న్యూఢిల్లీ : ఆప్ నేతలు తన వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆప్ ఎంపీ స్వాతీ మాలీవాల్ ఆరోపించారు. దీనివల్ల తన కుటుంబానికి ప్రమాదముందన్నారు. తనపై జరిగిన దాడి విషయంలో విచారణ జరుగుతున్న సమయంలో ఆప్ నేతలు తన వ్యక్తిగత వివరాలైన వాహన నెంబర్లు మొదలైన వాటిని లీక్ చేయడాన్ని ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా మాట్లాడుతూ “ నేను అవినీతికి పాల్పడినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, ఢిల్లీ మంత్రులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ సూచనల మేరకే చేశానని పుకార్లు సృష్టిస్తున్నారు.
2016లో నా మీద నమోదైన కేసుకు వ్యతిరేకంగా న్యాయబద్ధంగా పోరాటం చేశాను. అది తప్పుడు కేసని కొట్టేసింది. ఆ సమయంలో ఆప్ నేతలు నన్ను లేడీ సింగం అని పొగిడారు. వారికి నేనిప్పుడు బీజేపీ ఏజెంట్‌గా కనిపిస్తున్నానా? అని ఆప్ వర్గాలను నిలదీశారు. ఢిల్లీ మంత్రులు అధికారమత్తులో ఉన్నారని, నిజం ఎప్పుడైనా బయటపడుతుందన్నారు. వారు చెప్పే ప్రతి అబద్ధానికి కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. నిజం మాట్లాడినందుకు పార్టీ మొత్తం తనపై ట్రోల్ చేస్తోందన్నారు. పార్టీ లోని ప్రతి ఒక్కరినీ పిలిచి తన వ్యక్తిగత వీడియోలు ఉంటే పంపించమని చెబుతూ వాటిని లీక్ చేస్తున్నారని విమర్శించారు.