కొపెన్‌హెగెన్ : సోషల్ డెమోక్రాట్స్ నాయకురాలు మగ్దలినా అండర్సన్ స్వీడన్ ప్రధానిగా ఎంపికయ్యారు. దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న మగ్దలినా ఇటీవలనే సోషల్ డెమోక్రటిక్ పార్టీ కొత్తనేతగా నియామకమయ్యారు. బుధవారం స్వీడన్ పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో మగ్దలినాకు మెజారిటీ ఓట్లు వచ్చాయి. స్వీడన్ పార్లమెంటులో మొత్తం 349 మంది సభ్యులుండగా, ప్రధాన మంత్రి పదవికి జరిగిన ఓటింగ్‌లో మగ్దలీనాకు అనుకూలంగా 117 ఓట్లు లభించాయి.ఆమెకు వ్యతిరేకంగా 174 మంది ఓటు వేశారు.57 మంది ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఒకరు గైర్హాజరు అయ్యారు. అయితే స్వీడిష్ రాజ్యాంగం ప్రకారం 175 మంది వ్యతిరేకంగా ఉంటేనే ప్రధాని పదవి నుంచి వైదొలగల వలసి ఉంటుంది. ప్రస్తుతం మగ్దలీనాకు వ్యతిరేకంగా 174 మంది ఓటు వేసినందువల్ల ఆమెను ప్రధాన మంత్రి పదవిలో నియమించడానికి పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీంతో ఆమె ప్రధానిగా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఈ విజయంతో ఆమె మరో ఘనత కూడా దక్కించుకున్నారు.
స్వీడన్ దేశానికి ప్రధానిగా ఎంపికైన తొలి మహిళగా ఆమె ప్రత్యేక గుర్తింపును సాధించ గలిగారు. 2022 లో స్వీడన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. తన తదనంతరం కాబోయే ప్రధానికి ఈ ఎన్నికల సన్నద్ధత కోసం తగినంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో స్వీడన్ ప్రధాని స్టీఫెన్ లోఫ్‌వెన్ ఈ నెల 10 న తన పదవికి రాజీనామా చేశారు. ఆయన గత ఏడేళ్లుగా స్వీడన్ ప్రధానిగా పనిచేశారు. ఈనెల ప్రారంభంలో స్టీఫెన్ ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించారు. దాంతో వెంటనే మగ్దలినాను సోషల్ డెమెక్రాట్స్ నాయకురాలిగా ఎన్నుకున్నారు. స్వీడన్‌లో ఈ పరిణామం ఒక మైలురాయి వంటిది. యూరప్ దేశాల్లో లింగ సమానత సంబంధ ప్రగతిశీల దేశంగా పేర్కొంటున్న స్వీడన్‌లో ఇప్పటివరకు అత్యున్నత పదవిని మహిళలు సాధించనప్పటికీ ఇప్పుడు మహిళ ప్రధానిగా మగ్దలినా అధిరోహించడం చెప్పుకోతగ్గ విషయం. స్టీఫెన్ ప్రభుత్వం తనకు తాను స్త్రీవాదిగా పేర్కొంటున్నప్పటికీ దేశ, అంతర్జాతీయ స్థాయిలో స్త్రీలకు, పురుషులకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్టు వివరించింది.
అండర్సన్‌కు మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్ సభ్యురాలు అమినే కకబవె పార్లమెంటులో మాట్లాడుతూ స్కాండినేవియన్ దేశాల్లో సార్వత్రిక ఎన్నికల్లో స్త్రీపురుషులకు సమాన ఓటు హక్కు కల్పించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా స్వీడన్ వేడుకలు జరుపుకొంటోందని, అయినా ఇప్పటివరకు మహిళలు ఎవరూ ఉన్నత పదవుల్లోకి ఎంపిక కాలేదని, అందువల్ల ఇప్పుడీ నిర్ణయంలో ఏదో ప్రత్యేకత ఉందని అభివర్ణించారు. ప్రధానిగా ఎన్నికైన అండర్సన్ మాట్లాడుతూ తాను మహిళా ప్రధానిగా ఎన్నికయ్యానంటే మన దేశంలో మహిళలకు ఎంత ప్రాధాన్యం ఉందో దీనిబట్టి తెలుస్తుందని పేర్కొన్నారు. సోషల్ డెమొక్రటిక్ , గ్రీన్ పార్టీల కూటమి ప్రభుత్వాన్ని మగ్దలీనా శుక్రవారం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. లెఫ్ట్‌పార్టీ, సెంటర్ పార్టీల మద్దతును కూడా ఆమె కోరవచ్చు. అంతవరకు స్టీఫెన్ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తుంది.