్ చ దువులకు వచ్చే వరకు మరో పుస్తకం కూడా పెద్ద గా చదివిందీ లేదు. అయితే 1980 90ల్లో అన్ని మధ్య తరగతి కుటుంబాల వారికీ, చదవడానికి తీరుబాటు దొరికే అందరికీ ఒక మంచి కాలక్షేపం పుస్తకం. అమ్మ,నాన్న ఇద్దరికీ పుస్తకాలు చదవడం అలవాటు ఉండేది. ఆ కాలంలో మన తెలుగువారి ఇళ్లల్లో ఆ విధంగా మనకు తెలియకుండానే సాహిత్య వాతావరణం ఉండేది. అమ్మ చదువుకునేందుకు కొని తెచ్చుకున్న రచన మాసపత్రిక మా ఇంటికి అలా వచ్చిందే. ఇంటర్మీడియెట్‌లో ఉండగా మొట్ట మొదటి సారిగా నాకు తెలుగు కథ రుచి చూపించిన పుస్తకం రచన. ఆ ఉత్సాహంలోనే నేను రాసిన రెండు కథలు, ఓ కవిత అందులో అచ్చయ్యాయి. ఎంతోమంది గొప్ప రచయితలను, వారి రచనలను పరిచయం చేసింది. కారా మాష్టారు స్థాపించిన, తెలుగు కథలకు మెట్టినిల్లు అని చెప్పుకోదగ్గ కథానిలయం ఉన్న శ్రీకాకుళంలో నా చదువు పూర్తయ్యింది. కథానిలయం స్థాపించిన కొద్ది కాలానికే శ్రీకాకుళం వదిలి పెట్టినా కారా మాస్టారుని కలవడం, నేను రాసిన కథను మాష్టారు బావుంది అనడం నాకు ఒక గొప్ప జ్ఞాపకం.
యూట్యూబ్ ద్వారా మంచి సాహిత్యాన్ని వినిపించాలనే ఆలోచన ఎలా కలిగింది మీకు?
ఇంటర్, డిగ్రీలో ఉండగా అప్పుడప్పుడు ఎక్కడన్నా పుస్తక ప్రదర్శనలు పెడితే పుస్తకాలు కొనుక్కుని చదువుకోవడం హాబీగా ఉండేది. తర్వాత చదువు, ఉద్యోగం, పెళ్లి ఆ తరువాత తెలుగు రాష్ట్రాలకు దూరంగా వచ్చేయడం, పిల్లలు -చదువులు.. ఈ సమయంలో అంటే సుమారు పాతికేళ్లు తెలుగు సాహిత్యంతో పరిచయం అన్నదే పోయింది. అయి తే కోవిడ్ సమయంలో నా దగ్గర ఉన్న పుస్తకాలలోని కథలను వినిపిస్తూ, సరదాగా బంధువులందరితో పంచుకునేందుకు యూట్యూబ్ ఛానల్ ఆలోచన వచ్చింది. వారిలో చాలామంది తెలుగు రాష్ట్రాలకు దూరంగా ఉంటున్న వారు, తెలుగు చదవడం రానివారు, తెలుగు పుస్తకాలు అం దుబాటులో లేనివారు. అలా మొదటిసారి శ్రీ రమణ గారి మిథునం కథ వినిపించాను. చక్కని భావంతో వినిపించడం నాన్న దగ్గర నుండే వచ్చింది. నాన్న పాట పాడినా, కథ చెప్పినా అందరం మైమరచి వినే వాళ్ళం.
శ్రోతలకు ఫలానా కథలను వినిపిద్దాం అన్న మీ ఎంపిక ఎలా జరుగుతుంది ?
నిజానికి దీనికి సరైన సమాధానాన్ని చెప్పలే ను. చదివిన అన్ని కథలను వినిపించలేము. వినిపించేటందుకు కొన్ని అనువుగా ఉంటాయి. నా దగ్గర ఉన్న పుస్తకాల నుండే మొదలు పెట్టాను కాబ ట్టి ముందు తరం రచయితల కథలే ఎక్కువగా వినిపిస్తూ వచ్చాను. మన మూలాలను మరచిపోకూడ దు కదా! అయితే క్రమంగా ఇప్పటివారు రాస్తున్నవీ వినిపిస్తున్నాను. ఒక్కమాట మాత్రం గుర్తు పెట్టుకుంటాను. రావి శాస్త్రి గారు ‘రచయిత ప్రతివాడు తాను రాస్తున్నది మంచికి హాని, చెడ్డకి సహాయమూ చేయకూడదని నేను భావిస్తాను’అన్నారు. రచయితలే కాదు వారి రచనలకు గళం ఇచ్చినవా రు కూడా ఇది గుర్తు పెట్టుకోవాలి అనుకుంటాను.
