Monday, December 23, 2024

మరో ఇద్దరు సుప్రీం కోర్టు జడ్జీల ప్రమాణ స్వీకారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్ సోమవారం ఉదయం 10.30 గంటలకు మరో ఇద్దరు కొత్త జడ్జీల చేత ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో సుప్రీం కోర్టులో పూర్తిగా మంజూరైన జడ్జిల సంఖ్య 34కు చేరింది. జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ అరవింద్ కుమార్ కొత్త న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ బిందాల్ అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి,జస్టిస్ కుమార్ గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ పదవి నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు. వీరి పేర్లను కొలీజియమ్ గత జనవరి 31న ప్రతిపాదించింది. ఈ నియామకాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. 1961 ఏప్రిల్ 16 న జన్మించిన జస్టిస్ బిందాల్ 1985లో కురుక్షేత్ర యూనివర్శిటీ నుంచి ఎల్‌ఎల్‌బి పొందారు. 1985 సెప్టెంబర్‌లో పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. అదే కోర్టు జడ్జీగా 2006 మార్చి 22 లో పదోన్నతి పొందారు. తన పదవీ కాలంలో దాదాపు 80,000 కేసులను పరిష్కరించారు. తరువాత జమ్ముకశ్మీర్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ 2018 నవంబర్ 19న ప్రమాణస్వీకారం చేశారు.

జమ్ముకశ్మీర్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాల ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. 2021 జనవరి 5 న కలకత్తా హైకోర్టు జడ్జీగా ప్రమాణస్వీకారం చేశారు. 2021 ఏప్రిల్ 29 నుంచి ఆ కోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ లో 62 వ ఏట పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే సుప్రీం కోర్టు జడ్జీల పదవీ విరమణ వయసు 65 ఏళ్లుగా ఉంది. జస్టిస్ కుమార్ 1962 జులై 14న జన్మించగా 1987 లో అడ్వకేట్‌గా నమోదయ్యారు. 1999 లో కర్ణాటక హైకోర్టులో అదనపు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ గా పనిచేశారు.2002 లో రీజినల్ డైరెక్టు టాక్సెస్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా నియామకమయ్యారు. ఆ తరువాత 2005లో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియామకమయ్యారు. 2009 జూన్ 26న కర్ణాటక హైకోర్టు అడిషనల్ జడ్జిగా పదోన్నతి పొందారు. అదే కోర్టు శాశ్వత జడ్జిగా 2012 డిసెంబర్ 7 న నియామకమయ్యారు. ఈ నెల 6 న జస్టిస్‌లు పంకజ్ మిథల్, సంజయ్ కరోల్, పిపి సంజయ్ కుమార్, అసనుద్దీన్ అమానుల్లా, మనోజ్ మిశ్రా సుప్రీం కోర్టు జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News