హైదరాబాద్ : తాను ఉన్నంతకాలం పద్మశాలీలను కాపాడుకుంటానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల పద్మశాలి సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో నాటి పాలకులు పద్మశాలీల గురించి ఏనాడు పట్టించుకోలేదని అన్నారు. పద్మశాలీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌కు మనమంతా రుణపడి ఉండాలని అన్నారు.
అనాడు పాలించినోళ్లు ఓట్ల కోసమే చూశారని.. వాళ్ల ఎదుగుదలకు వాడుకున్నారని మంత్రి గుర్తు చేశారు. పద్మశాలీల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌తో మాట్లాడి కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మెగా టెక్స్‌టైల్ పార్క్ ద్వారా పద్మశాలీలకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాను ఉన్నంతకాలం పద్మశాలీలను కాపాడుకుంటానని అన్నారు. వాళ్లు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు అందిస్తానని చెప్పారు.