ఛానల్ మరో ప్రత్యేకత గురించి చెప్పాలంటే కొన్ని కథా సంపుటాలను ఒక సిరీస్‌గా వినిపించగలగడం నా అదృష్టం. అలా స.వెం.రమేశ్ గారి ప్రళయ కావేరి కథలను, పి.రామకృష్ణ గారి పెన్నేటి కథలను, చాగంటి తులసి గారి కథల నుండి వివా హ వ్యవస్థను ఆధారంగా చేసుకుని రాసిన కొన్ని కథలను, సాహిత్యం- చిత్రలేఖనం శీర్షికతో చిత్రకారులు, రచయితలు రెండూ అయిన వారి రచనల ను పరిచయం చేయడం, గొప్ప సాహిత్య విశ్లేషకు లు, చిత్రకారులు అయినా సంజీవదేవ్ గారి ఆత్మకథ తెగిన జ్ఞాపకాలను సంక్షిప్తంగా పరిచయం చే యడం వంటివి చేసాను. త్వరలో రచయిత్రి, జర్నలిస్ట్ అయిన అరుణ పప్పు గారి కథలను సిరీస్‌గా చేయబోతున్నాను.
మీరు వినిపించిన కథలు, కవిత్వం, లలిత గీతాలను విన్న శ్రోతల స్పందన గురించి చెప్తారా?
రంగస్థలం మీద కళాకారుడికి ప్రేక్షకుల చప్పట్లు ఎంత ప్రోత్సాహం ఇస్తాయో కథలు విన్న శ్రోతల స్పందన కూడా అటువంటిదే. నేను వినిపించే కథలు ఎంత ఎక్కువమందిని చేరితే అంతసంతోషం. నేను వినిపించే తీరు కన్నా, ఆ కథల గురించి ఒక మాట చెబితే మరీ సంతోషం. ఈ ప్రయాణంలో నాకు చాలా తృప్తిని ఇచ్చిన కొన్ని స్పందనలు ఉన్నాయి. పరీక్షల కోసం నేను వినిపించిన కథలు ఉపయోగపడ్డాయి అని కొంతమంది విద్యార్థులు చెప్పినప్పుడు, సన్నిహితులైన వారు కొందరు కేన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో నేను వినిపించిన కథలతో ఉపశమనం పొందామని చెప్పినప్పుడు, అనారోగ్య కారణం చేత ఎన్నో ఏళ్లుగా మంచం పట్టిన ఒకరు నేను వినిపించిన పెన్నేటి కతలను ఇష్టంగా వింటున్నారని తెలిసినపుడు.. ఈ జన్మకి ఇది చాలు అనిపించింది. తమ గళం ద్వారా ఎన్నో పాత్రలకు జీవం పోసిన గొప్ప కళాకారిణి శారదా శ్రీనివాసన్ గారి ఆశీస్సులు దొరకడం నిజంగా నా అదృష్టం. నిజానికి ఛానల్‌కు నా పేరయితే పెట్టుకున్నాను గానీ ఛానల్ మొదలు పెట్టిన కొత్తలో ఇంట్లో ప్రతీ ఒక్కరూ నాకు సాయ పడ్డారు. మావారు, పిల్లలు ఓపిగ్గా ఎడిటింగ్ నేర్పించేరు. కొత్తలో నా ప్రతీ కథకు మా అక్క నాకు ప్రథమ శ్రోత. నా మరొక అభిరుచి చిత్రలేఖనానికి చిన్నప్పుడు అన్న ఇచ్చిన ప్రోత్సాహం. వీరందరితో పాటు రచయితలు, చిత్రకారులు, సంగీత సాహిత్య అభిమానులు, శ్రోతలు.. ఇలా అందరి ప్రోత్సాహం నాకెప్పుడూ ఉంది.
భవిష్యత్తులో మీ ఛానల్ ద్వారా మీరు చేయాలనుకుంటున్న కొత్త ప్రయోగాలు ఏమైనా ఉన్నాయా?
ఎలాంటి ప్రణాళికలూ వేసుకోవడం లేదు. ఈ రోజు ఏం చేయగలను అన్నదే ముఖ్యం. రేపు మనది కాదు. ఈ ప్రయాణంలో గొంతు ఏదో ఒకరోజు ఠక్కున ఆగిపోవచ్చు గానీ సాహిత్య రంగం లో ఎప్పటికీ నిలిచిపోయేది మాత్రం అక్షరం. అలాంటి అక్షరాలతో సాహిత్యానికి జీవం పోసిన, పోస్తున్న రచయితలకు జేజేలు.